ఎన్నికకో నియోజకవర్గం మారుతున్న గంటా
సంచార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు
చివరి నిమిషంలో భీమిలి టికెట్ కేటాయించిన చంద్రబాబు
ఉత్తరంలో గెలిచిన ఐదేళ్లలో జనానికి ముఖం చాటేసిన వైనం
భీమిలి ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు పయనం
సాక్షి, విశాఖపట్నం: ఆయనో రాజకీయ సంచారజీవి.. పిల్లిపిల్లలను మార్చిన చందంగా ఎన్నికలకో నియోజకవర్గం మారుస్తూ.. పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో ప్రజల్ని ఏమారుస్తూ.. గెలిచిన తర్వాత.. ఓటర్లను మోసం చేస్తూ.. చివరి నిమిషంలో అక్కడి నుంచి జంప్ అయిపోతారు. ఎన్నికలకో సెగ్మెంట్ మారుస్తున్న గంటా శ్రీనివాసరావు అడ్డగోలు సంపాదన, స్థిర, చరాస్థులను కూడబెట్టడంలో మాత్రం ఏకరీతినే దూసుకుపోయారు. నిన్న మొన్నటి వరకూ టికెట్ కోసం అధిష్టానం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే స్థితికి చేరుకున్న గంటాకు.. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పగా.. చివరికి బతిమాలుకొని భీమిలి టికెట్ సంపాదించుకున్నారు.
ఈ ఎన్నికల్లో తన వలస రాజకీయంతో మరోసారి భీమిలి ప్రజలను మోసం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి ఓ దినపత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. చిరుద్యోగిగా ఆదాయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా.. ఆ తర్వాత షిప్పింగ్ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు.
1999లో అనూహ్య రీతిలో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజానికి 1999లో ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితం మొదలుపెట్టినా.. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనమైన పరిణామాల నేపథ్యంలో 2011లో తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి క్రమక్రమంగా ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో గంటాకు మళ్లీ మంత్రి పదవి రావడం దరిమిలా మొదలైన అవినీతి, అక్రమార్జన పర్వం, దోపిడీ పరాకాష్టకు చేరుకుంది.
అంతులేని గంటా గ్యాంగ్ దందాలు
ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా లెక్క చెయ్యకుండా.. అవినీతిని కొనసాగించడమే గంటా స్టైల్. గంటా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉంటున్న బహుళ అంతస్తుల భవంతితో పాటు.. ప్రత్యూష పేరుతో కంపెనీ స్థాపించి.. రూ.200 కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టేశారు. దీంతో సదరు ఇండియన్ బ్యాంకు గంటా అండ్ కో అడ్డగోలుగా సంపాదించిన పలు స్థలాల్ని వేలం వేస్తుండగా.. మరికొన్ని స్థలాల్ని స్వా«దీనం చేసుకుంది. గంటా దోపిడీ పర్వాన్ని మొత్తం లెక్క కడితే రూ.వందల కోట్లపైనే ఉంటుందని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు.
2014 నుంచి 2019 వరకూ గంటా గ్యాంగ్ భీమిలిలో సాగించిన భూదందాలతో మళ్లీ అక్కడ మొఖం చూపించలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. నమ్ముకొని ఓటేసిన భీమిలి ప్రజలకు ఏమాత్రం మంచి చెయ్యకుండా కనిపిస్తే కబ్జా పేరుతో దందా సాగించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో విశాఖలో భూ దందాలకు తెగబడినప్పుడు కీలక సూత్రధారి గంటాయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటా శ్రీనివాసరావే భూదొంగ అంటూ అదే పారీ్టకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా సిట్‌కు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టడంతో తరుణంలో భీమిలి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గంటా నిర్ణయించుకున్నారు.
ఓటేసిన జనాన్ని లెక్క చేయని గంటా..
తాను చేసిన అక్రమాలు, అవినీతి పనులు బట్టబయలు కావడంతో 2019 ఎన్నికల్లో భీమిలి ప్రజలు ఛీకొడతారని ముందుగానే ఊహించిన గంటా.. వ్యూహాత్మకంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తర సీటును దక్కించుకున్నారు. ఎలాగోలా భీమిలి నుంచి బయటపడి టికెట్ తెచ్చుకున్న గంటా.. ఎన్నికల సమయంలో ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని మోసపూరిత హామీలతో మభ్యపెట్టారు. పోలింగ్ సమయంలో చివరి నిమిషంలో బర్మాక్యాంపు తదితర కొండవాలు ప్రాంతాల్లో దొంగ ఓట్ల వ్యవహారంతో గట్టెక్కి విజయం సాధించారు.
అంతే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేటి వరకూ ఉత్తర ప్రజలకు ఒక్కసారైన మొహం చూపించకుండా ఎంవీపీలోనే తిష్టవేసుక్కూర్చున్నారు. తాము ఓటేసి గెలిపించిన పాపానికి తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన చెందుతున్న నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేకే రాజు అండగా నిలబడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు.
ఈసారి ఉత్తరంలో పోటీ చేస్తే.. ఓటమి తప్పదని భావించిన గంటా.. మరోసారి భీమిలికి వెళ్లిపోవాలని అక్కడి నేతలతో మంతనాలు ప్రారంభించారు. గెలుపొందిన చోట్ల దోపిడీకి పాల్పడే గంటా చేతిలో మరోసారి తాము మోసపోయే స్థితిలో లేమని భీమిలి ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. అయినా నిస్సిగ్గుగా భీమిలిని దోచుకునేందుకు గంటా మళ్లీ బయలుదేరడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment