వరుణ్‌కుమార్(ఫైల్)
అమలాపురం: రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ పెద్దలకు తొత్తులుగా మారారనే విమర్శలకు పలు ఉదాహరణలున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడి భార్య తన పెంపుడు కుక్కను ఉసిగొల్పడం కారణంగానే దళిత కుటుంబానికి చెందిన బాలుడు మృతి చెందాడనే ఆరోపణలపై ఫిర్యాదు అందినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న నెల్లి వరుణ్ (14)పై సెప్టెంబరు 28వ తేదీన పంట కాలువలో పడి మృతి చెందాడు. ఉప ముఖ్యమంత్రి సోదరుడు జగ్గయ్యనాయుడు భార్య వాళ్ల పెంపుడు కుక్కను ఉసిగొల్పడం వల్లే తన కుమారుడు మృతిచెందాడని వరుణ్ తండ్రి తిరుపతిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి 40 రోజులైనా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు అమలాపురం వచ్చినప్పుడు 24 గంటల్లో బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమలాపురం పోలీసులు ఈ ఘటనపై స్పందించిన తీరు తొలి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. వరుణ్ కుటుంబ సభ్యులు ఎంతగా వేడుకున్నా కేసు నమోదు చేయలేదు సరికదా... వారికి మద్దతుగా నిలిచిన ప్రజా సంఘాలు, దళిత సంఘాల నిరసనను అడ్డుకునేందుకు మాత్రం శక్తియుక్తులను దారపోశారు. ఉదయం ఆరు గంటలకు మృతదేహం లభ్యమైన వెంటనే కుటుంబీకుల వద్దకు తీసుకుని వెళ్లకుండా.. పోస్టుమార్టం నిమిత్తం నేరుగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించడంపై అప్పట్లోనే వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలోనే బాలుడి తండ్రితోపాటు దళిత సంఘాల నాయకులు జగ్గయ్యనాయుడుకు చెందిన పెంపుడు కుక్క వల్లే వరుణ్‌కుమార్ మృతి చెందినట్టు స్టేట్‌మెంట్ ఇవ్వగా అధికారులు నమోదు చేసుకున్నారు.
పరిహారం ఇచ్చి పక్కదారి పట్టించారు..
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ న్యాయం చేస్తామని మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు, ఇళ్ల స్థలం ఇప్పించారు. ఘటనకు కారణమైన హోంమంత్రి సోదరుడి భార్యపై కేసు నమోదు చేయకుండా ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించి కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గళమెత్తిన వారిపై పోలీసులు ఉక్కుపాదం..
వరుణ్‌కుమార్ తండ్రి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు సరికదా... వారికి మద్దతుగా నిలిచిన ప్రజాసంఘాలు, దళిత సంఘాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేసు నమోదు చేయనందుకు నిరసనగా అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ అక్టోబర్ 28న ‘ఛలో అమలాపురం’ పిలుపునిచ్చారు. వరుణ్‌కుమార్ ఘటనలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు భార్యపై 304 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి..ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురంలో సెక్షన్ 30 అమలులో ఉందంటూ హర్షకుమార్‌ను అమలాపురం ఎర్రవంతెన వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు దళిత సంఘాలు నాయకులను గృహ నిర్బంధం చేసి పోలీసు జులుం ప్రదర్శించారు. కాగా బాధితులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment