ఏపీ హోమ్‌గారి హ్యాపీ హోమ్ | Nimmakayala Chinarajapp Lifestyle and his wife AnuRadha | Sakshi
Sakshi News home page

ఏపీ హోమ్‌గారి హ్యాపీ హోమ్

Published Sun, Mar 15 2015 11:17 PM | Last Updated on Wed, Jul 10 2019 2:36 PM

ఏపీ హోమ్‌గారి హ్యాపీ హోమ్ - Sakshi

ఏపీ హోమ్‌గారి హ్యాపీ హోమ్

‘మా వారు మంత్రి అయ్యారని మా జీవనశైలి మారలేదు’ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సతీమణి అనూరాధ. పొదుపును పాటిస్తూ, ఖర్చులను పరిమితం చేసుకుంటే ఎంత పెద్ద కుటుంబ నిర్వహణ అయినా సాఫీగా సాగుతుందని అమె అంటారు. ఈ విషయంలో ఆమె పాలసీని పూర్తిగా సమర్థిస్తారు రాజప్ప. ‘‘మా ఆవిడ మంచి హోమ్ మేకర్... అందుకే నేను హాయిగా రాజకీయాల్లో నిమగ్నం కాగలుగుతున్నాను’’ అంటారాయన.

అతి పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తూ  బంధువుల మధ్య బాంధవ్యాలను పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గృహిణిగా... అనురాధ అనుభవాలు... ఆమె మాటల్లోనే...

 
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
‘‘మా పుట్టిల్లు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనిపాడు. మా నాన్న ఉద్యోగరీత్యా నా బాల్యం పోర్ట్‌బ్లెయిర్‌లో గడిచింది. హైస్కూల్‌కి వచ్చేటప్పటికి అమలాపురం దగ్గర కూనవరంలో మా పెద్దమ్మగారి దగ్గర పెరిగాను. 1981లో నేను ఇంటర్‌లో ఉండగానే పెళ్లయింది. అప్పటికి ఆయన డిగ్రీ పూర్తి చేశారు. పెళ్లి అయిన తర్వాత ఆయన ఎం.ఎ చదివారు. కానీ నా చదువు మాత్రం ఇంటర్ దగ్గరే ఆగిపోయింది.
 
అత్తగారిల్లు ఓ కొత్త ప్రపంచం
మా అత్తగారిల్లు పెద్ద ఉమ్మడి కుటుంబం. మా మామగారు, ఆయన అన్నయ్య, తమ్ముడు కుటుంబాలు కలిపి మొత్తం 35 మంది ఉండేవారు. మా మామగారు రెండవ వారే అయినప్పటికీ తర్వాతి తరంలో మా వారు పెద్దవారు కావడంతో పెద్ద కొడుకు హోదా వచ్చింది. నాకేమో పెద్ద కోడలు బాధ్యతలు వచ్చాయి. మా అత్తతోపాటు పెద్దత్త, చిన్నత్త ఎలా చేస్తున్నారో చూస్తూ ఇంటి నిర్వహణ, వంట నేర్చుకున్నాను. అంతపెద్ద కుటుంబంలో నేర్చుకోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా యాభై మంది భోజనానికి వస్తున్నారని కబురు వచ్చినా బెంబేలు పడను. వంట దినుసులు ఎంత తెప్పించాలి, ఏయే మోతాదుల్లో వేయాలనే ఉజ్జాయింపు వచ్చేస్తుంది.
 
పిల్లల బాధ్యత

మా అమ్మాయి శివకల్యాణిని మా దగ్గరే, అమలాపురంలో ఉంచుకుని చదివించాం. అబ్బాయి రంగనాగ్‌ని మాత్రం రాజకీయ నేపథ్యానికి దూరంగా ఉంచి కాకినాడ, హైదరాబాద్‌లలో చదివించాను. మా అమ్మాయిని ఇంగ్లిష్ మీడియంలో చదివించనందుకు ఇప్పటికీ నిష్టూర పడుతుంటుంది. తనకు ఎం. కామ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేశాం. అబ్బాయి బీటెక్ చేసి ఛత్తీస్‌ఘడ్‌లో భవన నిర్మాణ రంగం కాంట్రాక్టులు చేస్తున్నాడు.
 
కుటుంబ బంధాలు  
ఇంటి పెద్ద కోడలిగా మరుదులు, ఆడపడుచుల పెళ్లిళ్లు, సీమంతాలు, పురుళ్లు, బారసాలలు, వాళ్ల పిల్లల వేడుకలు... అన్నింటినీ బాధ్యతగా నిర్వహించాను. బంధుత్వాలను సంరక్షించుకుంటూ వచ్చాను. నా మాట తీరుతో కానీ, వ్యవహార ధోరణితో కానీ నొచ్చుకుని దూరమైన వాళ్లు లేరు. పైగా ఆడపడుచులు, తోడికోడళ్లు నాకు పెద్దరికం ఇవ్వడంతో నా బాధ్యత రెట్టింపయింది. ఇప్పటికీ అమలాపురం వెళ్లొచ్చాక అందరి  క్షేమ సమాచారాల కబుర్లు ఆయనకు చెప్పేది నేనే. వారంలో రెండు రోజులు హైదరాబాద్‌లో ఉంటే మిగిలిన రోజులన్నీ అమలాపురంలోనే ఉంటాం. ఊరెళ్లి వచ్చిన తర్వాత ‘అమ్మెలా ఉంది? అంటూ మొదలు తమ్ముళ్ల ఇంటికి వెళ్లి వచ్చావా? అంటూ అందరి బాగోగులు తెలుసుకుంటారు. ఎవరి పిల్లలు ఏం చదువుతున్నారు, ఎందులో ఉద్యోగాలు తెచ్చుకున్నారు... వంటి వివరాలను ఎప్పటికప్పుడు ఆయనకు చెప్తూ ఉండాలి.
 
నేరుగా మెచ్చుకోరు
ఆయనకు పూల మొక్కలు ఇష్టం. ఎక్కడికెళ్లినా కొత్తగా కనిపించిన మొక్కలు తెప్పించి ఎక్కడ నాటాలో కూడా పురమాయిస్తుంటారు. అంతకు మించి ఇంటి గురించి పట్టించుకోవడం ఉండదు. నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటూ తనను టెన్షన్ ఫ్రీగా ఉంచుతానని ఆయనకు గట్టి నమ్మకం. ఆ మాట మరెవరితోనైనా అంటున్నప్పుడు నా చెవిన పడాల్సిందే తప్ప నాతో ఎప్పుడూ అనరు. ఏ విషయంలోనూ ఒకరికొకరం సలహాలిచ్చుకోం. ఆయనెప్పుడైనా బాగా డిస్టర్బ్ అయినట్లు అనిపిస్తే ‘సమస్యను కాలానికి వదిలేసి మీరు చేయాల్సింది చేసుకువెళ్లండి’ అని మాత్రం చెప్తాను.

ఒక్కోసారి ఆయన మీద కోపం వచ్చినప్పుడు మాట్లాడను. ఆయనకు తెలిసిపోతుంది. ఆ కాసేపూ తనూ మాట్లాడకుండా ఉండిపోతారు తప్ప, సంజాయిషీ ఇవ్వరు. నా వంటకు మాత్రం కాంప్లిమెంట్స్ ఇస్తారు. చేపలు, చిక్కుడుకాయ, బీరకాయలో పాలు పోసి చేసిన కూర ఆయనకు ఇష్టం. నేను వంట మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఆమె తన కొడుక్కి నచ్చేటట్లు నాకు వంట నేర్పించారు’’.
ఫొటోలు: ఎస్‌ఎస్ ఠాకూర్
 
ఆమె సహకారమే బలం!
రాజకీయరంగంలో రాణించాలంటే ముందు భార్య సహకారం చాలా ఉండాలి. నేను ఉదయం ఎనిమిదింటికి బయట పడితే రాత్రి తొమ్మిదింటికి ఇల్లు చేరుతాను. కొన్నిసార్లు ఇంకా ఆలస్యం అవుతుంది కూడా. నేనెక్కడ ఉన్నా ఇంటి గురించి చింత అక్కర్లేనంత హాయిగా ఉంచుతోంది మా హోమ్ మినిస్టర్.
 - నిమ్మకాయల చినరాజప్ప,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,హోమ్ మంత్రి
పాతిక శాతం పొదుపు!
మాది వ్యవసాయ కుటుంబం. ఉమ్మడి కుటుంబం. ఆర్థిక లావాదేవీలు, ఇంటి నిర్వహణ చాలాకాలం పాటు అత్తగార్లే చూసుకున్నారు. మామయ్యలు వేరు పడిన తర్వాత మా మామగారు చూసుకునే వారు. దాదాపు పదేళ్లనుంచి ఆ బాధ్యతలు నేను చూసుకుంటున్నాను. వరి పంటలు, రొయ్యలసాగులో మా వారి వాటాకు వచ్చిన డబ్బును మా మరిది నాకే ఇచ్చేస్తారు. వచ్చిన ఆదాయంలో పాతిక శాతం సేవింగ్స్ కోసం పక్కన పెట్టి, మిగిలిన డబ్బులోనే ఖర్చులను పరిమితం చేసుకోవాలనేది నా పాలసీ. అలాగే చేస్తూ వచ్చాను. మాది నిరాడంబరమైన జీవనశైలి. ఖర్చు... రాబడిని మించే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేదాన్ని. అలాంటిది ఓ సారి మా అబ్బాయి ఫీజు కట్టడానికి డబ్బు తక్కువ పడడంతో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌ను బ్రేక్ చేశాను. అంతేతప్ప ఎప్పుడూ దేనికీ అప్పు చేయలేదు.
- అనూరాధ, ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి సతీమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement