గంటాకు సీటు తంట! | - | Sakshi
Sakshi News home page

గంటాకు సీటు తంట!

Published Thu, Feb 22 2024 12:48 AM | Last Updated on Thu, Feb 22 2024 5:13 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికలు వచ్చిన ప్రతీసారి సీటు మార్చి బరిలో నిలిచే గంటాకు ఇప్పుడు తన సీటు ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది. భీమిలి నుంచి పోటీ చేయాలని గంటా భావిస్తుండగా.. చీపురుపల్లికి పంపాలంటూ టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని ఎంపిక చేసిన మీడియా సంస్థలకు టీడీపీ పెద్దలే లీకు చేయడం గంటాకు కునుకులేకుండా చేస్తోంది. ఎలాగూ ఎన్నికలకు ఒకసారి సీటు మార్చే అలవాటు ఉన్న గంటాను ఈసారి చీపురుపల్లికి పంపాలని భావిస్తున్నట్టు రాబిన్‌ శర్మ ద్వారా సందేశం పంపినట్టు సమాచారం.

ఇది తనను ఓడించేందుకే ఆడుతున్న నాటకమని కూడా గంటా మండిపడినట్టు తెలుస్తోంది. చీపురుపల్లిలో తాను గెలిచే అవకాశం లేదని గంటాకు స్పష్టంగా తెలుసు. అందుకే చీపురుపల్లి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని టీడీపీ పెద్దలకు తేల్చిచెప్పినట్టు సమాచారం. గత వారం రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ గంటా మాటను ఖాతరు చేయకుండా టీడీపీ పెద్దలే తమ అనుకూల మీడియాకు తాజాగా లీకులివ్వడంతో ఏమీ చేయాలో గంటా కాస్తా తేల్చుకోలేకపోతున్నారు. అంతేకాకుండా గంటా కోరుతున్న భీమిలి సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టు కూడా టీడీపీ పెద్దలు లీకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు గంటా సిద్ధమవుతున్నట్టు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

నెల్లిమర్ల.. చోడవరంలోనూ వ్యతిరేకత...!
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి కాకుండా తన సామాజికవర్గం అధికంగా ఉండే నెల్లిమర్లలో పోటీ చేయాలని గంటా మొదట భావించారు. అయితే, అక్కడ స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ తర్వాత చోడవరం నుంచి బరిలో దిగితే ఎలా ఉంటుందని అభిప్రాయసేకరణ చేశారు. అయితే, గతంలో గెలిచి అక్కడ తన గెలుపునకు కృషిచేసిన వారిని ఏ మాత్రమూ పట్టించుకోకపోవడంతో పాటు నియోజకవర్గాన్ని గాలికివదిలేశారన్న విమర్శలున్నాయి. దీంతో చివరకు భీమిలి నుంచి బరిలో దిగేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రస్తుతం భీమిలి ఇన్‌చార్జిగా ఉన్న కోరాడ రాజబాబుకు వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు.

కార్పొరేటర్లతో నాటకాలు...!
వాస్తవానికి భీమిలి సీటు నుంచి పోటీ చేయాలని గంటా భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే టీడీపీ నుంచి ఉన్న కోరాడ రాజబాబుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం నేరుగా లోకేష్‌ను కలిసి సదరు కార్పొరేటర్లు కోరాడ రాజబాబు వద్దని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రాజబాబు ఉంటే తాము పనిచేయలేమని కూడా తేల్చిచెప్పారు. అయినప్పటికీ లోకేష్‌ పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. ఈ కార్పొరేటర్ల వెనుకుండి నాటకాలు ఆడిస్తున్నది గంటా శ్రీనివాసరావు అని భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

అంతేకాకుండా వారి ఫిర్యాదును సైతం అంతగా పట్టించుకోకుండా ముందుకు సాగినట్టు సమాచారం. దీంతో చేసేదిలేక సదరు కార్పొరేటర్లు అదే విషయాన్ని గంటాకు వివరించినట్టు తెలుస్తోంది. అంతకుముందే చీపురుపల్లికి పోవాలని సంకేతాలు ఇచ్చినప్పటికీ.. భిన్నంగా ఉన్న ఆయన వ్యవహారశైలిపై టీడీపీ పెద్దలు మండిపడుతున్నారు. ఇదే అదునుగా గంటాను చీపురుపల్లికి పంపనున్నట్టు కొన్ని మీడియా సంస్థలకు టీడీపీ పెద్దలు లీకులిచ్చారు. అంతేకాకుండా భీమిలి సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టు కూడా ఇరు పార్టీలు లీకులిచ్చుకుంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ప్రతీ ఎన్నికలకు సీటు మార్చే అలవాటున్న గంటాకు చివరకు పోటీ చేసేందుకు నియోజకవర్గమే దొరకకపోవడం విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement