ఫైల్‌  లేకుండానే నిర్ణయం? | There should be a file according to the Rules for the issue of an election postpone notification | Sakshi
Sakshi News home page

ఫైల్‌  లేకుండానే నిర్ణయం?

Published Tue, Mar 17 2020 4:36 AM | Last Updated on Tue, Mar 17 2020 9:21 AM

There should be a file according to the Rules for the issue of an election postpone notification - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఉన్నఫళంగా, అర్ధంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ దశల్లో చర్చ జరిగి తుది నిర్ణయం వెలువరించాల్సింది ఉండగా.. హడావుడిగా, రహస్యంగా వెనక ఎవరో తరుముతున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్రంలో దుమారం రేగింది. ఎన్నికలు వాయిదా వేయడం అనేది చాలా కీలక నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్ర ముఖ్య అధికారులతో సమీక్షించడం, అవసరమనుకుంటే రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడటం అవసరం. ఆ తర్వాత వివిధ దశల్లో ఫైల్‌ తయారవుతుంది. ఏ దశలో ఎలాంటి అంశాలు అందులో చోటు చేసుకున్నాయో స్పష్టంగా ఉంటుంది. ఇలాంటి ప్రక్రియ ఏమీ లేకుండానే.. ఎక్కడో నాలుగు పేజీల్లో టైప్‌ చేయించుకొచ్చిన సమాచారాన్నే ‘ఎన్నికల వాయిదా నోటిఫికేషన్‌’గా కమిషనర్‌ మీడియాకు విడుదల చేయడం పలు సందేహాలకు తావిస్తోంది.

ఎవరో వెనుక ఉండి నడిపించారనే చర్చ సాగుతోంది. కీలక ఉత్తర్వులు వెలువడటానికి వెనక సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయంలో లోతైన అధ్యయనం సాగుతుంది. అయితే ఎన్నికల వాయిదా లాంటి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకొనే ముందు ఇలాంటి కసరత్తు, చర్చ జరగలేదని అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అసలు ఫైలే తయారు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే అత్యంత రహస్యంగా ఎవరి కోసమో ఈ వ్యవహారం సాగినట్లు స్పష్టమవుతోంది. కాగా, ఎన్నికలను వాయిదా వేస్తున్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో పాటు పలువురు సీఐలను బదిలీ చేయడంపై పలు విమర్శలు  వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని చెప్పడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ తన పరిధి దాటి వ్యవహరించిందని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  

ఇళ్ల పట్టాల పంపిణీ ఇప్పటి నిర్ణయమా? 
- పేదలకు ఉగాది రోజున పంపిణీ చేయాల్సిన ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని కూడా ఆపేయాలని చెప్పడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి లబ్ధి కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రంలో ప్రజలు మండిపడుతున్నారు.   
- ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.  
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయమిది. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్ట్‌ ఇది.  
- ఈ దిశగా ఇప్పటికే భూ సేకరణ జరిగింది.. లబ్ధిదారులను సైతం గుర్తించారు..  
- వారి పేర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ప్రదర్శించారు.  
- ఆ జాబితాల్లో పేర్లు లేని అర్హులెవరైనా ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తున్నారు.  
- ఇప్పుడు మిగిలింది కేవలం పట్టాలు పంపిణీ చేయడమే.  దీనిని కూడా ఎన్నికల కమిషన్‌ అడ్డుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
- లబ్ధిదారులెవరో ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో పట్టాలు పంపిణీ చేయడానికి అభ్యంతరం ఏమిటి? 

‘స్థానిక’ ఎన్నికలపై చిన్నచూపు! 
- సకాలంలో ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా 2016 నుంచి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొనసాగుతున్నారు.  
- రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం 2018లోనే ముగిసింది. అప్పట్లోనే ఎన్నికలు నిర్వహించాలని అప్పటి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం లేఖ కూడా రాయలేదు.  
- ఈ విషయంలో ఎన్నికల కమిషనర్‌ విఫలమయ్యారని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 
- సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమిస్తే.. అధికారులకు స్థానిక సంస్థలను అప్పగించవద్దని, తమను కొనసాగించాలని 2018లో సర్పంచ్‌లు హైకోర్టుకు వెళ్లారు. 
- 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. 
అప్పట్లో టీడీపీ ప్రభుత్వ పెద్దలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం.. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను నష్టపోవడానికి సైతం సిద్ధపడి, ఎన్నికల నిర్వహణకు ఆసక్తి చూపలేదు. 
- అయినప్పటికీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న రమేష్‌కుమార్‌ పట్టించుకోలేదని ఆ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. 
పర్యవసానంగా ఈ నెలాఖరులోగా ఎన్నికలు జరగకపోతే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు విడుదల కావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 3,710 కోట్లు, మున్సిపాలిటీలకు రావాల్సిన రూ.1,400 కోట్లు వదులుకోవాల్సి ఉంటుంది.  
గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వాలు అడ్డుపడుతున్నప్పుడు విచక్షణాధికారం ఉపయోగించకుండా, సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలను నిర్వహిస్తుంటే అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

ఉత్తర్వులకు ఇదీ పద్దతి
- అధికారులు తీసుకున్న నిర్ణయానికి ప్రాథమిక రూపం ప్రతిపాదన. 
- తొలి దశలో ‘ప్రతిపాదన’ నోట్‌ ఫైల్‌గా రూపు దిద్దుకుంటుంది. 
- కార్యాలయంలో దిగువ స్థాయి అధికారి సాధారణంగా నోట్‌ ఫైల్‌ను రూపొందించి, తన పై అధికారికి పంపిస్తారు. 
- ఆయన నోట్‌ఫైల్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేయడంతో పాటు.. తన అభిప్రాయాన్ని, రూల్‌ పొజిషన్‌ను అందులో రాసి సంతకం పెడతారు. 
అక్కడ నుంచి ఉన్నతాధికారికి ఫైల్‌ వెళుతుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రతిపాదన ఉంటే, అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఆయన దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. 

ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలోనూ అంతే
ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో కమిషనర్‌కు అందిన ఏదైనా వినతిపై, తనంతట తాను ఒక అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలంటే సాధారణంగా మూడు దశలలో ఫైలు నిర్వహణ ప్రక్రియ ఉంటుంది.  
- ఏదైనా ఉత్తర్వు జారీ కోసం ఫైలు తయారు చేయమని కమిషనర్‌ ఆదేశిస్తే, కింది స్థాయిలో సెక్షన్‌ అధికారి నుంచి మొదలు పెట్టి.. అసిస్టెంట్‌ సెక్రటరీ, జాయింట్‌ డైరెక్టర్, జాయింట్‌ సెక్రటరీ, సెక్రటరీల వరకు ఒక్కొక్కరు ఆ నోట్‌ (ఆర్డర్‌) ఫైలు నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో తెలియజేస్తూ ఆ ఫైలులో తమ అభిప్రాయాలు రాసి సంతకాలు చేస్తారు. 
- ఆ తర్వాత దాన్ని కమిషనర్‌కు పంపిస్తారు. కమిషనర్‌ ఆమోదం తెలిపితే, ఆఫీస్‌ (ఆర్డర్‌) కాపీగా పేర్కొనే రెండో దశ ప్రక్రియ మొదలవుతుంది.
- ‘ఆఫీసు (ఆర్డర్‌) కాపీ’ని కూడా దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తొలి దశ మాదిరే ఫైలును నడిపిస్తారు. 
- ఆర్డర్‌ కాపీలో పేర్కొన్న నిర్ణయాలు.. నోట్‌ ఫైల్‌లో ఉన్న అంశాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా అనే విషయాన్ని అన్ని దశల్లో పరిశీలిస్తారు. 
- నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది కూడా సరిచూస్తారు. ఈ ప్రక్రియ సెక్షన్‌ అధికారి నుంచి మొదలై ఒక్కొక్క స్థాయి దాటుకుంటూ కమిషనర్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. 
- ఆఫీసు (ఆర్డర్‌) కాపీపై కమిషనర్‌ సంతకం చేస్తే.. మూడవ దశలో అధికారికంగా కార్యాలయం నుంచి బయటకు విడుదల చేయాల్సిన అసలైన (ఫెయిర్‌) ఉత్తర్వుల కాపీ తయారు చేస్తారు.
- అధికారిక (ఫెయిర్‌) ఉత్తర్వులను కమిషనర్‌ సంతకంతో కానీ, కొన్నిసార్లు కమిషనర్‌ సంతకం లేకుండా కింది స్థాయిలో ఒక ఉన్నత స్థాయి అధికారి సంతకంతో విడుదల చేస్తారు. ఎన్నికల వాయిదా నోటిఫికేషన్‌కైతే ఇంతకు మించిన కసరత్తే ఉంటుంది. 

వాస్తవంగా జరిగింది ఇదీ..
- ఎన్నికల నిలిపివేత నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియలో పైన పేర్కొన్న ప్రక్రియ ఏదీ జరగలేదు. ఆఫీసులో ప్రత్యేకంగా ఒక ఫైలు తయారు కాలేదు.
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు నాలుగు పేజీల నోట్‌పై సంతకం చేసి, దానినే నోటిఫికేషన్‌గా మీడియాకు విడుదల చేశారు.  
- ముందుగా ఒక పుస్తకంలో రాసుకున్న వివరాలను అత్యంత గోప్యంగా కంప్యూటర్‌లో నాలుగు పేజీల్లో టైపు చేయించుకొని మీడియా సమక్షంలో విడుదల చేయడం మినహా ఎలాంటి కసరత్తు జరగలేదు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ కార్యాలయ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement