సహపంక్తి భోజనాలతో టీడీపీ నేతల వల
తమ పరిధిలో సామాజికవర్గాల వారీగా ఆహ్వానం
ఆత్మీయ సమావేశం పేరుతో ప్రత్యేక కూపన్ల పంపిణీ
తూర్పులో మందు పార్టీలు నిర్వహిస్తున్న వెలగపూడి
బూత్‌లో ఓట్ల మేరకు గంటా బేరసారాలు
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న టీడీపీ అభ్యర్థులు అడ్డదారులూ తొక్కుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విభజించు.. ఆతిథ్యమిచ్చు.. అనే సూత్రాన్ని అవలంబిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా సహపంక్తి భోజనాలతో ఎరవేస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరుతో ప్రత్యేక కూపన్లు పంపిణీ చేస్తూ.. డబ్బులు, గిఫ్ట్‌లు అందజేస్తూ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అయితే ప్రతి వీధినీ.. ఏకంగా మందుబాబులకు అడ్డాగా మార్చేస్తున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం : సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ దగ్గరపడుతున్నకొద్ది టీడీపీ అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ప్రచారాల్లో పార్టీకి పెద్దగా ఆదరణ లేకపోవడంతో బెంగ ఏర్పడుతోంది. దీంతో ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న సామాజికవర్గాల పెద్దలను పిలిచి తియ్యటి మాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆయా సామాజికవర్గాల వారీగా ఆత్మీయ విందుల పేరుతో వలవేస్తున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో ప్రత్యేక కూపన్లు ఇస్తున్నారు. వీటితో నిత్యావసరాలు, మందు, ఫుడ్ కొనుగోలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తూ టీడీపీ అభ్యర్థులు తమ అనుచరుల నివాసాలు, రిసార్టుల్లో ఈ తరహా పార్టీలు నిర్వహిస్తున్నారు.
పోలింగ్ బూత్ వారీగా..
భీమిలి, విశాఖ తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఈ తరహాలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఒకే చోటు ఎక్కువ మంది కూడితే ఎన్నికల కమిషన్‌కు అనుమానం వస్తుందని భావించి, పోలింగ్ బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారి బంధువుల ఓట్లు కొనుగోలుకూ బేరసారాలు మొదలు పెడుతున్నారు.
గంటాది అదే పంథా
భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నుంచి గతంలో పోటీ చేసినప్పుడు సైతం కులసంఘాలతో తరచూ సమావేశాలు నిర్వహించేవారు. ఇప్పుడు అదే పంథా కొనసాగిస్తూ గెలుపు కోసం ఎత్తుగడలు వేస్తున్నారు. అలాగే సామాజికవర్గాల వారీగా ఆ బూత్‌లో ఉన్న ఓట్ల మేరకు బేరసారాలు సాగిస్తున్నారు. విందు రాజకీయాల్లో ఆరితేరిన ఆయన బిర్యానీలు, స్వీట్ ప్యాకెట్లు, కూపన్లు అందిస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఆదివారం రాత్రి కొమ్మాది సమీపంలోని అన్నంరాజు లే అవుట్ వద్ద పలువురికి మందు, విందు ఏర్పాటు చేశారు.
తూర్పులో మద్యం కూపన్లు
విశాఖను మద్యం మత్తులో దింపిన వెలగపూడి.. ఈ ఎన్నికల్లోనూ తన సిండికేట్ వ్యాపారమైన మద్యాన్నే నమ్ముకుంటున్నారు. మందుబాబులు ఎవరున్నారో.. తన అనుచరుల ద్వారా తెలుసుకొని.. ప్రతి రోజూ తనకు చెందిన బార్ల పేరుతో కూపన్లు అందిస్తున్నారు. ఇందుకోసం తన బార్లలో ప్రత్యేకంగా మద్యం నిల్వలు పెట్టుకున్నట్లు సమాచారం. బిర్యానీ, మందు బాటిల్ అందజేస్తూ ఓటర్లను వెలగపూడి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈసారి తూర్పులో ఎదురుగాలి తప్పదని భావించిన వెలగపూడి.. ప్రతి వీధినీ మద్యం మత్తులో జోగేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. ప్రచారంలో తనతో పాటు వచ్చిన వారికి తన అనుచరుల సహాయంతో ఆయా బార్లు, మద్యం దుకాణాల వద్దకు తీసుకెళ్లి.. ఎవరికి ఎంత మేర కావాలో అందజేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్న టీడీపీ అభ్యర్థులను జనం చీదరించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment