Waka manjulareddy
-
మట్టి రుణం ఇలాగ తీరింది
రైతుకు తెలిసిందేమిటి? దుక్కి దున్నడం... విత్తు నాటడం. కలుపు తీయడం... పంటను రాశిపోయడం. ఒళ్లు వంచి శ్రమించడం... మట్టిలో బంగారం పుట్టించడం. మరి... అలాంటి రైతుకు చట్టాల కష్టాలేమిటి? తన పొలంలో ఏం నాటాలో ఏం నాటకూడదో ఒకరు చెప్పేదేమిటి? రైతు మీద ఈ ఆంక్షలేమిటి? తనకు తెలియకుండానే తన మీద కేసు పెడితే ఏం చేయాలి? విదేశీ శక్తుల చేతిలో మనరైతు బలవుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? తనకంటూ హక్కులున్నాయని రైతుకు చెప్పేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క పోరాటంతో సమాధానం వచ్చింది. ఆ సమాధానమే జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో సింఘు బోర్డర్లో జరిగిన రైతుల ఆందోళనను దేశం యావత్తూ గుర్తించింది. రైతులకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుంది. మౌనంగానే అయినా మనస్ఫూర్తిగా సంఘీభావం ప్రకటించింది. కార్పొరేట్ శక్తుల కోరల్లో రైతులు చిక్కుకోకూడదని చిత్తశుద్ధితో కోరుతుంది. అయితే అంతకంటే ముందు ఓ దశాబ్ద కాలంపాటు అమాయకమైన రైతులు కొందరు విదేశీ కార్పొరేట్ శక్తితో ఎదురొడ్డి పోరాడలేక, పోరాటం ఆపలేక సతమతమయ్యారు. వారు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితిని న్యాయస్థానానికి తెలియచేయడం కోసం స్వయంగా సదరు విదేశీ కంపెనీ మీద కేసు వేశారు రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి. విదేశీ కంపెనీ మనదేశ రైతులను కబళించడానికి పన్నిన కుట్రను న్యాయస్థానానికి విశదపరిచారామె. రైతుల పక్షాన ఉన్న న్యాయం ఏమిటో తెలియచేశారు. ఫలితంగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రైతులకు రక్షణగా నిలిచింది. లేస్ చిప్స్ తయారు చేయడానికి అవసరమైన ఎఫ్ ఎల్ – 2027 బంగాళాదుంప పండించిన రైతుల మీద పెప్సీ కంపెనీ కేసు పెట్టింది. తమ కంపెనీతో అంగీకారం కుదుర్చుకోకుండా ఆ పంట పండించిన కారణంగా సదరు రైతులు తమకు కోట్లాదిరూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. కవిత న్యాయపోరాటం ఫలితంగా న్యాయస్థానం సదరు కంపెనీకి ఇచ్చిన పీవీపీ సర్టిఫికేట్‌ను కూడా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. ఒకవైపు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది ఉన్న బడా కార్పొరేట్ సంస్థ... మరోవైపు అసంఘటితంగా ఉన్న రైతులు. ఇలాంటి స్థితిలో రైతుల పక్షాన పోరాటం చేయడానికి వారి పట్ల సానుభూతి ఉంటే సరిపోదు. అంతకు మించిన ధైర్యం ఉండాలి. అంతకంటే ఎక్కువగా రైతు కష్టాలు, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ కంపెనీల వ్యవహార ధోరణి పట్ల స్పష్టమైన అవగాహన కూడా ఉండాలి. గుంటూరులో పుట్టిన తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మాత్రమే వ్యవసాయరంగం గురించి తెలుసుకున్నానని చెప్పారామె. మహిళారైతులే స్ఫూర్తి ‘‘నాకు వ్యవసాయం గురించి మెదక్జిల్లాలోని పస్తాపూర్ మహిళలు నేర్పించారు. పీజీలో ఫీల్డ్ స్టడీ కోసం డీడీఎస్ (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) తో కలిసి పని చేశాను. నిజానికి నేను కమ్యూనికేషన్స్ స్టూడెంట్‌ని. డాక్యుమెంటరీ కోసం ఆ ఊరికి వెళ్లి వ్యవసాయం చేసే మహిళలను దగ్గరగా చూశాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను కూడా అక్కడ పరిచయం చేశాం. ఒక కొత్త విధానాన్ని చక్కగా అర్థం చేసుకుని సమష్టిగా పని చేసుకుంటారు వాళ్లు. వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలు తమ సమస్యలను నేర్పుగా చక్కబెట్టుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మన ఇళ్లలో మగవాళ్లకు ఒకరకం న్యాయం, మహిళలకు మరోరకమైన న్యాయం ఉండడం నాకు మింగుడుపడేది కాదు. బాల్యం నుంచి నన్ను వెంటాడిన అనేక ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరికింది. ఇక ఎం.ఏ పూర్తి కాగానే పస్తాపూర్‌కి వెళ్లిపోయాను. ఆరేళ్లపాటు అక్కడ పని చేసి ఢిల్లీకి వెళ్లి అనేక సంస్థలతో పని చేశాను. ప్రస్తుతం బెంగళూరు నుంచి పని చేస్తున్నాను. నేను రైతు కుటుంబంలో పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పని చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగమూ చేయలేదు... కానీ ఈ మూడు రంగాల మీద చక్కటి అవగాహన ఉంది. భావసారూప్యం కలిగిన వాళ్లం ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పని చేస్తున్నాం. అవసరమైన చోట వీథి పోరాటం చేస్తాం, అలాగే ప్రభుత్వానికి విధాన రూపకల్పన కోసం నివేదికలు ఇస్తాం, అవి దుమ్ముకొట్టుకుని పోతున్నాయనిపిస్తే వాటి అమలు కోసం ఉద్యమమూ చేస్తాం’’ అన్నారామె. కేసు ఈ నాటిది కాదు! పెప్సీ కంపెనీ రైతుల మీద 2008లో తొలిసారి కేసు పెట్టింది. నిందితులు విధిలేక తలకెత్తుకున్న న్యాయపోరాటం ఇది. ఇందుకోసం తమ శక్తికి మించి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ అప్పట్లో తగినంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. వార్తా కథనాలు కూడా పెద్దగా రాలేదు. ‘‘మేము రైతులకు మద్దతుగా పోరాటం మొదలు పెట్టిన వెంటనే చేసిన ప్రధానమైన పని ఈ అంశానికి విస్తృతంగా ప్రచారం కల్పించడమే. మనదేశంలో మంత్రులకు, అనేక సంస్థలకు ఉత్తరాల ద్వారా పోరాటాన్ని ఉధృతం చేశాం. సోషల్ మీడియా ద్వారా యూఎస్, యూరప్, యూకే, ఆఫ్రికా దేశాలకు కూడా తెలిసి వచ్చింది. సదరు కంపెనీ మన రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందనే భావన అందరిలోనూ కలిగింది. మన ప్రభుత్వాల మీద, ఆ కంపెనీ మీద ఇన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురాగలిగాం. వాస్తవాల అన్వేషణ కోసం పంజాబ్, గుజరాత్లో మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్లాం. ఇంత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2019, జూన్‌లో స్వయంగా కేసు వేశాను. రైతులకు అనుకూలంగా వచ్చిన తీర్పు వెనుక ఇంత ఎక్సర్సైజ్ జరిగింది’’ అని చెప్పారు కవిత కురుగంటి. గడచిన గురువారం నాడు హైదరాబాద్, ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌లో జరిగిన ‘రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల పబ్లిక్ హియరింగ్’ కోసం వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ఈ తీర్పు గొప్ప విజయమే... కానీ! ‘ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ – 2001’ ప్రకారం రైతులు తమకు ఇష్టం ఉన్న పంటను పండించుకోవచ్చు. ఈ మేరకు మనదేశం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగని విధంగానే చట్టానికి రూపకల్పన చేసింది. అయితే రైతులకు మాత్రం ఆ విషయం తెలియదు. ఆ కారణంగానే పెప్సీ కంపెనీ రైతుల మీద కేసు వేయగలిగింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా రైతులకు తమకు హక్కులున్నాయని తెలిసింది. ఈ విషయంలో పెప్సీ కంపెనీ కేసు వేయడానికి ముందు సదరు రైతులకు తెలియకుండా వారు పండిస్తున్న బంగాళాదుంపల శాంపుల్స్ సేకరించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించింది. అది కూడా నేరమే. ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడితే పోరాడే శక్తులున్నాయని కార్పొరేట్ కంపెనీలకు ఈ తీర్పు ద్వారా తెలిసి వచ్చింది. ఇది నిజంగా ఒక హెచ్చరిక వంటిది. ప్రభుత్వాలు కూడా ఇకపై మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆశించవచ్చు. అయితే 30 నెలల పాటు జరిగిన ప్రొసీడింగ్స్నీ, తీర్పు పూర్తి పాఠాన్ని గమనిస్తే కొంత ఊగిసలాట కూడా ఉన్నట్లనిపిస్తోంది. ఆ కంపెనీ అగ్రిమెంట్ పూర్తి కావస్తోంది. ఈ దఫా అగ్రిమెంట్లో మరింత పక్కాగా కంపెనీకి ప్రయోజనకరంగా నిర్ణయం తీసుకునే ప్రమాదం లేకపోలేదనిపిస్తోంది. అందుకే అలాంటిది జరిగితే మళ్లీ పోరాడడానికి సిద్ధమవుతున్నాం. – కవిత కురుగంటి, కన్వీనర్, అలయెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
మచిలీపట్నం ప్రేమగాథ
అమర ప్రేమ ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమించే మనసు... మనసునే కోరుకుంటుంది. మనిషి లేకపోయినా ప్రేమను పంచుతుంది మనసు. ప్రేమించే మనిషి కోసం సర్వం అర్పిస్తుంది ప్రేమ. అరబెల్లా - జాన్ ప్యాటర్ల ప్రేమ అలాంటిదే. అరబెల్లా కోసం ప్యాటర్ కట్టిన స్మారక చిహ్నమే అందుకు సాక్ష్యం!! కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం. బంగాళాఖాతంలో అల్పపీడనం పుడితే దాని దిశ, గమనాలను చెప్పడానికి ప్రధానంగా వినిపించే ప్రదేశం మచిలీపట్నం. ఎన్నో అల్పపీడనాలను చూసింది, బంగాళాఖాతం తీరాన ఉన్నందుకు వాయుగుండాల సమాచారానికి కేంద్రమైంది. ఎన్నెన్నో తుఫానులకు అతలాకుతలమైంది. ప్రేమకు ఎదురయ్యేటన్ని ఒడిదొడుకులు మచిలీపట్నానికి కూడా ఎదురయ్యాయి. ఎన్నెన్ని ప్రకృతి విలయాలు వచ్చినా తనను తాను నిలబెట్టుకుంది ఈ పట్టణం. అయితే, ఈ పట్టణంలో ప్రేమబంధంలో చిక్కిన అరబెల్లా- ప్యాటర్లకు మాత్రం వేదనే మిగిలింది. వారి ప్రేమ ఓ విషాదగీతంగా మిగిలింది. అది 19వ శతాబ్దం ప్రారంభం. బ్రిటిష్ పాలనకాలం. మచిలీపట్నం రేవుపట్టణం కావడంతో ఇండియాకు పశ్చిమ దేశాలతో ఎగుమతులు దిగుమతులు విరివిగా జరిగేవి. అందుకు తగ్గట్టు ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ కాలనీలు ఏర్పడ్డాయి. వారి సైనిక స్థావరాలుండేవి. సైనికాధికారులు... కుటుంబాలతో నివసించేవారు. బ్రిటిష్ ఉన్నతాధికారుల కుటుంబాల మధ్య తరచూ గెట్ టు గెదర్లు జరిగేవి. అలాంటి ఓ విందు సమావేశంలో ఒకరినొకరు చూసుకున్నారు అరబెల్లా- జాన్ ప్యాటర్. తొలిచూపులోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. ప్రేమ పరవశం వారి మధ్య బలమైన బంధాన్ని వేసింది. పెద్దల అంగీకారం కరువు! కరువు, దుర్భిక్షం అంటే ఏంటో తెలియని ఊరు అది. కానీ అక్కడ పెద్దలకు పెద్ద మనసు కరువైంది. అరబెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్సన్ అక్బర్ పాత్ర పోషించాడు. సలీం అనార్కలి ప్రేమను చిదిమేయడానికి మొఘల్ పాదుషా అక్బర్ నిరంకుశంగా వ్యవహరించినట్లే రాబిన్సన్ కూడా ప్రేమకు ప్రతినాయకుడయ్యాడు. అలాగే నాలుగేళ్లు గడిచాయి. మానసిక వేదనతో అరబెల్లా కుంగిపోసాగింది. ప్యాటర్ మీద ప్రేమ తగ్గడం లేదు, ప్యాటర్కూ అంతే. కనిపించిన ప్రతిసారీ ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాన’ని ఆరాధన పూర్వకంగా అభ్యర్థిస్తున్నాడు ప్యాటర్. ఏళ్లు గడుస్తున్నా తండ్రి మనసు మెత్తబడడం లేదు. క్రమంగా ప్యాటర్లో నిరాసక్తత పెరగసాగింది. తానొక సైనికాధికారి మేజర్ జనరల్ ప్యాటర్ని తప్ప మరేమీ కాదన్నట్లు యాంత్రికంగా మారిపోతున్నాడు. అరబెల్లాకు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. తండ్రి ఒప్పుకోకపోయినా సరే ప్యాటర్ను పెళ్లి చేసుకోవడానికే సిద్ధమైంది. ఓ రోజు... అరబెల్లా ఇల్లు వదిలి వచ్చేసింది. అవి ప్యాటర్ జీవితంలో ఆనందక్షణాలు. పెళ్లి గురించి రంగురంగుల కలలు కన్నది అరబెల్లా. ఆ కలలను నిజం చేయడంలో ఆనందం పొందుతున్నాడు ప్యాటర్. ఆమె కోరిక మేరకు లండన్ నుంచి వెడ్డింగ్ గౌన్కూ, రింగ్కూ ఆర్డర్ పంపాడు. పెళ్లి తర్వాత జీవితాన్ని అందంగా ఊహించుకుంటోంది అరబెల్లా. పెళ్లి డ్రస్ వచ్చేసింది. ఇక పై వారంలో పెళ్లి. బ్రిటిష్ అధికారుల గెట్ టు గెదర్‌లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆహ్వానించాలి. ఎగ్జయిట్‌మెంట్‌తో అరబెల్లాకి ఆ రోజంతా భోజనం చేయాలనిపించడం లేదు. మరుసటి రోజు ఉదయానికి నీరసం. భోజనం లేకపోవడంతోనే అనుకున్నారు. కానీ అది మలేరియా తెచ్చిన నీరసం. అలా మంచం పట్టిన అరబెల్లాకు అదే డెత్బెడ్ అయింది. 1809, నవంబర్ ఆరవ తేదీ ఆమెకు చివరిరోజయింది. తన కోసం అందరినీ వదిలి వచ్చిన అరబెల్లాకు తానేమీ చేయలేకపోయాడు. చేసే అవకాశం ఇవ్వకనే దేవుడు ఆమె ప్రాణాలను తీసుకెళ్లిపోయాడు. అరబెల్లా దేహాన్ని రసాయనాలతో శుభ్రం చేశాడు ప్యాటర్. ఆమె కోరుకున్న వెడ్డింగ్గౌన్ వేసి పెళ్లి కూతురిలా అలంకరించాడు. ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగాడు. అరబెల్లాను పూలచెండును పట్టుకున్నంత జాగ్రత్తగా పైకి లేపి గాజు పెట్టెలో భద్రపరిచాడు. ఇక ఆమెను ఖననం చేయాలి. అయితే... వారి ప్రేమను మత పండిత వర్గం అంగీకరించలేదు. పట్టణంలో ఉన్న ఏ శ్మశానవాటికలోకీ అనుమతివ్వలేదు. కళ్ల ముందు అరబెల్లా ముఖం ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు ఉంది. ప్యాటర్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆమె ముఖంలో ఆందోళన పారిపోయి ప్రసన్నత వచ్చింది. అదే ప్రసన్నవదనం కళ్ల ముందు. ‘నిన్నొదిలి నేనెక్కడికీ వెళ్లలేను ప్యాటర్’ అన్నట్లు ఉంది ఆమె ముఖం. అవును... తన కళ్ల ముందు నుంచి అరబెల్లాను ఎవరూ తీసుకెళ్లలేరనే మొండితనం ఆవరించింది. ప్యాటర్ ఓ నిర్ణయానికి వచ్చాడు. పట్టణానికి దూరంగా ఆనందపురంలో డచ్ వారి ఆధీనంలో ఖాళీస్థలం ఉంది. పన్నెండెకరాలకు పైగా ఉన్న ఆ స్థలాన్ని కొన్నాడు. మతపరమైన ప్రార్థనలేవీ లేకనే అరబెల్లాను అందులో ఖననం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లలో (1812 తొలినాళ్లలో) చర్చి నిర్మాణం పూర్తయింది. రోజూ చూసేవాడు! ప్యాటర్ ప్రతిరోజూ ఉదయం ఉద్యోగ విధులకు వెళ్లేముందు చర్చ్‌కి వచ్చి అరబెల్లాను చూసేవాడు, అలాగే సాయంత్రం ఓ సారి చూసుకునేవాడు. చర్చ్‌ని నిర్మించేటప్పుడే ఎప్పుడు కావాలంలే అప్పుడు గాజు పెట్టె పైకి వచ్చేటట్లు ఏర్పాటు చేశాడు. అది ఎలా ఉండేదంటే... పది అడుగుల ఎత్తులో గోడకు ఒక చెక్క పావురాన్ని అమర్చారు. ఆ చెక్క పావురాన్ని పట్టుకుని తిప్పితే గాజుపెట్టె కింద ఉన్న అమరిక మొత్తం పైకి లేస్తుంది. ప్యాటర్ రోజూ నిచ్చెన వేసుకుని చెక్క పావురాన్ని తిప్పి, గాజు పెట్టెలో ఉన్న అరబెల్లాను కళ్లార్పకుండా చూసుకుని, తిరిగి పేటికను మూసేసి వెళ్లేవాడు. అలా కొన్నేళ్లపాటు... అతడికి చెన్నైకి బదిలీ అయ్యే వరకు కొనసాగింది. చెన్నైలో ఉద్యోగం చేస్తూ నెలకోసారి వచ్చి అరబెల్లాను చూసుకునే వాడు ప్యాటర్. అయితే అరబెల్లా కనిపించని చెన్నై నగరంలో ప్యాటర్ ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. 1817లో తుదిశ్వాస వదిలాడు. అరబెల్లా జ్ఞాపకాలతోనే జీవించిన ప్యాటర్ను చెన్నై నగరం తన గుండెల్లో జ్ఞాపకంగా దాచుకుంది. చెన్నైలో ఒక పార్కు, ఒక రోడ్డు ఆయన పేరుతో ఉన్నాయి. మచిలీపట్నం - చెన్నపట్నం ఈ అమరప్రేమికుల ప్రేమకు మౌనసాక్ష్యాలు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నందం శ్రీనివాస్ అరబెల్లాను చూడలేం! మచిలీపట్నం వెళ్లిన వాళ్లకు అరబెల్లా చర్చ్ (సెయింట్ మేరీస్ చర్చ్) కనిపిస్తుంది, ప్యాటర్ అమర్చిన పావురం బొమ్మ ఉన్న గోడ కనిపిస్తుంది. దాని మీద అరబెల్లా కోసం రాసిన పాలరాతి ఫలకం కనిపిస్తుంది. ఆమెను ఖననం చేసిన చోటు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరబెల్లా కనిపించదు. ఎందుకంటే... ఒకసారి చర్చ్ పనివాళ్లలో ఒకరు చెక్క పావురాన్ని తుడవడానికి అటూ ఇటూ తిప్పారు. ఆ పావురాన్ని తిప్పితే శవపేటిక పైకి వస్తుందని తెలియదు. పావురం బొమ్మను తిప్పగానే అరబెల్లా ఉన్న గాజు పెట్టె పైకి లేచింది. భయంతో అక్కడికక్కడే అతడి గుండె ఆగిపోయింది. దాంతో అప్పటి కలెక్టర్ ఆ ఫలకాన్ని శాశ్వతంగా మూయించారు. అరబెల్లా చర్చ్! అరబెల్లా పరలోకాన్ని చేరిన తర్వాత ప్యాటర్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదు. అరబెల్లా కోసం ఇంకా ఏదయినా చేయాలని అతడి మనసు తపిస్తుండేది. ఏం చేయాలనేది ఒక రూపు వచ్చాక, ఉద్యోగానికి సెలవు పెట్టి లండన్‌కు వెళ్లాడు. అక్కడ తనకున్న ఆస్తులను అమ్మేసి డబ్బుతో ఇండియాకి వచ్చాడు. ఆమెను ఖననం చేసిన ప్రదేశంలో 18 వేల రూపాయలతో అరబెల్లా స్మారకార్థం చర్చి భవనాన్ని నిర్మించాడు. తాను చెన్నైకి బదిలీ అయి వెళ్లేటప్పుడు దానిని ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వాధీనం చేశాడు ప్యాటర్. 1842లో ఆ చర్చ్‌కు సెయింట్ మేరీస్ చర్చ్‌గా పేరు మార్చారు. ఆ నిర్మాణమే అరబెల్లా, ప్యాటర్లను చిరంజీవులను చేసింది. ప్రేమను విశ్వసించే వారు ఆ చర్చ్ ఆవరణలోనే తమ వారిని ఖననం చేస్తుంటారు. రాబిన్సన్ కారణాలివి! అరబెల్లా కంటే జాన్ ప్యాటర్ 18 ఏళ్లు పెద్దవాడు. ఆయనకు అంతకు ముందు పెళ్లయింది. ఇవి పైకి కనిపించిన కారణాలు. అయితే ప్యాటర్ క్యాథలిక్ కాదు ప్రొటెస్టెంట్ అనేది రాబిన్సన్ మనసులో దాగిన అసలు కారణం. -
ఏపీ హోమ్‌గారి హ్యాపీ హోమ్
‘మా వారు మంత్రి అయ్యారని మా జీవనశైలి మారలేదు’ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సతీమణి అనూరాధ. పొదుపును పాటిస్తూ, ఖర్చులను పరిమితం చేసుకుంటే ఎంత పెద్ద కుటుంబ నిర్వహణ అయినా సాఫీగా సాగుతుందని అమె అంటారు. ఈ విషయంలో ఆమె పాలసీని పూర్తిగా సమర్థిస్తారు రాజప్ప. ‘‘మా ఆవిడ మంచి హోమ్ మేకర్... అందుకే నేను హాయిగా రాజకీయాల్లో నిమగ్నం కాగలుగుతున్నాను’’ అంటారాయన. అతి పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తూ బంధువుల మధ్య బాంధవ్యాలను పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గృహిణిగా... అనురాధ అనుభవాలు... ఆమె మాటల్లోనే... - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘మా పుట్టిల్లు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనిపాడు. మా నాన్న ఉద్యోగరీత్యా నా బాల్యం పోర్ట్బ్లెయిర్లో గడిచింది. హైస్కూల్‌కి వచ్చేటప్పటికి అమలాపురం దగ్గర కూనవరంలో మా పెద్దమ్మగారి దగ్గర పెరిగాను. 1981లో నేను ఇంటర్లో ఉండగానే పెళ్లయింది. అప్పటికి ఆయన డిగ్రీ పూర్తి చేశారు. పెళ్లి అయిన తర్వాత ఆయన ఎం.ఎ చదివారు. కానీ నా చదువు మాత్రం ఇంటర్ దగ్గరే ఆగిపోయింది. అత్తగారిల్లు ఓ కొత్త ప్రపంచం మా అత్తగారిల్లు పెద్ద ఉమ్మడి కుటుంబం. మా మామగారు, ఆయన అన్నయ్య, తమ్ముడు కుటుంబాలు కలిపి మొత్తం 35 మంది ఉండేవారు. మా మామగారు రెండవ వారే అయినప్పటికీ తర్వాతి తరంలో మా వారు పెద్దవారు కావడంతో పెద్ద కొడుకు హోదా వచ్చింది. నాకేమో పెద్ద కోడలు బాధ్యతలు వచ్చాయి. మా అత్తతోపాటు పెద్దత్త, చిన్నత్త ఎలా చేస్తున్నారో చూస్తూ ఇంటి నిర్వహణ, వంట నేర్చుకున్నాను. అంతపెద్ద కుటుంబంలో నేర్చుకోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా యాభై మంది భోజనానికి వస్తున్నారని కబురు వచ్చినా బెంబేలు పడను. వంట దినుసులు ఎంత తెప్పించాలి, ఏయే మోతాదుల్లో వేయాలనే ఉజ్జాయింపు వచ్చేస్తుంది. పిల్లల బాధ్యత మా అమ్మాయి శివకల్యాణిని మా దగ్గరే, అమలాపురంలో ఉంచుకుని చదివించాం. అబ్బాయి రంగనాగ్ని మాత్రం రాజకీయ నేపథ్యానికి దూరంగా ఉంచి కాకినాడ, హైదరాబాద్‌లలో చదివించాను. మా అమ్మాయిని ఇంగ్లిష్ మీడియంలో చదివించనందుకు ఇప్పటికీ నిష్టూర పడుతుంటుంది. తనకు ఎం. కామ్ పూర్తయిన తర్వాత పెళ్లి చేశాం. అబ్బాయి బీటెక్ చేసి ఛత్తీస్‌ఘడ్‌లో భవన నిర్మాణ రంగం కాంట్రాక్టులు చేస్తున్నాడు. కుటుంబ బంధాలు ఇంటి పెద్ద కోడలిగా మరుదులు, ఆడపడుచుల పెళ్లిళ్లు, సీమంతాలు, పురుళ్లు, బారసాలలు, వాళ్ల పిల్లల వేడుకలు... అన్నింటినీ బాధ్యతగా నిర్వహించాను. బంధుత్వాలను సంరక్షించుకుంటూ వచ్చాను. నా మాట తీరుతో కానీ, వ్యవహార ధోరణితో కానీ నొచ్చుకుని దూరమైన వాళ్లు లేరు. పైగా ఆడపడుచులు, తోడికోడళ్లు నాకు పెద్దరికం ఇవ్వడంతో నా బాధ్యత రెట్టింపయింది. ఇప్పటికీ అమలాపురం వెళ్లొచ్చాక అందరి క్షేమ సమాచారాల కబుర్లు ఆయనకు చెప్పేది నేనే. వారంలో రెండు రోజులు హైదరాబాద్‌లో ఉంటే మిగిలిన రోజులన్నీ అమలాపురంలోనే ఉంటాం. ఊరెళ్లి వచ్చిన తర్వాత ‘అమ్మెలా ఉంది? అంటూ మొదలు తమ్ముళ్ల ఇంటికి వెళ్లి వచ్చావా? అంటూ అందరి బాగోగులు తెలుసుకుంటారు. ఎవరి పిల్లలు ఏం చదువుతున్నారు, ఎందులో ఉద్యోగాలు తెచ్చుకున్నారు... వంటి వివరాలను ఎప్పటికప్పుడు ఆయనకు చెప్తూ ఉండాలి. నేరుగా మెచ్చుకోరు ఆయనకు పూల మొక్కలు ఇష్టం. ఎక్కడికెళ్లినా కొత్తగా కనిపించిన మొక్కలు తెప్పించి ఎక్కడ నాటాలో కూడా పురమాయిస్తుంటారు. అంతకు మించి ఇంటి గురించి పట్టించుకోవడం ఉండదు. నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటూ తనను టెన్షన్ ఫ్రీగా ఉంచుతానని ఆయనకు గట్టి నమ్మకం. ఆ మాట మరెవరితోనైనా అంటున్నప్పుడు నా చెవిన పడాల్సిందే తప్ప నాతో ఎప్పుడూ అనరు. ఏ విషయంలోనూ ఒకరికొకరం సలహాలిచ్చుకోం. ఆయనెప్పుడైనా బాగా డిస్టర్బ్ అయినట్లు అనిపిస్తే ‘సమస్యను కాలానికి వదిలేసి మీరు చేయాల్సింది చేసుకువెళ్లండి’ అని మాత్రం చెప్తాను. ఒక్కోసారి ఆయన మీద కోపం వచ్చినప్పుడు మాట్లాడను. ఆయనకు తెలిసిపోతుంది. ఆ కాసేపూ తనూ మాట్లాడకుండా ఉండిపోతారు తప్ప, సంజాయిషీ ఇవ్వరు. నా వంటకు మాత్రం కాంప్లిమెంట్స్ ఇస్తారు. చేపలు, చిక్కుడుకాయ, బీరకాయలో పాలు పోసి చేసిన కూర ఆయనకు ఇష్టం. నేను వంట మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఆమె తన కొడుక్కి నచ్చేటట్లు నాకు వంట నేర్పించారు’’. ఫొటోలు: ఎస్ఎస్ ఠాకూర్ ఆమె సహకారమే బలం! రాజకీయరంగంలో రాణించాలంటే ముందు భార్య సహకారం చాలా ఉండాలి. నేను ఉదయం ఎనిమిదింటికి బయట పడితే రాత్రి తొమ్మిదింటికి ఇల్లు చేరుతాను. కొన్నిసార్లు ఇంకా ఆలస్యం అవుతుంది కూడా. నేనెక్కడ ఉన్నా ఇంటి గురించి చింత అక్కర్లేనంత హాయిగా ఉంచుతోంది మా హోమ్ మినిస్టర్. - నిమ్మకాయల చినరాజప్ప,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,హోమ్ మంత్రి పాతిక శాతం పొదుపు! మాది వ్యవసాయ కుటుంబం. ఉమ్మడి కుటుంబం. ఆర్థిక లావాదేవీలు, ఇంటి నిర్వహణ చాలాకాలం పాటు అత్తగార్లే చూసుకున్నారు. మామయ్యలు వేరు పడిన తర్వాత మా మామగారు చూసుకునే వారు. దాదాపు పదేళ్లనుంచి ఆ బాధ్యతలు నేను చూసుకుంటున్నాను. వరి పంటలు, రొయ్యలసాగులో మా వారి వాటాకు వచ్చిన డబ్బును మా మరిది నాకే ఇచ్చేస్తారు. వచ్చిన ఆదాయంలో పాతిక శాతం సేవింగ్స్ కోసం పక్కన పెట్టి, మిగిలిన డబ్బులోనే ఖర్చులను పరిమితం చేసుకోవాలనేది నా పాలసీ. అలాగే చేస్తూ వచ్చాను. మాది నిరాడంబరమైన జీవనశైలి. ఖర్చు... రాబడిని మించే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేదాన్ని. అలాంటిది ఓ సారి మా అబ్బాయి ఫీజు కట్టడానికి డబ్బు తక్కువ పడడంతో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌ను బ్రేక్ చేశాను. అంతేతప్ప ఎప్పుడూ దేనికీ అప్పు చేయలేదు. - అనూరాధ, ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి సతీమణి -
ఓ మనిషీ! లోపలి మనిషిని కాపాడుకో!!
గోరటి వెంకన్న... ప్రజాకవి. సమాజం అనే చెట్టుకు పూసిన పువ్వు. ఆకలి తెలిసిన ఈయన అక్షరం వెదజల్లే సువాసనకు కృత్రిమత్వం తెలియదు. కృతకపు మకిలీ అంటదు. ప్రకృతిలోని సహజత్వాన్ని అచ్చంగా నింపుకున్న ఆయన అంతరంగం ఇది. మీ గురించి మీరు ఒక్కమాటలో... పరిమితత్వాన్ని, ప్రశాంతతను, సహజత్వాన్ని ఇష్టపడతాను. మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం ? నచ్చే లక్షణం ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ నన్ను నేను సవరించుకోవడం. నచ్చని లక్షణం కోపం. అదీ ఒక్క నిమిషమే. మీ పాటకు గురువు ఎవరు ? తొలి గురువు నా తండ్రి. ఆ తర్వాత ప్రకృతి. ఎప్పుడు, ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు? మహబూబ్‌నగర్ జిల్లా గౌరారంలో పుట్టాను. 1965, ఏప్రిల్ 4న పుట్టానని స్కూల్లో టీచర్ రాశారు. వైశాఖ పౌర్ణమి రోజు పుట్టానని అమ్మ చెప్పింది. ఎంఎ తెలుగు లిటరేచర్ చదువుకున్నా. చదువుకునే రోజుల్లో జీవితంలో ఎలా స్థిరపడాలనుకునేవారు? చిన్నప్పుడు టీచర్ని కావాలనుకునేవాడిని. నాగర్ కర్నూల్లో కో ఆపరేటివ్ సెక్షన్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా చేస్తున్నాను. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు? మా అమ్మానాన్నలు నరసింహ, ఈరమ్మ. జీవితంలో మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ! మా నాన్న. ఆయన రైతు, అయినా శతకాలను కంఠతా చెప్పేవాడు. అలా చేసి ఉండాల్సింది కాదనుకున్న సందర్భం? ఉంది. కానీ, చెప్పకూడదు. మీకు పిల్లలు ఎంతమంది? నలుగురు. ముగ్గురమ్మాయిలు (ఎంఫార్మసీ, ఐఎంఎస్సి, బీ.టెక్). ఒక అబ్బాయి (ఇంటర్ చదువుతున్నాడు).వచ్చే జన్మంటూ ఉంటే... మళ్లీ కవిగానే.మీకు శిష్యులు... నేనెవర్నీ తయారు చేయలేదు. మనిషి ఎలా ఉండాలంటారు? సాహిత్యం చదవాలి. అంతరంగంలోని మనిషిని కాపాడుకోవాలి. అంతరంగ చేతనకు అనుగుణంగా మెలగాలి. మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి ? పిల్లల గురించిన భయమే ఎక్కువ. వాళ్లు ఇంటికి రావడం కొద్దిగా ఆలస్యమైనా భయమేస్తుంది. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు ? ‘రంగస్థల నటుడిగా అమరుతాను’ అనుకుంటాను. నాలో పాతకాలపు నాటకాల (16వ శతాబ్దం నాటి) ఛాయలు ఉన్నాయనిపిస్తుంది. - వాకా మంజులారెడ్డి -
ఆయన దారి... ఎందరికో రహదారి
ఏ రోడ్డు మీద గుంటలు కనిపించినా వెంటనే కారాపి, వాటిని పూడ్చేస్తారాయన. ఆయన కారు డిక్కీలో గోనె సంచుల నిండా తారుపెళ్లలు, పలుగు, పార ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి... రైల్వే ఉద్యోగం నుంచి రిటైరై... హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న బాలగంగాధర తిలక్ ఈ పనెందుకు చేస్తున్నట్లు? రోజూ చూసే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది మెరుగైన సమాజం కోసం శ్రమిస్తున్న ఓ సామాన్యుడి విచిత్ర సేవకు వెయ్యిమంది ఎలా కలిశారు? ‘‘మొదట్లో నేను ఒక్కడినే చేసేవాడిని. నా చేతికి నీళ్లు పోయడానికి పిలిచినా కూడా ఎవరూ వచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు దాదాపు వెయ్యిమంది దాకా నాతో చేతులు కలిపారు. ఇది నాకెంతో తృప్తినిస్తోంది.’’ - తిలక్ హైదరాబాద్‌లోని రోడ్ల మీద తరచూ గుంటలను పూడుస్తూ కనిపిస్తుంటారాయన. చూడడానికి బాగా చదువుకున్న వాడిలా అనిపించే ఆయనను చూస్తే, ‘కాంట్రాక్టరేమో... పిసినిగొట్టులా ఉన్నాడు... కూలీలను పెట్టకుండా తానొక్కడే చేస్తున్నాడు. పైగా తారు... కంకర వేయకుండా రాళ్లతో నింపేస్తున్నాడు...’ అనుకొంటారు. ఇంతకీ ఆయన చేస్తున్న పనేంటంటే... రోడ్డు మీద ప్రమాదాలకు కారణమవుతున్న గుంటలను స్వచ్ఛందంగా, స్వహస్తాలతో పూడ్చడం. రోడ్ల మీద గుంటలను పూడ్చే యజ్ఞంలో సమాజంలోని అనేక కోణాలను చూశానంటారు కాట్నం బాలగంగాధర తిలక్. బాలగంగాధర తిలక్‌ది పశ్చిమగోదావరి జిల్లా ఎర్నగూడెం గ్రామంలో వ్యవసాయ కుటుంబం. పాలిటెక్నిక్ పూర్తి చేసి 1993లో రైల్వేలో సిగ్నల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. సాఫ్ట్వేర్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన తిలక్... ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ శివార్లలో ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. హైదర్షా కోట్ గ్రామంలో నివాసం. సాధారణ వ్యక్తిగా తన జీవితమేదో తాను గడిపేస్తున్న తిలక్‌ని అసాధారణ వ్యక్తిగా మార్చిన ప్రదేశం అది. ఆ రోజు ఉదయం మామూలుగానే ఆఫీసుకు బయల్దేరారాయన. ముందురోజు రాత్రి వర్షం కురవడంతో రోడ్డంతా బురదమయం. గుంతల్లో నీరు మడుగులు కట్టింది. ఎంత జాగ్రత్తగా నడిపినా సరే కారు చక్రం మడుగులో పడడం... బురద నీరు స్కూలుకెళ్తున్న పిల్లల మీద చిందడం జరిగిపోయాయి. ఆందోళనగా కారాపారు తిలక్. స్కూలు పిల్లలతోపాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్లు ఏమీ మాట్లాడలేదు... కానీ ఒక చూపు చూశారు. ఆ చూపులో చాలా అర్థాలున్నాయి, అనేక భావాలు వ్యక్తమయ్యాయి. తర్వాత ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. మనిషిని మార్చిన సంఘటనలు కానీ తిలక్‌ని ఆ చూపులు ఆ రోజంతా వెంటాడుతూనే ఉన్నాయి. అదే విషయాన్ని ఆఫీసులో సహోద్యోగులతో పంచుకున్నారు. హైదరాబాద్ రోడ్ల మీద ఇది చాలా సాధారణం అని తేలిగ్గా అనేశారు. తిలక్ మాత్రం తేలిగ్గా తీసుకోలేకపోయారు. ‘‘ఆ తర్వాత వచ్చిన శని, ఆదివారాల్లో ఆ గుంతలను పూడ్చేశాను. ఇది జరిగింది 2010 జనవరి 19వ తేదీన. ఆ రోజు ఆరు ట్రక్కుల మట్టితో శ్రామికులను పెట్టి గుంతలను నింపడానికి ఐదున్నరవేలు ఖర్చయ్యాయి. ఆ తర్వాత సోమవారం రోజు యథావిధిగా ఆఫీసుకు వెళ్తున్నప్పుడు అదే పిల్లలు కారాపి కృతజ్ఞతలు చెప్పారు’’ అంటూ తన ప్రయత్నం నిరంతర యజ్ఞంలా సాగడానికి దారి తీసిన సంఘటనను తిలక్ వివరించారు. అదే వారంలో ఒకరోజు లంగర్ హౌస్ నుంచి నార్సింగి వెళ్లేదారిలో ప్రయాణిస్తున్నారు తిలక్. రోడ్డుమధ్యలో చిన్న గుంట... బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఆ గుంటను తప్పించుకోవడానికి పక్కకు జరిగాడు. వెనుకే వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టి, బైక్ రైడర్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో మూడు రోజులకు ఒక ఆటో డ్రైవర్ అదే గోతిని తప్పించబోయినప్పుడు ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. ఒకరు అక్కడే చనిపోయారు. కళ్ల ముందే ప్రాణాలు పోవడంతో తిలక్ మనసు కలిచివేసినట్లయింది. ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా ఈ గోతిని ఎవరైనా పూడ్చేస్తే ఈ ప్రమాదాలు జరక్కపోయేవి కదా అని కూడా అనిపించింది. దీనిని ఇలాగే వదలడం ఎందుకు అనిపించి కారాపి ఫుట్‌పాత్ పక్కన ఉన్న తారుపెళ్లలతో గోతిని నింపారు. ఇక అప్పటినుంచి రోడ్డు మీద ఎక్కడ గొయ్యి కనిపించినా రోడ్డు పక్కన కారాపి తారుపెళ్లలతో ఆ గోతిని పూడ్చడం ఆయన దైనందిన కార్యక్రమంగా మారింది. ఆయన కారు డిక్కీలో చిన్న పలుగు, పార, చేతికి వేసుకోవడానికి గ్లవుజులు ఎప్పుడూ ఉంటాయి. పదుగురినీ కదిలించిన సేవ తిలక్ సందర్భానుసారంగా స్పందించి చేసిన పని, ఆయన కుమారుడు రవికిరణ్ చొరవతో సమష్టికృషిగా మారింది. ఈ క్రమంలో ఇన్ఫోటెక్లో కన్సల్టెంట్ ఉద్యోగాన్ని మానేశారాయన. పెన్షన్ డబ్బు కూడా మట్టికొనడం వంటి ఇతర అవసరాలకు ఖర్చయిపోవడం మొదలయ్యాక భార్య వెంకటేశ్వరి ఇక చూస్తూ ఊరుకోలేక పోయారు. ఈ సమాచారం అమెరికాలో ఉన్న రవికిరణ్‌కు చేరింది. కానీ, తండ్రిలో పరివర్తన తీసుకురావడానికి ఇండియా వచ్చిన రవికిరణ్ ఈ సేవను కళ్ళారా చూసి, చివరికి తండ్రి మార్గంలోకే వచ్చేశారు. అప్పటి నగర కమిషనర్ కృష్ణబాబును కలిసి ఈ శ్రమదానానికి ప్రభుత్వం నుంచి మెటీరియల్ ఇప్పించే ఏర్పాటు చేశాడు. ఇప్పటి నగర కమిషనర్ కూడా సహకారాన్ని కొనసాగిస్తున్నారు. ‘‘అలాగే మా అబ్బాయి నేను గుంటలు పూడుస్తున్న వైనాన్ని ఫొటోలు తీసి ఫేస్బుక్లో పెట్టి, ఇలాగే శ్రమదానం చేయాలనే వారు పాల్గొనవచ్చని ఆహ్వానించాడు. అప్పటి నుంచి చాలామంది యువకులు ముందుకొస్తున్నారు’’ అన్నారు తిలక్. వీరంతా కలిసి ప్రతి శని, ఆది వారాలూ పనిచేస్తున్నారు. ఏ వారం ఎక్కడ శ్రమదానం ఉంటుందనేది ఫేస్బుక్ ద్వారానే సమాచారం ఇస్తారు. ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్న వారిని మాత్రమే పాల్గొంటారు. అలా ఇప్పటి వరకు దిల్షుక్ నగర్, ఎల్.బి నగర్, నాగోల్, వనస్థలిపురం, పురానాపూల్, జియాగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లంగర్‌హౌజ్, మెహిదీపట్నం, చందానగర్ రోడ్లను బాగుచేశారు. తిలక్ చేస్తున్న పని ద్వారా సమాజం ఫలితం పొందుతోంది. ఒక సామాన్యుడి శ్రమదానానికి ఇంతకన్నా సత్ఫలితం ఇంకేం కావాలి! - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్