దాని పేరేమి పేరు.. అని బ్రాహ్మణి గురించి ప్రస్తావన..
లోకేష్ భార్య బాలకృష్ణ చిన్న కూతురా..
పెద్ద కూతురా.. అని వ్యాఖ్య
పేరు గుర్తుకురాక మీడియా ముందు నానా తంటాలు..
అవాక్కయి బిత్తర చూపులు చూసిన టీడీపీ నేతలు..
ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియాతో అసభ్యంగా, అడ్డదిడ్డంగా మాట్లాడిన మాటల పర్యవసానం. టీడీపీలో మహిళలకు గౌరవం లేదన్న విషయం చర్చనీయాంశం అయిన దశలో.. అయ్యన్న అవాకులు చవాకులు నష్టం చేకూరుస్తాయని సొంత పార్టీ వారే నొసలు చిట్లిస్తున్న వైనం..
విశాఖపట్నం: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపించే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతనం మరోసారి సంచలనమైంది. ఈసారి స్వయానా టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, చినబాబు లోకేష్ భార్య, బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణినే అవమానిస్తూ..హేళన చేస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నర్సీపట్నం టౌన్‌లో
ఏర్పాటు చేసిన టీడీపీ మహిళా దీక్షా కార్యక్రమంలో అయ్యన్న మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ చిన్న కూతురా.. లేదా పెద్ద కూతురా.. దాని పేరేమిపేరు..’ అంటూ తన సహజసిద్ధమైన రీతిలో అసహ్యకరంగా మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న నారా బ్రాహ్మణి పేరు గుర్తుకురాక మీడియా ముందు అయ్యన్న నానా తంటాలు పడ్డారు. ఒక సీనియర్ మాజీ మంత్రి అలా అవహేళన చేసి మాట్లాడడంతో అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తమ్ముళ్లు అయ్యన్నపై గుర్రుగా ఉన్నారు.
చంద్రబాబుని జైలు పాలు చేసిన స్కిల్ స్కాంకు తనకు ఎటువంటి సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మరో సీనియర్ నేత అయ్యన్న అధినేత కోడలినే హేళన చేసి మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు పార్టీ అధిష్టానంపై ఎంత గౌరవం ఉందో అర్థం అవుతోంది. ఇక సొంత పార్టీలోనే కొందరు టీడీపీ మహిళా నేతలు.. అయ్యన్నపాత్రుడికి ఆడవారిని గౌరవించడం రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయ్యన్నపాత్రుడు నోటి దురుసుకు చెక్ పెట్టకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదముందని సీనియర్ నేతలు మధనపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు సీనియర్ మంత్రులు మాట తూలారు. క్రమశిక్షణ తప్పారు. భవిష్యత్తులో మరింతమంది తలో రకంగా వ్యవహరిస్తే పార్టీ మరింత కష్టాల్లో పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment