సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై స్పష్టత లేకపోయినా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలో హంగామా చేస్తున్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి తానే బరిలో ఉంటానంటూ అనుచరగణంతో లీకులు ఇప్పిస్తున్నారు. ఆ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఇదే స్థానం నుంచి టీడీపీ తరఫున తన కుమారుడు విజయ్‌ను నిలపాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తలపోస్తుండగా, రియల్ ఎస్టేట్ వ్యాపారి దిలీప్ చక్రవర్తిని బరిలోకి దించాలని మరో వర్గం ప్రయత్నిస్తోంది.
ఆయన ఈ టిక్కెట్టును ఆశిస్తూ వివిధ రూపాల్లో డబ్బు పంపిణీ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇంతలో ఇటీవలే జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నాగబాబు వారం పది రోజులుగా అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ, కార్యకర్తలతో సమావేశమవుతూ హడావుడి చేస్తున్నారు. వారం తిరగకుండానే గురువారం మరోసారి వచ్చారు. ఈసారి ఆయన యలమంచిలిలోనే నివాసం ఉండబోతున్నానని కూడా ప్రకటించారు. దీంతో జనసేన నుంచి అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిని తానేనని చెప్పకనే చెప్పారు.
గురువారం రాత్రి పార్టీ సమన్వయకర్తలతో రాంబిల్లి మండలం వెంకటాపురంలో సమావేశమయ్యారు. ఒకపక్క పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే పర్యటనలు కొనసాగిస్తున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటే యలమంచిలిలో నివాసం ఉండాల్సిన అవసరం ఎందుకని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి నాగబాబు అభ్యర్థిత్వం ఖరారైందనే భావన కలిగించేందుకే ఈ సంకేతాలిస్తున్నారని వీరంటున్నారు. అయ్యన్నకు చెక్ పెట్టడానికే నాగబాబుకు ఈ సీటు ఖాయం చేశారన్న ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.
ముందుకొచ్చిన సుందరపు బ్రదర్స్..
నాగబాబుతో సన్నిహితంగా ఉంటున్న యలమంచిలి ప్రాంతానికి చెందిన సుందరపు బ్రదర్స్ (విజయ్‌కుమార్, సతీష్‌కుమార్) నాగబాబుకు నివాసం సమకూరుస్తున్నారని జనసేన నాయకులు చెబుతున్నారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఇటీవల నిర్మించిన భవనాన్ని నాగబాబు తాత్కాలిక నివాసానికి ఇస్తారని అంటున్నారు. అలా కానిపక్షంలో జనసేనలో మరో నాయకుడు పీవీజీ కుమార్ కూడా తన ఇంటిని ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఐరన్ లెగ్ అంటున్న శ్రేణులు..?
ఒకపక్క నాగబాబు అనకాపల్లిపై హంగామా చేస్తుంటే జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు షాకిచ్చేలా చర్చించుకుంటున్నారు. నాగబాబుది ఐరన్ లెగ్ అని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తే ఓటమి ఖాయమని, ఇక్కడ కాకుండా మరెక్కడ నుంచైనా పోటీ చేసుకోవడం మంచిదని గుసగుసలాడుకుంటున్నారు. దీనిని బట్టి నాగబాబు అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం వీరిలో చాలామందికి ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోంది. మొత్తమ్మీద నాగబాబు చేస్తున్న హడావుడి ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణుల్లో అలజడి రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment