నెల్లూరులో టీడీపీ నేతల వీరంగం | tdp leaders create rucckus in nellore zp elections | Sakshi
Sakshi News home page

నెల్లూరులో టీడీపీ నేతల వీరంగం

Published Sat, Jul 5 2014 3:32 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

నెల్లూరులో టీడీపీ నేతల వీరంగం - Sakshi

నెల్లూరులో టీడీపీ నేతల వీరంగం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంగం వేస్తున్నారు. జిల్లా పరిషత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నా, ఎలాగోలా ప్రలోభాలతో జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికను వాయిదా వేయించి ప్రలోభాలకు మరికొంత సమయం తీసుకోవాలని టీడీపీ చూస్తోంది. శనివారం మధ్యాహ్నం నెల్లూరులో కలెక్టర్ అధ్యక్షతన జడ్పీ ఛైర్పర్సన్ ఎన్నికకు సమావేశం ప్రారంభం కాగానే కొద్ది సేపటికే తెలుగుదేశం నాయకులు వీరంగం వేశారు.

వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అయితే నేరుగా వేదిక మీదకు వెళ్లి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ను నానా దుర్భాషలాడి, ఆయన ముందున్న మైకులను కూడా విరిచిపారేశారు. పరోక్ష పద్ధతిలో, సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక నిర్వహించాలని, లేనిపక్షంలో వాయిదా వేయాలని ఆయన పట్టుబట్టారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పోడియం ముందు బైఠాయించి, ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని విశ్వప్రయత్నాలు చేశారు.

కలెక్టర్ మాత్రం అక్కడి పరిస్థితి మొత్తాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వివరిస్తూ లేఖ పంపారు. అక్కడి నుంచి అందిన ఉత్తర్వులు, సూచనల మేరకు తాను స్పందించి ఎలా చెబితే అలా చేస్తానని కలెక్టర్ చెప్పారు. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో మొత్తం 46 మండలాలున్నాయి. వీటిలో 31 జడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కగా, టీడీపీ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకుంది. అయినా సరే.. ఎలాగోలా ప్రలోభాలతో నెట్టుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. వాళ్లు ఎంత రెచ్చగొట్టినా, వైఎస్ఆర్ సీపీ నాయకులు మాత్రం పూర్తి సంయమనం పాటిస్తూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement