అనుకున్నదొక్కటి అయిందొక్కటి ! | transfer power government of the District Committee of Zilla Parishad | Sakshi
Sakshi News home page

అనుకున్నదొక్కటి అయిందొక్కటి !

Published Mon, Jun 1 2015 11:33 PM | Last Updated on Sat, Aug 11 2018 3:38 PM

transfer  power government of the District Committee of Zilla Parishad

ప్రతిపక్షాలను దెబ్బతీద్దామనుకుంటే
 పార్టీలోనే అసంతృప్తి
 జెడ్పీ చైర్మన్లను డమ్మీ చేసిన సర్కార్ !
 బదిలీల్లో పక్కన పెట్టేసిన పరిస్థితి
 కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి, సీఈఓకు జెడ్పీ ఉద్యోగుల బదిలీల బాధ్యతలు
 వైఎస్సార్‌సీపీ ప్రాతినిధ్యం వహించిన
 జెడ్పీలో పెత్తనం చెలాయించేందుకు కుట్ర
 ఇరకాటంలో పడ్డ టీడీపీ జెడ్పీ చైర్మన్లు
 తమను అవమాన పరిచారని ఆవేదన
 చెందుతున్న ఆ పార్టీ చైర్మన్లు

 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం:  జిల్లా పరిషత్‌లో  బదిలీల అధికారాన్ని కూడా జిల్లా కమిటీ కి సర్కార్ అప్పగించింది. జెడ్పీ చైర్మన్‌ల్ని దాదాపు డమ్మీ చేసేసింది. కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి, జెడ్పీ సీఈఓ ఆధ్వర్యంలోనే బదిలీలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనివెనుక రాజ కీయ దురుద్దేశం ఉందని పరిశీలకులు భావి స్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా పరిషత్‌లో తమకు నచ్చినట్టుగా బదిలీలు చేయించుకోవాలన్న ఏకైక వ్యూ హంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  అయితే ఈ వ్యవహారం అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి రగిల్చింది.  తమ అధికారాల్ని వేరే వారికి అప్పగించి తమను అవమానపరిచారనే ఆవేదనతో టీడీపీ జెడ్పీ చైర్మన్లు ఉన్నారు.  
 
  జిల్లా పరిషత్‌లో బదిలీల అధికారమంతా జెడ్పీ చైర్మన్లకే ఉండేది. ఏటా వారి ఆధ్వర్యంలోనే బదిలీలు జరిగేవి. స్థానిక సంస్థలపై ప్రభుత్వం పెత్తనం తగ్గాలని, స్థానిక సంస్థల అధికారాలు పెరగాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు  బదిలీల అధికారాన్ని జెడ్పీకే అప్పగించాయి.  కానీ రాష్ట్రంలో మూడు జెడ్పీల్లో వైఎస్సార్‌సీపీ ప్రాతినిధ్యం వహిస్తోందని, తమకు నచ్చినట్టుగా అక్కడ బదిలీలు జరగవన్న అక్కసుతో కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి, జెడ్పీ సీఈఓలతో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీకి బదిలీల అధికారాన్ని చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. దీంతో జెడ్పీ చైర్మన్లు బదిలీల విషయంలో డమ్మీ అయిపోయారు.  
 
 వైఎస్సార్‌సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో తమ పెత్తనమే సాగుతుందని కొందరు  అధికారపార్టీ నేతులు ఆనందించినా...   ఆ పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్లు మాత్రం ఆవేదనతో ఉన్నారు. బదిలీల విషయంలో తమ మాట చెల్లుబాటు కాకపోవడమే కాకుండా అధికారాన్ని తీసేసి అవమాన పరిచారని బాధపడుతున్నారు. ఎందుకంటే, పలు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు, కలెక్టర్ల మధ్య పొసగడం లేదు, మరికొన్నిచోట్ల చైర్మన్లు, మంత్రుల మధ్య పడటం లేదు. ఈ నేపధ్యంలో కలెక్టర్లు హవాయే నడుస్తోందని కొందరు, ఇన్‌చార్జి మంత్రికి అప్పగించడం వల్ల  జిల్లా మంత్రే పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తారని, దీనివల్ల తమను పట్టించుకునే అభద్రతా భావంతో పలువురు చైర్మన్లు ఉన్నారు.  జిల్లాలో జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి -కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మధ్య, జెడ్పీ చైర్‌పర్సన్ - మంత్రి మృణాళిని మధ్య అభిప్రాయ బేధాలున్నాయి.  గత ఏడాది జిల్లా అధికారుల బదిలీల్లో తమ సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వలేదని జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి అసంతృప్తితో ఉన్నారు.  
 
  నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఒక్క విజయనగరంలోనే కాదు టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో చైర్మన్లను  పక్కన పెట్టి కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి, జెడ్పీ సీఈఓకు బదిలీల బాధ్యతను అప్పగించడంతో వారంతా తీవ్ర ఆవేదనతో ఉన్నారు.  ఇదే విషయమై   పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని కలవాలని జెడ్పీ చైర్మన్లు భావించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించారని అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తారన్న భయంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఏదేమైనప్పటికీ తీవ్ర స్థాయిలో అంతర్మధనం చెందుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement