ST atrocity case
-
నూతన్ నాయుడు చేసింది తీవ్రమైన నేరం..
సాక్షి, అమరావతి : శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడుపై ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పేరు చెప్పి అధికారుల నుంచి సహాయం పొందేందుకు నూతన్ నాయుడు యత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరు చెప్పి పలువురి అధికారులకు ఫోన్ చేశాడని.. డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని పీవీ పేర్కొన్నారు. తన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేశాడని మండిపడ్డారు. తన పేరుతో అధికారులకు ఫోన్ చేయడాన్ని ఆయన ఖండించారు. నూతన్ నాయుడు చేసింది తీవ్రమైన నేరమని ఆయన అన్నారు. ‘ఆగస్ట్ 29న నా పేరును ఉపయోగించి, నా మాటను అనుకరిస్తూ ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు కాల్ చేశారు. ఒక పేషేంట్ వస్తున్నారు, 15 రోజులు పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్‌తో చెప్పారు. నా గొంతును అనుకరిస్తూ మాట్లాడటంతో అనుమానం వచ్చి ప్రిన్సిపాల్ సుధాకర్ నాకు కాల్ చేశారు. ఎవరో నా మాట అనుకరిస్తున్నారు అనే విషయాన్ని డీజీపీ, అడిషనల్ డీజీపీ, విశాఖ సీపీకి ఫిర్యాదు చేశాను. ఆ ఫోన్ నెంబర్ హైదరాబాద్ అడ్రస్ ఉందని విచారణలో తేలింది. ఆ నంబర్‌కు కాల్ చేస్తే‘అడిషనల్ సీఎస్ సీఎం’ అని వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నా మాట అనుకరిస్తూ ఫోన్ చేస్తున్న వారి మాటలు నమ్మకండి’అని రమేష్ పేర్కొన్నారు. (చదవండి : శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్) కాగా, నూతన్ నాయుడు గురువారం అరెస్టయిన విషయం తెలిసిందే. శిరోముండనం కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. కాగా, దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో బిగ్ బాస్ ఫేమ్, సినీ నిర్మాత నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపి రైల్వేస్టేషన్లో గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన నాటి నుంచి నూతన్ నాయుడు పరారీలో ఉన్నాడన్నారు. ఘటన జరిగాక మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ పేరు చెప్పి పైరవీలు చేశాడని చెప్పారు. దీంతో నూతన్ నాయుడిపై చీటింగ్ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామన్నారు. శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ► శిరోముండనం కేసులో ఆగస్టు 29న ఏడుగురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేయగా కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌కి ఫోన్ చేసి తాను మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్‌నని ప్రియా మాధురి (నూతన్ భార్య)కి రెండు వారాలపాటు ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉందంటూ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరాడు. ► కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌కి పి.వి.రమేష్ పరిచయం ఉండడంతో అనుమానం వచ్చి ఆయనకు ఫోన్ చేసి మీ పేరుతో ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పారు. ► దీంతో పి.వి. రమేష్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నంబర్ని ట్రేస్ చేయగా.. ముంబై వెళుతున్న నూతన్ నాయుడు ఉడిపి రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
మరో వివాదంలో సినీ నటి భానుప్రియ
-
ఖాకీల పక్షపాతం..
అమలాపురం: రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ పెద్దలకు తొత్తులుగా మారారనే విమర్శలకు పలు ఉదాహరణలున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడి భార్య తన పెంపుడు కుక్కను ఉసిగొల్పడం కారణంగానే దళిత కుటుంబానికి చెందిన బాలుడు మృతి చెందాడనే ఆరోపణలపై ఫిర్యాదు అందినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న నెల్లి వరుణ్ (14)పై సెప్టెంబరు 28వ తేదీన పంట కాలువలో పడి మృతి చెందాడు. ఉప ముఖ్యమంత్రి సోదరుడు జగ్గయ్యనాయుడు భార్య వాళ్ల పెంపుడు కుక్కను ఉసిగొల్పడం వల్లే తన కుమారుడు మృతిచెందాడని వరుణ్ తండ్రి తిరుపతిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి 40 రోజులైనా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు అమలాపురం వచ్చినప్పుడు 24 గంటల్లో బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమలాపురం పోలీసులు ఈ ఘటనపై స్పందించిన తీరు తొలి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. వరుణ్ కుటుంబ సభ్యులు ఎంతగా వేడుకున్నా కేసు నమోదు చేయలేదు సరికదా... వారికి మద్దతుగా నిలిచిన ప్రజా సంఘాలు, దళిత సంఘాల నిరసనను అడ్డుకునేందుకు మాత్రం శక్తియుక్తులను దారపోశారు. ఉదయం ఆరు గంటలకు మృతదేహం లభ్యమైన వెంటనే కుటుంబీకుల వద్దకు తీసుకుని వెళ్లకుండా.. పోస్టుమార్టం నిమిత్తం నేరుగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించడంపై అప్పట్లోనే వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలోనే బాలుడి తండ్రితోపాటు దళిత సంఘాల నాయకులు జగ్గయ్యనాయుడుకు చెందిన పెంపుడు కుక్క వల్లే వరుణ్‌కుమార్ మృతి చెందినట్టు స్టేట్మెంట్ ఇవ్వగా అధికారులు నమోదు చేసుకున్నారు. పరిహారం ఇచ్చి పక్కదారి పట్టించారు.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ న్యాయం చేస్తామని మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు, ఇళ్ల స్థలం ఇప్పించారు. ఘటనకు కారణమైన హోంమంత్రి సోదరుడి భార్యపై కేసు నమోదు చేయకుండా ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించి కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గళమెత్తిన వారిపై పోలీసులు ఉక్కుపాదం.. వరుణ్‌కుమార్ తండ్రి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు సరికదా... వారికి మద్దతుగా నిలిచిన ప్రజాసంఘాలు, దళిత సంఘాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేసు నమోదు చేయనందుకు నిరసనగా అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ అక్టోబర్ 28న ‘ఛలో అమలాపురం’ పిలుపునిచ్చారు. వరుణ్‌కుమార్ ఘటనలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు భార్యపై 304 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి..ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురంలో సెక్షన్ 30 అమలులో ఉందంటూ హర్షకుమార్‌ను అమలాపురం ఎర్రవంతెన వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు దళిత సంఘాలు నాయకులను గృహ నిర్బంధం చేసి పోలీసు జులుం ప్రదర్శించారు. కాగా బాధితులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ముఖేష్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
హైదరాబాద్: ప్రముఖ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖేష్‌కుమార్‌పై హైదరాబాద్ బేగంపేట్ పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఎం కప్ అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన తమను హాకీ ఆడేందుకు అనుమతించకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ యశ్వంత్, నాగరాజు, వినయ్, మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నుంచి 26 ఏళ్ల వారు మాత్రమే హాకీ ఆడాలని నిబంధన విధించారని, అయితే హాకీ ఆడేందుకు ఎలాంటి వయోపరిమితి లేదని, ఇదే విషయంపై తాము ముఖేష్‌కుమార్‌ను నిలదీసి అడిగినందుకు కులం పేరుతో దూషించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
ఒంగోలు : ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలువురు దళితులు మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ విధంగా తన అగ్రకుల అహంకారాన్ని వెళ్లగక్కారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దళితలు అవమాన పడేలా మాట్లాడడం విచారకరమన్నారు.