సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధిస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాలకు 32 జిల్లాపరిషత్ అధ్యక్ష పీఠాలను టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయ మని స్పష్టం చేశారు. వీటితో పాటు ఎన్నికలు జరుగనున్న 530కి పైగా మండల పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు రానున్న ఎన్నికల్లోనూ నిరాశ తప్పదన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ఎన్నికల కమిషన్‌ను కోరిన నేపథ్యంలో రానున్న వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలవారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. గత నెల రోజులుగా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించామని, ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి బ్రహ్మరథం పట్టనున్నారని కేటీఆర్ తెలిపారు. ఇదే తరహాలో వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో పనిచేయాలన్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల సేవలను వినియోగించుకొనేలా ముందుకు పోతామన్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సమావేశం జరిపి మార్గదర్శనం చేస్తారని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment