ఎంపీపీల గుర్రు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మండల పరిషత్ కార్యాలయాల్లో జిల్లా పరిషత్ సభ్యులకు సీట్లు కేటాయించాలనే నిర్ణయం ఇప్పటికే వివాదాస్పమై.. రానున్న రోజుల్లో ఎన్ని సమస్యలకు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మండల పరిషత్‌లలో ఉన్న గదులు అధికారుల విధుల నిర్వహణకే సరిపోవడం లేదు. ఇప్పుడు కొత్తగా జడ్పీటీసీ సభ్యులకు కూడా చాంబర్, సీట్లు కేటాయించాలంటే తాము ఖాళీ చేసి బయటకు పోవాల్సిందే’నని మండల పరిషత్ అధ్యక్షులు మండిపడుతున్నారు. వాస్తవానికి జడ్పీటీసీలు గతం నుంచే మండల పరిషత్‌లలో సీటు కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇదే జరిగితే మండల పరిషత్‌లకు సమాంతరంగా జడ్పీటీసీలు పాలన సాగిస్తారని, దాని వల్ల అనవసర వివాదాలు తలెత్తుతాయనే ముందుచూపుతో ప్రభుత్వం ఇందుకు సమ్మతించలేదని అంటున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గత నెల 24న జరిగిన జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో మండల పరిషత్ కార్యాలయాల్లో జడ్పీటీసీలకు సీటు కేటాయించాలని తీర్మానించారు.
దీంతో పాటు జిల్లాలోని టోల్‌ప్లాజాల ద్వారా ఉచితంగా ప్రయాణం డిమాండ్ కూడా లేవనెత్తారు. ఈ డిమాండ్ చేసింది సహచర సభ్యులే కావడం, వారి సహకారంతోనే చైర్‌పర్సన్ పీఠం అధిరోహించడంతో నామన రాంబాబు కాదనలేకపోయారు. ఇందుకు ప్రతిగా జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున చప్పట్లతో సభలో స్వాగతం పలికి నామనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తీరా ‘సీటు’ నిర్ణయం అమలులోకి వచ్చేసరికి ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యుల మధ్య ఆధిపత్య పోరుకు తెరతీసింది. జిల్లాలో ఈ వివాదానికి అంకురార్పణ తుని రూరల్ మండల పరిషత్‌లో జరిగింది. తుని ఎంపీపీ పల్లేటి నీరజకు కనీస సమాచారం లేకుండా జడ్పీటీసీ సభ్యురాలు జె.వెంకటలక్ష్మికి సోమవారం అడ్డగోలుగా చాంబర్ కేటాయించడం వివాదాస్పదమై పోలీసు కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇన్‌ఛార్జి ఎండీవో, ఈవోపీఆర్డీ కె.శేషారత్నం ఆత్యుత్సాహం ఫలితంగానే ఈ వివాదం తలెత్తిందని జిల్లావ్యాప్తంగా ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీపీ కార్యాలయంలో జడ్పీటీసీకి సీటు కేటాయించే అవకాశాన్ని అటుంచితే.. తునిలో ఈవోపీఆర్డీ దుందుడుకుగా కేటాయించే పద్ధతి కారణంతో వివాదం ముదురుపాకాన పడిందని పలువురు ఎంపీపీలు అభిప్రాయపడుతున్నారు. జడ్పీలో తీర్మానం చేశారనే ఏకైక కారణంతో ముందస్తు సమాచారం లేకుండా ఒక ఎంపీపీని అవమానించే రీతిలో తునిలో సీటు కేటాయించారని జిల్లాలోని మిగతా ఎంపీపీలు గుర్రుగా ఉన్నారు. ఇవాళ తునిలో అయ్యింది రేపు మరో మండల పరిషత్‌లో పునరావృతం కాదనే గ్యారెంటీ ఏమిటనే ప్రశ్న అధికార పార్టీకి చెందిన ఎంపీపీలు కూడా లేవనెత్తుతున్నారు. పార్టీ ఏదైనా ఎంపీపీలంతా ఒకే మాటమీద ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కాజులూరు మండల పరిషత్ అధ్యక్షుడు యాళ్ల కృష్ణారావు మంగళవారం తీవ్రంగా స్పందించారు.
తునిలో జరిగిన వివాదాన్ని తక్షణం పరిష్కరించాలని ఆయన ఒక పత్రికా ప్రకటనలో డిమాండ్ చేశారు. అవగాహన లేని పంచాయతీరాజ్ అధికారులతోనే ఎంపీపీలు, జడ్పీటీసీల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ విషయంలో ఇకనైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలంటున్నారు. జడ్పీలో తీర్మానం, వారికి చాంబర్‌ల కేటాయింపు తదితర అంశాలపై పార్టీరహితంగా ఎంపీపీలంతా ఒకటి, రెండు రోజుల్లో సమావేశం అవుతున్నారు. అ సమావేశంలోనే దీనిపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలనుకుంటున్నారు. జడ్పీ నిర్ణయం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.