కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు అండతో భౌతిక దాడులు
నాడు చింతగట్లలో వైఎస్సార్‌సీపీ నేత కనకరాజుపై హత్యాయత్నం
తాజాగా టీడీపీ కార్పొరేటర్ ముత్యాల నాయుడుపై విచక్షణరహితంగా దాడి
2009–2014 మధ్య దందాలు, రౌడీయిజంతో చెలరేగిన పంచకర్ల అనుచరులు
పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకులు, కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు అనుచరుల రౌడీయిజం పెచ్చు మీరుతోంది. తమకు నచ్చని వా రిపై హత్యాయత్నాలు, భౌతికదాడులకు పాల్పడుతున్నా రు. ఎక్కడికక్కడ ‘సైకో’తనంతో వీరంగం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ప్రత్యర్థులను సోషల్ మీడియా వేదికగా అసభ్యపద జాలంతో దూషిస్తున్నారు. కులాల పేరు తో వేధిస్తున్నారు. ‘మేం వస్తే మీ సంగతి తేలుస్తాం’ అంటూ బెది రింపులకు పాల్పడుతున్నారు.
నచ్చకపోతే అంతే..
పెందుర్తిలోని జనసేన నాయకులు తమకు అనుకూలంగా లేని వారిపై భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత సహజంగా మారింది. ఇందుకు ఆదివారం సతివానిపాలెంలో జరిగిన ఘటనే నిదర్శనం. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వర్గం. మొదటి నుంచి కూటమి అభ్యర్థిగా పంచకర్ల రమేష్‌బాబును వ్యతిరేకిస్తున్న బండారు సత్యనారాయణమూర్తి బాటలోనే ముత్యాలనాయుడు నడుస్తున్నాడు. పంచకర్ల రమేష్‌కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో కొద్దిరోజులుగా రమేష్‌బాబు అనుచరుడు గల్లా శ్రీను ముత్యాలనాయుడుపై సోషల్ మీడియా వేదికగా దూషణలు చేస్తున్నాడు. ప్రజాప్రతినిధి అని చూడకుండా ఏకంగా దాడికే పాల్పడ్డాడు. ఇదే తరహాలో చింతగట్లలో గనిశెట్టి కనకరాజుపై స్థానిక జనసేన నాయకులు చందక గోవింద, మాడిస హరిష్‌లు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
గతంలోనూ అంతే..
పెందుర్తి ప్రజలకు ఎవరో కూడా తెలియని పంచకర్ల రమేష్‌బాబు 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు త్రిముఖ పోటీ కావడంతో పంచకర్ల రమేష్‌బాబు బొటాబొటి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన తర్వాత పంచకర్ల కూడా అందులో చేరిపోయారు. అధికార పార్టీలోకి వెళ్లిన వెంటనే పంచకర్ల, అతని అనుచరుల అసలు రూపం బయటకు వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రమేష్‌బాబు, అతని అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. అధికారులను తమ దారికి తెచ్చుకుని రౌడీయిజంతో పాటు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా నియోజకవర్గం కేంద్రం పెందుర్తి కేంద్రంగా ఎన్నో దందాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో పంచకర్ల అనుచరుడు ఒకడు ఏకంగా పోలీసుల భూమికే గురి పెట్టాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి కేటాయించారు.
అప్పటి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అనుచరుడు గొర్లె అప్పారావు దానిపై కన్నేశాడు. తప్పుడు డాక్యుమెంట్‌లు సృష్టించి ఏకంగా పోలీసులకు కేటాయించిన స్థలాన్నే ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ హుస్సేన్ అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆట కట్టించారు. 2011 నుంచి 2014 వరకు పంచకర్ల అనుచరులు భూ కబ్జాలకు పాల్పడ్డంతో పాటు రౌడీ వేషాలు షరామాములే అన్నట్లు జరిగేవి. అప్పట్లో రమేష్‌బాబు పేరు చెప్పుకుని సెటిల్‌మెంట్‌లు చేయడం, బెదిరింపులకు పాల్పడ్డం వంటి ఘటనలు కోకొల్లలు. పంచకర్ల స్థానికేతురుడు కావడంతో స్థానికంగా ఉన్న అనుచరులతో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అతని మనుషులు ఇక్కడి తరచూ అలజడి సృష్టించేవారు. ఒకరకంగా చెప్పాలంటే పెందుర్తి నియోజకవర్గంలో రౌడీయిజం పెచ్చుమీరింది పంచకర్ల రమేష్‌బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అని రాజకీయ విశ్లేషకుల ఉవాచ.
2023 నవంబర్ 12. పెందుర్తి మండలం చింతగట్లలో ప్రజలందరూ దీపావళి సంబరాల్లో ఉన్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో చింతగట్ల సర్పంచ్ భర్త, రాష్ట్ర అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గనిశెట్టి కనకరాజుపై జనసేన నాయకులు, కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు అనుచరులు రెచ్చిపోయారు. బీరు బాటిళ్లు, పదునైన ఆయుధాలు పట్టుకుని కనకరాజును హతమార్చేందుకు తల, శరీరంపై దాడికి పాల్పడ్డారు. స్థానికులు స్పందించి రక్తపు మడుగులో ఉన్న కనకరాజును హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నిందితులైన జనసేన నాయకులు మాడిస హరీష్, చందక గోవిందరాజు, దాసరి గణేష్‌లను పెందుర్తి పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 2న అరెస్ట్ చేశారు.
2024 ఏప్రిల్ 14. జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని సతివానిపాలెంలో ఓ విందు కార్యక్రమం జరుగుతోంది. విందుకు టీడీపీ స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడు హాజరయ్యారు. అదే సమయంలో జనసేన స్థానిక నాయకుడు, పంచకర్ల రమేష్ అనుచరుడు గల్లా శ్రీనివాసరావు కూడా అక్కడికి వచ్చాడు. అకారణంగా ముత్యాలనాయుడును బూతులతో దూషించాడు. ఇది శుభకార్యం.. ఇక్కడ గొడవెందుకు అని ముత్యాలనాయుడు వారించినా వినిపించుకోలేదు. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ముత్యాలనాయుడును ఇష్టానుసారం కొట్టాడు గల్లా శ్రీను. దీంతో స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో ముత్యాలనాయుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాధిత కార్పొరేటర్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment