గుడివాడలో జరిగిన రచ్చబండలో ప్రజలతో ముఖాముఖీ మాట్లాడుతున్న చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం : గ్రామంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించడం.. ఇంకా చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించడం.. గ్రామసీ మల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఏం చేస్తుం దో చెప్పుకోవడం..ఇదీ గ్రామదర్శిని కార్యక్రమ ఉద్దేశ్యం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గం ఎస్. రాయవరం మండలం గుడివాడలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమం ఇందుకు భిన్నంగా సాగింది. పల్లెల నుంచి అంతర్జాతీయ రాజకీయాల వరకు ఊకదంపుడు ఉపన్యాసాలతో సాగడంతో జనం అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీతో సహా మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం సీఎం కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీంతో సీఎం పర్యటన ఫ్లాప్ షోగా మిగిలింది.
వినతుల స్వీకరణకు దూరం
తొలుత గుడివాడ శివారు కొత్తపోలవరం ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్, అంగన్‌వాడీ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఇంకా పూర్తి కాని రూ.16 కోట్లతో చేపట్టిన అడ్డురోడ్డు –రేవు పోలవరం రోడ్డును ప్రారంభించారు. గుడివాడ ఎస్సీ కాలనీలో ముచ్చటగా మూడిళ్లకు వెళ్లి గ్రామదర్శిని మమ అనిపించారు. సీఎం తమ ఇళ్లకు వస్తారని ఆశగా ఎస్సీ కాలనీ వాసులు ఎదురు చూసినా వారి ఆశలను నీరుగారుస్తూ నేరుగా రచ్చబండ వేదిక వద్దకు వెళ్లారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. మీ సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానన్న చంద్రబాబు కనీసం సమీప ప్రాంత ప్రజల వినతులు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ధ్యాహ్నం 2.45గంటలకు బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఒకరిద్దరు లబ్దిదారులతో మాట్లాడించిన చంద్రబాబు ఆ తర్వాత తనదైన ఉపన్యాస ధోరణిలో ప్రసంగించారు. దీంతో కొద్దిసేపటికే దాదాపు గ్యాలరీలన్నీ ఖాళీ అయిపోయాయి.
సర్పంచ్‌లకు అవమానం
గ్రామదర్శిని కార్యక్రమం తీరుకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర నిరసన వ్యక్తమైంది. రచ్చబండ గుడివాడలోనూ, బహిరంగ సభ ఉప్పలం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. గుడివాడ సర్పంచ్‌ను మినహా ఉప్పలం సర్పంచ్‌తో సహా పరిసర గ్రామాల సర్పంచ్‌లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో వారంతా మండిపడ్డారు. ఉప్పలం సర్పంచ్ వీర్ల రవిశంకర్ పార్టీ అధినేతపైనే నిప్పులు చెరిగారు. ‘నా గ్రామ పరిధిలో సభ పెట్టుకుని నన్నుమాట మాత్రంగానైనా పిలవలేదు.. నాతో పాటు నా గ్రామ ప్రజలందరినీ అవమాన పర్చాడు..’ అంటూ ఒంటికాలిపై లేచారు.
ఇలా వచ్చి..అలా వెళ్లిన గంటా
కొత్త పోలవరం ఎలిమెంట్రీ స్కూల్లో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభ కార్యక్రమానికి విద్యాశాఖామంత్రిగా మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆలస్యంగా వచ్చిన గంటా నేరుగా రచ్చబండ వేదికపైకి వెళ్లి కొద్దిసేపు సీఎంకు కన్పించి వెళ్లిపోయారు. మరో వైపు పాడేరు, అరకు ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్, ఎంపీ అవంతి శ్రీనివాస్, జడ్‌పీ చైర్మన్ లాలంభవానీ తదితరులు ఈ కార్యక్రమానికి రాకపోవడం చర్చనీయాంశమయింది.
బాబు వల్లే అగ్రిగోల్డ్ డబ్బులు రాలేదు
చంద్రబాబు అడ్డుపడడం వల్ల అగ్రిగోల్డ్ డబ్బులు రూ.50 వేలు తనకు రాలేదని నక్కపల్లి మండలం చినతీనార్ల గ్రామానికి చెందిన చినఅప్పయమ్మ వాపోయింది. ప్రభుత్వం డబ్బులు తమకు వద్దు.. తమ డబ్బులు ఇప్పించండని మొర పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment