సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్‌గా చెలామణి అవుతున్న టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి చేతిలో ఘోరమైన అవమానం జరిగినట్లు తెలియవచ్చింది. గంటాను ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఎత్తు వేయగా... తనకు ఓడిపోయే సీటిచ్చి పొమ్మనలేక పొగ పెడుతున్నారని గ్రహించిన గంటా దీన్ని బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. తనను విశాఖ జిల్లా నుంచి పంపేయాలని చూస్తున్నారని, అలాంటిదేమీ కుదరదని బయటక్కూడా చెప్పారు. ఇదే విషయంలో ఆయనకు, పార్టీ అధినేత చంద్రబాబుకు తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి, మాటా మాటా పెరగడంతో ‘యూజ్‌లెస్ ఫెలో.. గెటవుట్’ అంటూ గంటాపై చంద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారని తెలిసింది.
అవమానాన్ని భరించలేని గంటా... మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశారని, ఇంతటి అవమానం జరిగాక ఇక ఆ పార్టీలో కొనసాగటమెలాగంటూ సన్నిహితుల వద్ద వాపోయారని తెలియవచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను గంటా తిరస్కరించారు. అంతదూరం వెళ్లి పోటీ చేయలేనని కరాఖండిగా చెప్పేశారు. ‘మనుషులు కాదు.. పార్టీ ముఖ్యం.
పార్టీ అధినేతగా చెబుతున్నా... చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాల్సిందే’ అని బాబు కూడా అంతే స్పష్టంగా చెప్పటంతో... ‘నన్ను ఓడించేందుకే కంకణం కట్టుకున్నట్టున్నారు’ అని గంటా బిగ్గరగా బదులిచ్చినట్లు తెలిసింది. దీంతో బాబు సహనం కోల్పోయి కొన్ని మాటలనటం... గంటా కూడా ఎదురు తిరగటంతో ‘యూజ్‌లెస్ ఫెలో.. గెటవుట్’ అంటూ గంటాకు చంద్రబాబు గేటు చూపించారని సమాచారం. అవమానభారంతో బయటకు వచ్చిన గంటా... తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని, తానైతే భీమిలి నుంచే పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.
జిల్లా వెలుపల ఎప్పుడూ పోటీ చెయ్యలేదు: గంటా
చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం తనకు సూచించడం నిజమేనని గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. ఆయన గురువారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. ‘చీపురుపల్లిలో పోటీపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాక నిర్ణయాన్ని ప్రకటిస్తా. నేను గతంలో చాలా నియోజకవర్గాలు మారినా ఎప్పుడూ జిల్లా దాటలేదు. కాబట్టే చీపురుపల్లిలో పరిస్థితులను సమీక్షించి... నా నిర్ణయాన్ని అధిష్టానానికి చెబుతా’ అని గంటా అన్నారు.
ఉద్దేశపూర్వకంగానే లీకులు..!
విశ్వసనీయ సమాచారం మేరకు... వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఎక్కడా సీటు లేదని, విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు టీడీపీ సలహాదారు రాబిన్ శర్మ మొదట చెప్పారు. అయితే, అంతదూరం వెళ్లి తాను పోటీ చేయలేనని గంటా బదులిచ్చారు. దీంతో కొద్దిరోజుల క్రితం అనుకూల మీడియాలో టీడీపీ పెద్దలు చీపురుపల్లి నుంచి గంటా పోటీ చేయనున్నట్టు లీకులిచ్చారు. దీనిపై గంటా తన అనుచరుల వద్ద తీవ్రంగా మండిపడ్డారు. తనను ఓడించేందుకే ఈ కొత్త నాటకానికి తెరతీశారని వాపోయారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబుతో గంటా భేటీ అయ్యారు.
‘ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే మీరు.. ఈసారి చీపురుపల్లికి వెళ్లండి’ అని బాబు ఆదేశించారు. తాను అక్కడకు వెళ్లి పోటీ చేయలేనని, భీమిలి సీటు కావాలని గంటా కోరారు. దీంతోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment