ఏలూరులో సామగ్రితో సిద్ధమవుతున్న ఎన్నికల సిబ్బంది,పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న సిబ్బంది
గ్రామాలకు తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది
ఉదయం 7 నుంచి సాయంత్రం
5 గంటల వరకు పోలింగ్
1,315 పోలింగ్ కేంద్రాలు..
3,967 బ్యాలెట్ బాక్సులు
22 మండలాల్లో 10,72,793 మంది ఓటర్లు
అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 13
6,802 మందితో భారీ పోలీస్ బందోబస్తు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఆదివారం ఉద యం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 75 జోన్ల పరిధిలోని 139 రూట్లలో పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికల సిబ్బం ది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.
22 మండలాల్లో 413 ఎంపీటీసీ పదవులకు వెయ్యి మంది, 22 జెడ్పీటీసీ పదవులకు 64 మంది తలపడుతున్నారు. మొత్తం 1,315 పోలింగ్ కేంద్రాల పరి దిలో 10,72,793 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. పోలింగ్‌కు 3,967 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. వీటిలో 2,775 చిన్నవి, 277 మధ్య తరహా సైజు, 915 పెద్ద బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. వీటిని ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మొత్తంగా 6,575మంది పోలింగ్ సిబ్బంది, 6,802మంది పోలీసులు విధుల్లో పాలు పంచుకుంటున్నారు.
పోలింగ్ ఇక్కడే..
జిల్లాలో ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, చింతలపూడి, ద్వారకాతిరుమల, గణపవరం, ఉంగుటూరు, టి.నర్సాపురం, కామవరపుకోట, లింగపాలెం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాలలో పోలింగ్ జరగనుంది.
24.86 లక్షల బ్యాలెట్ పత్రాలు
జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం 12,43,050 తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను, ఎంపీటీసీ అభ్యర్థుల కో సం 12,43,050 గులాబీ రంగు బ్యాలె ట్ పత్రాలను సిద్ధం చేశారు.తొలివిడతలో మొత్తం 24,86,100 బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారు. కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఓటర్లను ప్రలోభ పెడుతున్నా, పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్‌లోని 1800-425-1365, జెడ్పీ కార్యాలయంలో 08812-232351 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. జెడ్పీలో కంట్రోల్ రూమ్ 24గంటలూ పనిచేస్తుందన్నారు.