రుణమో..రామచంద్రా | Orders are not available to the bank officials | Sakshi
Sakshi News home page

రుణమో..రామచంద్రా

Published Fri, Jul 25 2014 1:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

రుణమో..రామచంద్రా - Sakshi

రుణమో..రామచంద్రా

  •    మాఫీపై అయోమయం
  •   బ్యాంకు అధికారులకు అందని ఉత్తర్వులు
  •   ఖరీఫ్ రుణాలు ఇప్పట్లో  ఇచ్చేది లేదంటున్న బ్యాంకర్లు
  •   వాయిదా మీరిన పంట రుణాలపై వడ్డీభారం
  •   డ్వాక్రా సంఘాలదీ అదే తీరు
  • మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం సాచివేత ధోరణి రైతుల పాలిట శాపంగా మారింది. పాత రుణాలను రద్దు చేసి కొత్తవాటిని మంజూరు చేస్తారని ఆశపడిన అన్నదాతకు తీరని వేదనే మిగిలింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పంట రుణాలపై స్పష్టత లేదు. అసలు రుణాలు ఇస్తారా.. లేదా.. అనే విషయం కూడా తేల్చడంలేదు.
     
    ఎలాంటి ఉత్తర్వులు రాలేదు

    జిల్లాలో పంట రుణాలు రూ.2,352 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు రూ.3,276 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వం పంట రుణాలను ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షలు చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ లెక్కన రూ.700 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది. బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.50వేలు చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించింది. ఈ రకం రుణాలు రూ.900 కోట్లు మాఫీ అయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇప్పటి వరకు బ్యాంకు అధికారులకు చేరలేదు. గతంలో రుణాలు రీషెడ్యూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.
     
    స్పష్టత వచ్చే వరకు రుణాలు ఇచ్చేది లేదు
     
    రుణమాఫీ, రీషెడ్యూలుపై అయోమయం నెలకొంది. రిజర్వు బ్యాంకు నుంచి గానీ, తమ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రుణాలు ఇవ్వాలని ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో ఆయా జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్లు, చీఫ్ మేనేజర్లతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో రుణమాఫీ, పంట రుణాల మంజూరుపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే పంట రుణాల మంజూరుకు అవకాశం ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
     
    12.50 నుంచి 14.50 శాతం వరకు వడ్డీ చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా రైతులెవరూ రుణ బకాయిలు చెల్లించలేదు. ఈ ఏడాది జూన్ 30నాటికే పంట రుణాలు వాయిదా మీరాయి. వాయిదా మీరితే 12.50 శాతం నుంచి 14.50 శాతం వరకు వడ్డీ భారం పడుతుందని బ్యాంకు అధికారులు చెబు తున్నారు. ఇప్పటికే తమ రుణాలు వాయిదా మీరాయని ప్రభుత్వం ఎప్పటికి రుణమాఫీ చేస్తుందోనని, వడ్డీ భారాన్ని భరిస్తుందా.. లేదా.. అనేది ప్రశ్నార్థకమే.
     
     డ్వాక్రా సంఘాలదీ అదే తీరు

     జిల్లాలో 56,808 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 6.24 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరు రూ.938 కోట్ల మేర వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ లేదా రీషెడ్యూలు చేయాలని ఎలాంటి ఉత్తర్వులు అందలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గత మూడు, నాలుగు నెలల నుంచి డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించటం లేదు. దాదాపు రూ.32 కోట్లు బకాయి పడ్డారు. ఈ నగదుకు రూపాయి వడ్డీ చొప్పున వసూలు చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

    నిర్దేశించిన తేదీలోపు రుణం చెల్లించకపోవటంతో డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణంపై కూడా రూపాయి వడ్డీ పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రద్దు చేస్తానన్న రూ.లక్ష మొత్తాన్ని వారి ఖాతాలో డిపాజిట్ సొమ్ముగానే పరిగణించే అవకాశం ఉంది. నాలుగు నెలల నుంచి సక్రమంగా రుణం చెల్లించని నేపథ్యంలో అన్ని డ్వాక్రా సంఘాలు రుణమాఫీ జరిగిన అనంతరం ఆరు నెలల పాటు సకాలంలో రుణం చెల్లిస్తేనే వారికి మళ్లీ కొత్తగా రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం అటు రైతులకు, ఇటు డ్వాక్రా సంఘాల సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని ఆయా వర్గాలవారు పెదవి విరుస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement