సభ నిర్వహించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలు
రౌతులపూడి: నిబంధనలను ఉల్లంఘించి ప్రెస్‌మీట్ పేరిట సభ నిర్వహించేందుకు యత్నించిన టీడీపీ నాయకులను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, సుందరకోట శివారు బమిడికలొద్దులో చేపట్టిన బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ మాజీ మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు తదితరులు గిరిజన ప్రాంతాలైన జల్దాం, చల్లూరు, దబ్బాదిలో పర్యటించారు. తర్వాత వీరు రౌతులపూడి చేరుకున్నారు. ప్రెస్‌మీట్ పేరుతో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు.
కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలతో పోలీసులు చర్చించినా వినలేదు. దీంతో చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జ్ వరుపుల రాజా, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంగలపూడి అనిత, వంతల రాజేశ్వరి, బి.రామానాయడు, శ్రావణ్‌కుమార్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, తదితరులను పోలీసులు అరెస్టు చేసి కోటనందూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన అనంతరం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment