సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా టీడీపీ అధినాయకత్వం పావులు కదుపుతోందని భావిస్తున్న గంటా శ్రీనివాసరావు.. మంగళవారం సాయంత్రం అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే. విశాఖపట్నం భూకుంభకోణంలో తనకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిల్ వెనుక టీడీపీ పాత్ర ఉందని మంత్రి గంటా అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయం చెప్పినా పట్టించుకోకపోవడంతో గంటా అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది.
భీమిలి నియోజకవర్గంలోఎంపీ అవంతి శ్రీనివాస్‌తో పంచాయితీ గొడవ విషయంలోనూ టీడీపీ తీరు గంటాలో అసంతృప్తిని మరింత పెంచుతోంది. ఇటీవల ఓ సర్వే పేరుతో టీడీపీ నాయకత్వమే తన పరువు తీసిందని, నియోజకవర్గంలో తనపై వ్యతిరేకత ఉందని టీడీపీనే ప్రచారం చేయింస్తోందని ఆయన రగిలిపోతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో పాల్గొనాలా? లేదా అన్న అంశంపై మంత్రి గంటా తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఆంతరంగికులు, కార్యకర్తలతో గంటా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.
ఆ సర్వే బోగస్.. సన్నిహితులతో గంటా
విశాఖపట్నం: రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి గంటా అనారోగ్యం పేరుతో మంత్రివర్గ భేటీకి దూరంగా ఉన్నా మరోవైపు రోజంతా ఇంటి నుంచి బయటకు రాకుండా అత్యంత సన్నిహితులతో విశాఖలో సమావేశం నిర్వహించటం గమనార్హం. విశాఖ జిల్లాలో 13 చోట్ల టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉందని, గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం పార్టీ ఓడిపోతుందంటూ ఇటీవల ఓ పత్రిక సర్వే పేరుతో కథనం ప్రచురించింది. టీడీపీ అనుకూల మీడియాలో ఈమేరకు మూడు రోజుల పాటు కథనాలు రావటం గమనార్హం. ‘టీడీపీ గెలుస్తుందని చెబుతున్న ఆ 13 నియోజకవర్గాల్లో చాలా చోట్ల పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. మంత్రిగా ఉన్న నేను భీమిలీలో ఓడిపోతానంటూ కథనాలు రాశారు. అసలు ఈ సర్వే అంతా బోగస్’ అని తన సన్నిహితుల వద్ద మంత్రి గంటా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment