పంచకర్ల సిఫార్సులకు బాబ్జీ గండి! | - | Sakshi
Sakshi News home page

పంచకర్ల సిఫార్సులకు బాబ్జీ గండి!

Published Sat, Sep 28 2024 2:40 AM | Last Updated on Sat, Sep 28 2024 12:47 PM

-

పెందుర్తి తహసీల్దార్‌ పోస్టింగ్‌ కోసం బాబ్జీ పట్టు 

 పద్మనాభం నుంచి ఆనంద్‌కుమార్‌ను వేయాలని సిఫార్సు 

 బాబ్జీ చెప్పినట్టే వినాలంటూ ఉన్నతాధికారులకు భరత్‌ స్పష్టీకరణ 

 బదిలీల గడువు ముగిసిన తర్వాత పాత తేదీలతో ఆదేశాలు 

 డీటీ, సర్వేయర్‌, ఎంపీడీవో పోస్టింగ్‌ల

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొన్నటికి మొన్న పోలీసుశాఖ బదిలీల్లో మాట చెల్లుబాటు కాలేదని మథనపడిన పంచకర్ల రమేష్‌ బాబుకు రెవెన్యూ బదిలీలల్లోనూ అదే నగుబాటు ఎదురైంది. పెందుర్తి తహసీల్దారు పోస్టింగ్‌లో పంచకర్ల చెప్పిన పేరును కాకుండా తాజాగా గండి బాబ్జీ చెప్పిన వ్యక్తికి పోస్టింగ్‌ దక్కడం చర్చనీయాంశమైంది. 

కొద్దిరోజుల క్రితం సీఐల పోస్టింగ్‌ల విషయంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగి గన్‌మెన్లను సైతం వెనక్కి పంపి.. ఆ తర్వాత మిన్నకుండిపోయిన పంచకర్ల తాజా తహసీల్దార్ల బదిలీల్లో కనీసం స్పందించకుండా మౌనం వహించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తన మాట చెల్లుబాటు కాకపోవడంపై ఆయన లోలోన రగిలిపోతున్నారు. అయినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా బహిరంగంగా వ్యాఖ్యానించకుండా తమ పార్టీ అధిష్టానం వద్ద విన్నవించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా సీఐల బదిలీల విషయంలో అధిష్టానానికి చెప్పినప్పటికీ స్పందన లేకపోవడంతో... ఈసారీ అదే పరిస్థితి ఉంటుందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల అయినప్పటికీ... గండి బాబ్జీ మాటే చెల్లుబాటు అయ్యేలా టీడీపీ నేతల నుంచి వచ్చిన ఆదేశాలతోనే జిల్లా ఉన్నతాధికారులు ఆయన సిఫార్సులకే పెద్ద పీట వేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా ఎంపీ భరత్‌ జోక్యం చేసుకుని గండి బాబ్జీకి ప్రాముఖ్యత ఇవ్వాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాలతోనే ఈ వ్యవహారమంతా నడుస్తోందని టీడీపీలో చర్చ నడుస్తోంది.

పాత తేదీలతో ఆదేశాలు..!
వాస్తవానికి ఉద్యోగుల బదిలీల గడువు ప్రక్రియ సెప్టెంబరు 15వ తేదీ నాటికి పూర్తి కావాలి. విజయవాడ వరదల నేపథ్యంలో 23కు వరకు బదిలీల ప్రక్రియ చేపట్టారు. గండి బాబ్జీ ప్రతిపాదనలకు పెద్ద పీట వేయాలని ఎంపీ భరత్‌ ఆదేశాల మేరకు బదిలీల గడువు ముగిసిన తరువాత పాత తేదీలతో (సెప్టెంబరు 22వ తేదీ) పోస్టింగ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆదేశాలు మాత్రం 26వ తేదీ రాత్రి బయటకు రావడం గమనార్హం. అంతేకాకుండా ఏఎస్‌వో సర్కిల్‌–1లో సీనియర్‌ చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా కొద్దిరోజుల క్రితం పోస్టింగ్‌ ఇచ్చిన బంటు రమణను మార్చాలంటూ బియ్యం మాఫియా పట్టుబట్టడంతో ఆయనకు విశాఖ ఆర్‌డీవో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసిన డి.జానకిని విశాఖ ఏఎస్‌వో కార్యాలయంలో సీనియర్‌ చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరికీ కూడా బదిలీల గడువు ముగిసిన తర్వాత పాత తేదీలతో పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బాబ్జీకి భరత్‌ సపోర్టు... !
వాస్తవానికి విశాఖ దక్షిణ సీటును ఆశించిన గండి బాబ్జీ.. ఆ సీటు దక్కకపోవడంతో పార్టీ మారుదామని భావించారు. అయితే ఎక్కడి నుంచి పిలుపు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. అనంతరం ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో మాడుగుల సీటు లభించిన బండారుకు ఇక పెందుర్తిలో పనులేమీ చేయవద్దనే అర్థంలో వ్యాఖ్యానించారు. అయితే అక్కడితో ఆగకుండా పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల మాట కూడా చెల్లుబాటు కాకుండా చక్రం తిప్పడం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన సీఐల పోస్టింగ్‌ల విషయంలోనూ గండి బాబ్జీ సిఫార్సు చేసిన వారినే నియమించారు. 

దీనిని నిరసిస్తూ తన గన్‌మెన్లను వెనక్కి పంపుతున్నట్టు నేరుగా పోలీస్‌బాస్‌కు పంచకర్ల స్పష్టం చేశారు. అయినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో మిన్నకుండిపోయారు. ఇక తాజాగా పెందుర్తి తహసీల్దార్‌ పోస్టింగ్‌ విషయంలోనూ గండి బాబ్జీ మాటే చెల్లుబాటు కావడంతో పంచకర్ల షాక్‌ తిన్నారు. వాస్తవానికి పెందుర్తి తహసీల్దార్‌గా ప్రస్తుతం ఉన్న కె.వేణుగోపాల్‌ స్థానంలో మరొకరిని నియమించాలని పంచకర్ల భావించారు. అయితే, ఎవరిని నియమించాలనే విషయంలో మాత్రం పంచకర్ల నుంచి ఎటువంటి ప్రతిపాదనలను జిల్లా ఉన్నతాధికారులు కోరకపోవడం గమనార్హం. మరోవైపు పద్మనాభం తహసీల్దార్‌గా ఉన్న ఆనంద్‌కుమార్‌కు పెందుర్తిలో పోస్టింగ్‌ ఇవ్వాలని గండి బాబ్జీ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లాయి.

 గండి బాబ్జీ చెప్పిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎంపీ భరత్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గండి బాబ్జీ ప్రతిపాదనలు, ఎంపీ భరత్‌ ఆదేశాల మేరకు పెందుర్తి తహసీల్దార్‌గా ఆనంద్‌కుమార్‌కు పోస్టింగ్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా డీటీ, సర్వేయర్లు, ఎంపీడీవో పోస్టింగ్‌ విషయంలోనూ పంచకర్ల మాటకు విలువ లేకుండా పోయింది. ఎంపీడీవో రమేష్‌ నాయుడును కొనసాగించాలని పంచకర్ల కోరినప్పటికీ కనీసం పరిగణనలోనికి తీసుకోకపోవడం ఆయనకు చిర్రెత్తుకొచ్చినట్టు తెలుస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement