క్యాంపునకు పోదాం... చలో చలో! | TRS party has won the election in the Zila Parishad | Sakshi
Sakshi News home page

క్యాంపునకు పోదాం... చలో చలో!

Jun 6 2019 3:27 AM | Updated on Jun 6 2019 3:27 AM

TRS party has won the election in the Zila Parishad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ రాజకీయం మరింత రసవత్తరమైంది. ఇన్నాళ్లూ ఫలితాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులంతా ఇప్పుడు క్యాంపు రాజకీయాల్లో బిజీ అయ్యారు. అధ్యక్ష ఎన్నిక గడువు ముంచుకొస్తుండడంతో ఆశావహులంతా ప్రాదేశిక సభ్యులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల రేసులో ఉన్న అభ్యర్థులు సంప్రదింపుల్లో తలమునకలయ్యారు. తమకు మద్దతివ్వాలని ప్రాధేయపడుతున్నారు. కీలక సభ్యులతో క్యాంపు రాజకీయాలు సైతం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 538 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు, 534 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈనెల 7వ తేదీన మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఈనెల 8న జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

గులాబీదే ఆధిక్యమైనా...
జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ సభ్యులు అధికారపార్టీకి చెందిన వారే గెలుపొందడంతో 32 జిల్లాల్లో జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ పీఠాలను ఆ పార్టే కైవసం చేసుకోనుంది. పార్టీ ఆదేశానుసారం ఖరారైన అభ్యర్థులకే టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ సభ్యులు మద్దతు పలికే అవకాశం ఉండడంతో జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో పెద్దగా ఇబ్బంది లేదు. అయినప్పటికీ సభ్యులంతా అందుబాటులో ఉండేలా ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా మండల పరిషత్‌ స్థానాల్లోనూ అధికార పార్టీనే మెజార్టీ సీట్లు దక్కించుకుంది. కొన్ని మండలాల్లో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని ప్రదర్శించింది.

దీంతో హస్తం పార్టీ సభ్యులు ఎక్కువగా ఉన్న మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను దక్కించుకోవాలని కాంగ్రెస్‌ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 534 మండలాల్లో 437 మండల పరిషత్‌ పీఠాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి. మరో 67 మండలాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మిగతా 30 స్థానాల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాకపోవడంతో అక్కడ హంగ్‌ వాతావరణం కనిపిస్తోంది. ఈ మండలాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రెబెల్స్, స్వతంత్రులు, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యుల మద్దతు కీలకం కానుంది. దీంతో వీరిని బుట్టలో వేసుకునేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

రాజధాని సమీపంలో..
పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ నెల 7, 8వ తేదీల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక ఉండడంతో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మండలాల్లో స్పష్టమైన ఆధిక్యం ఉన్న చోట్ల కూడా క్యాంపులకు ఆస్కారమవుతోంది. సభ్యులు అందుబాటులో ఉండేలా, ఎన్నిక సమయానికి నేరుగా అక్కడికి చేరుకునేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా నగరానికి సమీపంలో ఉన్న రిసార్టులు, హోటళ్లలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు రెండ్రోజులే గడువు ఉండటంతో ఆర్థిక భారం పెద్దగా ఉండదని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ తరహా క్యాంపులకు తెరలేపాయి.

మరోవైపు హంగ్‌ ఉన్న మండలాల్లో అధికారపార్టీ తన బలాన్ని ప్రదర్శించేందుకు కృషి చేస్తోంది. సంబంధిత ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కీలక అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. స్వతంత్ర, ఇతర పార్టీకి చెందిన వారిని తమవైపునకు తిప్పుకునేందుకు భారీ మొత్తంలో తాయిలాలు ప్రకటిస్తున్నా రు. రిజర్వ్‌ స్థానాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవినే కట్టబెడతామని ప్రలోభ పెడుతుండటంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొత్తంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ముగిసే దాకా ఈ క్యాంపు రాజకీయాలు జోరుగా సాగనున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement