దుర్మార్గం | tdp voilates rules in zp charman election | Sakshi
Sakshi News home page

దుర్మార్గం

Published Sun, Jul 6 2014 3:13 AM | Last Updated on Tue, Oct 30 2018 4:15 PM

దుర్మార్గం - Sakshi

దుర్మార్గం

తలుపులు మూసి జెడ్పీ చైర్మన్ ఎన్నిక
- అడుగడుగునా అధికార దుర్వినియోగం
- ఓడిన ఓటరన్న ఆశయం
- ఖూనీ అయిన ప్రజాస్వామ్యం
- ఎమ్మెల్యేలని చూడకుండా గెంటేసిన వైనం
- కీలుబొమ్మలుగా మారిన అధికారులు
- మెజారిటీ వైఎస్సార్సీపీకి పీఠం టీడీపీకి
- భూమా ప్రశ్నలకు నీళ్లు నమిలిన అధికార యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లా పరిషత్‌లో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా టీడీపీ నాయకులు బరితెగించారు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అడ్డదారులు తొక్కారు. జిల్లా అధికారులూ వీరికి వంతపాడారు. ఫలితంగా శనివారం నిర్వహించిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకపక్షంగా ముగిసింది. మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకొన్న వైఎస్సార్సీపీకి కాదని టీడీపీ జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోగలింది.

ఓటరు ఒక ఆశయంతో తీర్పు ఇస్తే.. మరో ఆశయంతో పచ్చ పార్టీ దుర్మార్గానికి పాల్పడి బలవంతంగా గద్దెనెక్కింది. జిల్లాలో 53 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీకి అత్యధికంగా 30 స్థానాలను ఓటర్లు కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీ 20 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 2, ఆర్‌పీఎస్ ఒక స్థానంలో గెలిచాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను బెదిరించి, భయపెట్టి, డబ్బులు ఎర చూపి తమ వైపునకు తిప్పుకున్నారు. అడుగులకు మడుగులొత్తే అధికారుల సహకారం కూడా తీసుకున్నారు.
 
జెడ్పీ సీఈఓ కనుసన్నల్లోనే అంతా..

జెడ్పీ సీఈఓ సూర్యప్రకాషరావు కనుసన్నల్లో శనివారం జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగింది. జెడ్పీ సమావేశ మందిరంలో బారికేడ్లు కట్టడం నుంచి జెడ్పీ చైర్మన్ ప్రమాణ స్వీకారం వరకు ఆయన అంతా తానై నడిపించారు. జెడ్పీ హాల్‌లో వైఎస్సార్‌సీపీకి వేరుగా.. టీడీపీకి వేరుగా సీట్లు ఏర్పాటు చేశారు. మధ్య బ్యారికేడ్లు ఉంచారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారిని దగ్గరుండి ‘పచ్చ’ పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను అడ్డుకునే విషయంలోనూ ఈయన పాత్ర ఉందని సమాచారం.

టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టేలా ప్రవర్తించటం కూడా అందులో భాగమేనని ప్రచారం జరుగుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పలుమార్లు కలెక్టర్‌ను నిలదీశారు. అధికారులు చేసిన తప్పును ఎత్తిచూపారు. అధికార యంత్రాంగం చేసింది తప్పేనని అర్థం కావటంతో కలెక్టర్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. సుమారు నాలుగు గంటల పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ నిరసన తెలియజేస్తున్నా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. పలు ప్రశ్నలకు అధికారులు నీళ్లునమిలారు.

భూమా నాగిరెడ్డి పలుమార్లు జీఓ కాపీని చూపించి మాట్లాడుతుంటే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ‘మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మాకు అడిగే హక్కు ఉంది. ఎమ్మెల్యేలను తాకే అధికారం పోలీసులకు లేదు. మీరు ఇలా చేయమని ఏ చట్టం చెపుతోంది’ అంటూ పలు ప్రశ్నలు సంధించటంతో కలెక్టర్, జేసీ, సీఈఓలు పక్కనే ఉన్న న్యాయనిపుణులతో మాట్లాడటం కనిపించింది. ‘ఇలా చేయొచ్చని రాత పూర్వకంగా రాసివ్వండి’ అని పలుమార్లు కలెక్టర్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఐజయ్యలు నిలదీశారు. ఎమ్మెల్యేలు ఓ పక్క నిరసన తెలియజేస్తుంటే.. సీఈఓ మాత్రం సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించండి అంటూ కలెక్టర్‌కు చెప్పటం కనిపించింది.
 
పక్కా పథకం ప్రకారమే..
జెడ్పీ చైర్మన్ ఎన్నికను పక్కా పథకం ప్రకారం పూర్తి చేయించారు. అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఇలాగే కొనసాగితే పథకం తిరగబడుతుందని తెలిసి ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. ముందుగా టీడీపీ జెడ్పీటీసీలు కొందరిచేత ప్రమాణం చేయించారు. తాము న్యాయం అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా ప్రమాణం చేయటంపై భూమా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ‘కలెక్టర్ గారూ.. కలెక్టర్ గారూ.. అంటూ గట్టిగా అరిచారు.

సమాధానం రాకపోవటం, పోలీసులు దౌర్జన్యానికి దిగటంతో ‘కలెక్టర్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ వారు ప్రమాణం చేయరని భావించి, జాబితాలో వారి పేర్లను మాత్రం టిక్ చేశారు. ఎవరు టీడీపీ, ఎవరు వైఎస్సార్‌సీపీ, ఎవరు పార్టీ ఫిరాయించారనే వివరాలను క్షణాల్లో కలెక్టర్‌కు ఇచ్చారు. వారిని మాత్రం పిలవబోమని సూచించారు. సీఈఓ చెప్పిన విధంగానే కలెక్టర్ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యుల పేర్లు చదవుకుంటూ వెళ్లారు. వారెవ్వరూ ప్రమాణం చేయలేదని, ఎన్నిక జరక్కుండా చేస్తారని ఎమ్మెల్యేలని చూడకుండా బయటకు ఎత్తుకెళ్లారు.

ముందుగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. అదే విధంగా ఆదోని, మంత్రాలయం, డోన్ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, బుగ్గన రాజారెడ్డిని ఎత్తుకునేందుకు ప్రయత్నించారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను సైతం మహిళా పోలీసులచేత ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులను బయటకు పంపేసి తలుపులు మూసివేశారు. పదినిముషాల్లో జెడ్పీ చెర్మైన్, వైస్ చైర్మన్ ఎంపికను పూర్తి చేసి హడావుడిగా వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement