అధినేతల దెబ్బకు ఆశావహులు అబ్బా
ఏళ్ల తరబడి టీడీపీ, జనసేనలకు చాకిరీ
తీరా ఎన్నికల వేళ దగా
ఉగాది పూట ఉసూరుమంటున్న నాయకులు
తమ భవిష్యత్తుకు గండి కొట్టారంటూ ఆవేదన
సాక్షి, విశాఖపట్నం: జంప్ జిలానీలకు రాజపూజ్యం.. నమ్ముకున్న నేతలకు అవమానం..! ఇది జనసేన, టీడీపీ నాయకులకు ఆ పార్టీల అధినేతలు ఇచ్చిన బహుమానం. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల కోసం ఏళ్ల తరబడి కొంతమంది నాయకులు పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు టికెట్ కచ్చితంగా వచ్చి తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తీరా సీట్ల ఖరారు చేసే సమయం వచ్చేసరికి వీరు అక్కరకు రాకుండా పోయారు. నమ్ముకున్న వారికి కాకుండా నిన్న గాక మొన్న పార్టీలో చేరిన వారికే అవకాశం కల్పించారు. కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టేశారు. ఎన్నికల వేళ తమ అధినేతలు కొట్టిన దెబ్బకు వీరంతా అబ్బా అంటున్నారు. ఇలాంటి వారంతా ఉగాది పండుగ వేళ తమ భవిష్యత్తును ఊహించుకుని ఉసూరుమంటున్నారు. తమకు రావలసిన అవకాశాలను పార్టీ ఫిరాయింపుదార్లు తన్నుకుపోయారంటూ ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల బాధితుల లిస్ట్ పెద్దగానే ఉంది.
► విశాఖ దక్షిణ సీటును ఆ నియోజకవర్గానికి చెందిన సాధిక్, కందుల నాగరాజు, మూగి శ్రీనివాసరావు, టీడీపీ నేత గండి బాబ్జీ ఆశించారు. కానీ ఇటీవలే వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్‌కు కేటాయించారు.
► జనసేనలో పెందుర్తి సీటును ఆశించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. తీరా ఆ టికెట్‌ను వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన పంచకర్ల రమేష్‌బాబుకు ఇచ్చారు. దీంతో షాక్ తిన్న శివశంకర్ పత్తా లేకుండాపోయారు. ఇక టీడీపీలో అదే స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా తీవ్ర అసంతృప్తికి లోనై అనారోగ్యం పాలయ్యారు.
► గాజువాక స్థానంపై నమ్మకం పెట్టుకున్న జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావుకు కాకుండా పొత్తులో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు కేటాయించడం ఆయనకు మింగుడు పడలేదు.
► భీమిలిలో పదేళ్ల నుంచి జనసేన కోసం కష్టపడుతున్న పంచకర్ల సందీప్‌కు సీటిస్తామని పవన్ హామీ ఇచ్చారు. కానీ ఆఖరు నిమిషంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే స్థానాన్ని ఆశించిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబుకు గట్టిగానే షాక్ తగిలింది.
► విశాఖ ఉత్తర స్థానాన్ని ఆశించిన జనసేన నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్‌కు కూడా ఆశాభంగమే ఎదురవడంతో ఆమె ఉసూరుమంటున్నారు.
► అనకాపల్లి టికెట్ ఆశించి జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పరచూరి భాస్కరరావుకు ఝలక్ ఇచ్చి.. నిన్నగాక మొన్న చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు సీటిచ్చారు. దీంతో పరుచూరి ఆ పార్టీకో నమస్కారం అంటూ రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇదే సీటును ఆశించిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ డీలా పడ్డారు.
► మాడుగుల సీటు కోసం పార్టీలో పనిచేస్తున్న పీవీజీ కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడులను కాదని ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాదరావుకు కేటాయించడంతో వీరిద్దరూ తమ అధినేత చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు.
► యలమంచిలి టీడీపీ సీటు తనదేనని ఆశించిన ప్రగడ నాగేశ్వరరావుకు షాకిచ్చి జనసేన సుందరపు విజయకుమార్‌కు కేటాయించారు. దీంతో ప్రగడ తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.
మన్యంలోనూ అంతే..
► అరకు అసెంబ్లీ స్థానాన్ని తొలుత కిడారి శ్రవణ్‌కుమార్, సివేరి అబ్రహం ఆశించారు. అయితే వీరిద్దరిని కాదని చంద్రబాబు సియ్యారి దొన్నుదొరకు టికెట్ ప్రకటించారు. ఆయన జోరుగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో షాకిచ్చారు. ఆ సీటును బీజేపీ నేత పాంగి రాజారావుకు కేటాయించారు. అధినేత కొట్టిన దెబ్బకు దొన్నుదొర లబోదిబోమంటున్నారు.
► పాడేరు సీటును మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని కాదని నిన్న గాక మొన్ననే పార్టీ తీర్థం పుచ్చుకున్న రమేష్‌నాయుడుకు ఇచ్చారు. దీంతో గిడ్డి ఈశ్వరి ఇప్పుడు కుయ్యో మొర్రో అంటున్నా వినే వారే లేకుండాపోయారు. ఈ టికెట్‌ను ఆశించిన మత్స్యరాస మణికుమారి, ఎం.వి.వి.ప్రసాద్‌కు హ్యాండ్ ఇచ్చారు.
► రంపచోడవరంలో ఐదేళ్లుగా టీడీపీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని పక్కనబెట్టి ఇటీవలే పార్టీలో చేరిన శిరీషకు టికెట్ ఇచ్చారు. తమ నాయకుడు చంద్రబాబు ఇచ్చిన షాక్ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదు.
► ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్‌లు వారినే నమ్ముకున్న వారిని కాకుండా పార్టీలు ఫిరాయించి వచ్చిన వారికి, డబ్బున్న వారికి పెద్ద పీట వేస్తూ సీట్లిచ్చి తమ భవిష్యత్తుకు గండి కొట్టారంటూ వారు తీవ్రంగా మదన పడుతున్నారు.
► విశాఖ ఎంపీ టికెట్‌ను బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆశించారు. ఆయన మూడేళ్లుగా విశాఖలోనే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. సీటు తనదేనన్న ధీమాతో ఉన్న తరుణంలో ఆయనను పక్కనబెట్టి టీడీపీకి చెందిన ఎం. శ్రీభరత్‌కు ఇచ్చారు.
► అనకాపల్లి ఎంపీ సీటును ఆశించిన సీనియర్లకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. చింతకాయల విజయ్, దిలీప్ చక్రవర్తి పార్టీ టికెట్‌ను ఆశించారు. వీరిని పక్కనబెట్టి ధన బలం ఉన్న కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్‌కు ఇవ్వడంతో వారు కంగుతిన్నారు.
Comments
Please login to add a commentAdd a comment