సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. జిల్లా పరిషత్ పీఠం బోయ కులస్తులకు కట్టబెడుతూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపింది. బీసీల పార్టీగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ఆ వర్గీయులను అనాదిగా తొక్కిపెడుతోంది. అవకాశం వచ్చిన ప్రతిసారీ పీఠం ఎక్కకుండా అడ్డుపడుతోంది.
ఇందుకు అతీతంగా వైఎస్‌ఆర్‌సీపీ తీసుకున్న నిర్ణయాన్ని బీసీ వర్గీయులు హర్షిస్తున్నారు. చెప్పడం కాదు.. చేసి చూపిన పార్టీగా అభినందిస్తున్నారు. అండగా నిలుస్తామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్‌కు బీసీ కులానికి చెందిన మహిళను అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం మహిళా లోకానికి వరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నూలు జిల్లా పరిషత్ పీఠాన్ని మొట్టమొదటి సారిగా స్వర్గీయ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి అలంకరించారు.
రిజర్వేషన్లు అమలు కాకముందు అగ్రవర్ణాల నాయకులే ఆ పీఠాన్ని అధిష్టించారు. రాజకీయ రిజర్వేషన్లు అమలయ్యాక పరిస్థితులు తారుమారయ్యాయి. తాజాగా కర్నూలు జెడ్పీ సీటు బీసీలకు రిజర్వు కావడంతో అగ్రవర్ణాలను నిరుత్సాహానికి గురిచేసింది. బీసీలకు వచ్చిన ఈ అవకాశం నేపథ్యంలోనూ ఏ వర్గీయులను కూర్చోబెట్టాలనే విషయమై కాంగ్రెస్, టీడీపీ ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకసారి కర్నూలు పార్లమెంట్‌కు, మరోసారి నంద్యాల పార్లమెంట్‌కు జెడ్పీగిరిని పంచుతున్నాయి.
తద్వారా ఇరు ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలకు తెరతీశాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య కుమ్ములాటలు.. విభేదాల నేపథ్యంలో బీసీల్లో ఎవరిని పీఠంపై కూర్చోబెట్టాలో తేల్చుకోలేకపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక న్యాయం అమలు చేస్తామని.. బీసీలకు అండగా నిలుస్తామని ప్రకటిస్తూ వచ్చారు. అలాంటి అధినేత ఎదుటే.. అప్పుడే పార్టీలో చేరిన వాల్మీకి సామాజిక వర్గీయుడైన డాక్టర్ పార్థసారధిపై దాడి జరగడం గమనార్హం.
బీసీ జపం చేస్తున్న చంద్రబాబు ఎదుటే తమ్ముళ్లు ఆయనను కుళ్లబొడవటం ఆయన ద్వంద్వ నీతికి అద్దం పట్టింది. ఇక కాంగ్రెస్ మొసలి కన్నీళ్లు సరేసరి. పెద్దరెడ్డి ఎవరి పేరు చెబితే వారే పీఠం ఎక్కాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాల తరఫున పుట్టుకొచ్చిన.. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు కట్టుబడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు సాగుతోంది. జిల్లాలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గమైన బోయలకు జెడ్పీ పీఠాన్ని కట్టబెడుతూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం వాల్మీకుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చింది.
బోయలకే జెడ్పీపీఠం
Published Fri, Apr 4 2014 1:36 AM | Last Updated on Fri, Jul 12 2019 3:31 PM
Advertisement
Advertisement