కొత్త బాధ్యతలు
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం కొత్తగా మరో 30 విధులను అప్పగించింది. గతంలో వీరు 64 బాధ్యతలను నిర్వహించేవారు. దీనికి తోడు అదనంగా మరికొన్ని బాధ్యతలను ప్రభుత్వం వీరిపై పెట్టింది. జిల్లాలో 26 మండలాల్లో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలనా బాధ్యతలను చూసుకోవడంతోపాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని సూచించింది.
పంచాయతీలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీలు, మొక్కలు నాటడం, పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 42, సెక్షన్ 286 ప్రకారం, సెక్షన్ 43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు, విధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ 6 (8) ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కార్యదర్శిదేనని పేర్కొంది. గ్రామ పాలకవర్గం ఆమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది.
24 గంటల్లో అనుమతులు..
భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతి ఇవ్వాలని సూచించింది. అంతే కాకుండా లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7 రోజుల్లో అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. లేఅవుట్ల అనుమతిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లేఅవుట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. గ్రామంలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు గ్రామస్తులకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతోపాటు వివాహ రిజిస్ట్రేషన్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది.
ఇవీ మార్గదర్శకాలు..
పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి సబార్డినేట్‌గా వ్యవహరించాలి.
గ్రామసభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి.
ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఖర్చుకు సంబంధించిన లెక్కలను పంచాయతీ ఆమోదానికి సమర్పించాలి.
వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, రోడ్లు, రైలు ప్రమాదాలు సంభవించిన సందర్భాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలి.
గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు తెలియపర్చాలి.
గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీలో పాలుపంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ నిర్వహించే నెలవారీ సమావేశాలకు హాజరు కావాలి.
గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాల వసూళ్లకు సహకరించాలి.
అంశాల వారీగా ఎజెండాలను సిద్ధం చేసి గ్రామ పంచాయతీ ఆమోదం పొందడం.
ఎజెండాను ప్రదర్శించడం, దండోరా వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచారం చేరేలా చూడడం.
బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు, పంచాయతీ ఫలాలు అందేలా చూడాలి.
వార్షిక పరిపాలన నివేదికను రూపొందించి గ్రామ పంచాయతీ ఆమోదం తీసుకోవడం.
నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన, ఉన్నతాధికారులకు నివేదికను అందించడం, సర్పంచ్‌తో కలిసి అభివృద్ధి పనులకు పర్యవేక్షణ.
ప్రతీ మూడు నెలలకోసారి పంచాయతీ ఆర్థిక వ్యవహారాలను ఆదాయ, వ్యయ వివరాలను పంచాయతీ ఆమోదించడంతోపాటు ఈఓపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం.