సాక్షి, అమరావతి: కరోనా పేరిట వాయిదా వేయడంతో మధ్యలో నిలిచిపోయిన స్థానిక ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బుధవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. మొత్తం 19 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కలిగిన పార్టీలైన అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ, అలాగే టీఆర్‌ఎస్, దేశంలో జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన పార్టీలుగా పేర్కొనే బీఎస్పీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్సీపీలతో పాటు వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలుగా ఉన్న ఏఐఏడీఎంకే, ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం, ముస్లింలీగ్, జనతాదళ్ (ఎస్), జనతాదళ్ –యూ, సమాజ్‌వాదీ, ఆర్‌ఎల్‌డీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలకు ఆహ్వానాలు పంపారు. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజర్వుడు చిహ్నం కలిగిన రిజిస్టర్డ్ పార్టీగా జనసేనను కూడా ఆహ్వానించారు.
ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరితో వేర్వేరుగా
బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి విజయవాడ బందర్ రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జరిగే అభిప్రాయ సేకరణకు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు చొప్పున మాత్రమే హాజరు కావాలని సూచించారు. ఒక్కొక్కరితో ఎన్నికల కమిషనర్ పది నిమిషాల చొప్పున వేర్వేరుగా సమావేశమవుతారని కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బీఎïస్పీ ప్రతినిధితో మొదలుపెట్టి, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతినిధుల అభిప్రాయాలను వరుసగా తెలుసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ.. చివరగా జనసేన పార్టీ అభిప్రాయాలు తీసుకుంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోని రాష్ట్ర ఎన్నికల కమిషన్.. తిరిగి నిర్వహించే అంశంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోకముందే రాజకీయ పార్టీలతో సమావేశం కానుండటం చర్చనీయాంశమయ్యింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో నేడు సీఎస్ భేటీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశం కానున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని కోరుతూ సీఎస్‌కు ఎన్నికల కమిషనర్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.
ఎన్నికలు జరగాల్సిన ఎంపీటీసీ స్థానాలు 7,329
మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. 10,047 ఎంపీటీసీ స్థానాలకు 355 చోట్ల వివిధ కారణాలతో ప్రక్రియ మొదలు కాకముందే ఎన్నికలు నిలిచిపోయాయి. 2,363 చోట్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగిలిన 7,329 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 8 చోట్ల వివిధ కారణాలతో నోటిఫికేషన్‌కు ముందే ఎన్నిక నిలిచిపోయింది. మిగిలిన 652 స్థానాల్లో 126 ఏకగ్రీవమయ్యాయి. 526 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment