చోడవరం: గత తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులనూ వదల్లేదు. నరకం చూపించింది. జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు మానవత్వాన్నే మరిచి అంగవైకలురుపైనా కక్షసాధింపు చర్యలకు దిగారు. పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైన వారిపైనా కర్కశం ప్రదర్శించారు. ఎన్నిసార్లు వేడుకున్నా.. పింఛన్లు మంజూరు చేయలేదు. అప్పటికే ఉన్నవీ భారీ స్థాయిలో తొలగించారు. ఫలితంగా బాధితులు అష్టకష్టాలు పడ్డారు.
పింఛన్ల మంజూరు, పునరుద్ధరణ కోసం శరీరం సహకరించకున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా నాటి ప్రభుత్వ పెద్దల మనసు కరగలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆత్మహత్యయత్నాలు చేసి తమ హక్కును సాధించుకున్నారు. ఇప్పటికీ నాటి ప్రభుత్వ అకృత్యాలను గుర్తుచేసుకుని దివ్యాంగులు మదనపడుతున్నారు. ఇక జన్మలో చంద్రబాబును నమ్మబోమని కరాఖండీగా చెబుతున్నారు. అప్పట్లో నరకం చవిచూసిన అంగవైకలుర మనో‘గతాన్ని’ ఆవిష్కరించే యత్నమిది..
అంధుడిపైనా కర్కశం: అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఖండిపల్లికి చెందిన సియాద్రి దుర్గాప్రసాద్ పుట్టుకతోనే అంధుడు. చోడవరం దివ్యాంగుల స్కూల్‌లో 10వ తరగతి చదివాడు. ఆరోగ్యం బాగోలేక మధ్యలో చదువు ఆపేశాడు. మళ్లీ ఈ ఏడాది గుంటూరు సమర్ధన ట్రస్టులో చేరి ఇంటర్మిడియెట్ చదువుతున్నాడు. 2014 ముందు వరకు ఇతనికి దివ్యాంగ పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు ఇతని కుటుంబంపై ఉన్న రాజకీయ కక్షతో పింఛన్ తొలగించారు. ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో 2017లో లోక్‌అదాలత్‌ను ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో అధికారులు పింఛన్ పునరుద్ధరించారు.
నేడు వేకువజామునే ఇంటికి..
వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారు. ఫలితంగా దివ్యాంగులు, అవ్వాతాతల మోములు ‘సిరి’నవ్వులు చిందిస్తున్నాయి.
కాళ్లు లేకున్నా.. కరుణించలేదు
నేను లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడిని. 2015లో రాజమండ్రి దగ్గర విద్యుత్ తీగలు లారీకి తగిలి ప్రమాదం జరిగింది. నేను చాలా వరకూ కాలిపోయాను. వైద్యులు నా రెండు కాళ్లూ తొలగించారు. కదల్లేని పరిస్థితి తలెత్తింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు కరుణించలేదు. చివరకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ అప్పటి కలెక్టర్ పింఛన్ మంజూరు చేయలేదు. ఆ తర్వాత కూడా సక్రమంగా పెన్షన్ నగదు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వలంటీర్ వచ్చి నగదు ఇస్తున్నాడు. – వియ్యపు సోమునాయుడు, దివ్యాంగ పింఛన్‌దారు, పెదపాడు, బుచ్చెయ్యపేట మండలం
ఆత్మహత్యాయత్నం చేస్తేకానీ ఇవ్వలేదు
నేను లారీలో పనిచేసేవాడిని. 2014లో అనకాపల్లి దగ్గర అడితీలో కర్రలు లోడ్ చేస్తుండగా అవి నాపై పడ్డాయి. కాలు, చెయ్యి పూర్తిగా విరిగిపోయాయి. వాటిని వైద్యులు శరీరం నుంచి తొలగించారు. అప్పట్లో దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేశా. జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. 2017లో బుచ్చెయ్యపేట మండల ఆఫీసు దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ పింఛన్ రాలేదు. అయినా సక్రమంగా ఇచ్చేవారు కాదు. – ఐతిరెడ్డి గోవింద, వికలాంగ పింఛన్‌దారు, ఐతంపూడి, బుచ్చెయ్యపేట మండలం
Comments
Please login to add a commentAdd a comment