సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాష్ట్ర సర్కారు బంపర్‌ఆఫర్ ఇచ్చింది. ఏళ్లుగా వేతన పోరాటాలు చేస్తున్న వారికి భారీ నజరానా ప్రకటించింది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్లు, కౌన్సిలర్ల వేతనాలను పెద్ద మొత్తంలో పెంచింది. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో వేతన పెంపు ప్రకటన చేయడంతో ప్రజాప్రతినిధుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
భారం రూ.7.67 కోట్లు
ప్రజాప్రతినిధుల వేతన పెంపుతో సర్కారుపై భారం తీవ్రం కానుంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రజాప్రతినిధులకు యేటా రూ.1.46కోట్లు గౌరవవేతన రూపంలో పంపిణీ చేస్తున్నారు. తాజాగా వారి వేతనాలు పెంచడంతో.. ఇకపై ఏటా రూ.9.141 కోట్లు వేతనాల రూపంలో పంపిణీ చేయాలి. ఈ లెక్కన ఏటా రూ.7.67కోట్ల భారం జిల్లాపై పడుతుంది.
నరేందర్ చొరవ..!
స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవవేతనాల సవరణలో ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. వేతనాల పెంపుపైపంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఒప్పించేందుకు చొరవచూపారు. స్థానిక సంస్థల ప్రతినిధి బృందాలను ఐక్యం చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చేయడంలో సఫలమయ్యారు.
డైనమిక్ సీఎం
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. స్థానిక సంస్థల పట్ల ఆయనకున్న అభిమానాన్ని వేతన పెంపు రూపంలో చూపించారు. ఇరవై ఏళ్లుగా వేతనాల పెంపుకోసం ఉద్యమిస్తుండగా.. ప్రస్తుత సీఎం నిర్ణయాన్ని ప్రకటించడం ఆనందకరం. గతంలో సీఎంలకంటే కేసీఆర్ డైనమిక్ సీఎం కాబట్టి.. ఆయన సాహసోపేతంగా వేతనాల పెంపు ప్రకటన చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు కూడా ఇస్తారు.
- పి.సునీతారెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
మాకు ఇంకాస్త పెంచాల్సింది..
వేతనాల పెంపును మేము స్వాగతిస్తూ కేసీఆర్‌ను అభినందిస్తున్నాం. కానీ జెడ్పీటీసీల వేతనాన్ని రూ.10వేలకు మాత్రమే పెంచారు. కనిష్టంగా రూ.25వేలు పెంచితే బాగుండేది. ఎమ్మెల్యే వేతనంలో కనీసం పావువంతైనా జెడ్పీటీసీకి ఇవ్వాలి. జెడ్పీటీసీలకు మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నా.
- జంగారెడ్డి, కాంగ్రెస్ జెడ్పీటీసీల ఫ్లోర్‌లీడర్
సర్కార్ నిర్ణయంపై హర్షం
Published Sat, Mar 14 2015 12:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement