ఫ్యాను జోరు..! కూటమి బేజారు..!!
మాడుగుల, అరకు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన
దక్షిణ నియోజకవర్గంలో చల్లారని ‘గ్లాసు’ తుపాను
వంశీకృష్ణకు వద్దే వద్దంటున్న జనసేన నాయకులు
గందరగోళంలో మూడు పార్టీల క్యాడర్
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు భానుడి భగభగలు.. మరోవైపు సార్వత్రిక ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తుంటే.. కూటమిలో ఇంకా టికెట్ల పంచాయితీ కుంపటి రగులుతూనే ఉంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. సీట్ల సర్దుబాటులో నెలకొన్న గందరగోళం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు మార్పుల వైఖరికి జనసేన, బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాడుగులలో సైకిల్ తొక్కేదెవరో తెలియక అయోమయంలో క్యాడర్ ఉండగా.. అరకులో కమలం వికసించకుండా టీడీపీ యత్నాలు జోరందుకున్నాయి. విశాఖ దక్షిణంలో జనసేన అభ్యర్థి వద్దేవద్దంటూ ఆ పార్టీ నేతలే తేల్చి చెబుతుండటంతో ఎటుపోవాలో తెలియక క్యాడర్ ఊగిసలాడుతోంది.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే.. కూటమి మాత్రం పొత్తు చిక్కుల్లో కూరుకుపోయింది. చివరి నిమిషం వరకూ ఎవరికి సీటు దక్కుతుందో తెలియక అయోమయంలో టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా మాడుగుల, అరకు నియోజకవర్గాల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మాడుగులలో తొలుత పైలా ప్రసాదరావుకు చంద్రబాబు సీటు ప్రకటించారు.
దీంతో ఆయన ప్రచారానికి ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేశారు. అయితే తాజాగా ఈ సీటును తనకే కేటాయించారని బండారు ప్రకటించుకున్నారు. దీంతో పైలా వర్గం కోపంతో రగిలిపోతోంది. ఇన్నాళ్లూ ఈ టికెట్ ఆశించిన గవిరెడ్డి రామానాయుడు, పీవీజీ కుమార్‌లకు భంగపాటు తప్పలేదు. పెందుర్తి నుంచి మాడుగులకు బండారు రావడంతో అక్కడ పార్టీ క్యాడర్ రగిలిపోతోంది. మాడుగులలో గురువారం బండారు నిర్వహించిన సమావేశానికి పైలా గైర్హాజరయ్యారు. బండారు, చంద్రబాబు తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో పాటు అయోమయానికి గురవుతున్నారు.
జనసేనది ఇదే పరిస్థితి..
అటు జనసేనకు సంబంధించి దక్షిణ నియోజకవర్గంలోనూ అసమ్మతి ఇంకా కొనసాగుతోంది. బీఫారం దక్కించుకున్న వంశీకృష్ణకు సీటు ఇవ్వొద్దంటూ పలువురు నేతలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. వంశీని కొనసాగిస్తే.. ఓడించి తీరుతామంటూ తేల్చి చెబుతున్నారు. జనసేనలోనే వర్గపోరు ఉండటంతో.. ప్రచారానికి వెళ్లకుండా ఆ పార్టీ శ్రేణులు ఇంటికే పరిమితమవుతున్నారు.
కీలక నేతలు ప్రచారానికి డుమ్మా కొడుతుండటంతో.. వారు లేకుండా ప్రచారానికి వెళ్తే.. తమని బ్లాక్ లిస్టులో పెడతారేమోనన్న సంకట స్థితిలో మూడు పార్టీల క్యాడర్‌లో ఉంది. బయటికి రాలేక.. నియోజకవర్గంలో తిరగలేక.. నాయకులు సైతం అందుబాటులో ఉండకపోవడంతో ఆయా పార్టీల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది. మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు పొడిచినా.. అది మునిగిపోయే పడవ మాత్రమేననే తత్వం ఆ పార్టీల కార్యకర్తల్లోనూ బలంగా నాటుకుంది.
అరకులోనే అదే దుస్థితి..
రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రకటించిన టీడీపీ సీటు అరకు నియోజకవర్గానిదే. దొన్ను దొర అరకు అభ్యర్థి అంటూ బాబు ప్రజాగళం సభలో ప్రకటించారు. అప్పటి నుంచి ప్రచారం నిర్వహించిన దొన్ను దొరకు చివరికి భంగపాటు తప్పలేదు. ఆ స్థానాన్ని బీజేపీకి ఇస్తున్నట్లు బాబు ప్రకటించడంతో అసమ్మతి భగ్గుమంది. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తన తడాఖా చూపిస్తానంటూ దొన్నుదొర బహిరంగంగా సవాల్ విసిరారు.
దీంతో అరకులో కూటమి రెండు ముక్కలైంది. బీజేపీ అభ్యర్థితో పాటు నడవాలా..? రెబల్‌గా అడుగులు వేస్తున్న దొన్ను దొరతో ఉండాలా అని తేల్చుకోలేక మూడు పార్టీల క్యాడర్ గందరగోళంలో ఉంది. మరోవైపు అరకులో కమలం వికసించకుండా ఆపేందుకు టీడీపీ యత్నాలు కొనసాగిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment