ఓ మనిషీ! లోపలి మనిషిని కాపాడుకో!!
గోరటి వెంకన్న... ప్రజాకవి. సమాజం అనే చెట్టుకు పూసిన పువ్వు. ఆకలి తెలిసిన ఈయన అక్షరం వెదజల్లే సువాసనకు కృత్రిమత్వం తెలియదు. కృతకపు మకిలీ అంటదు. ప్రకృతిలోని సహజత్వాన్ని అచ్చంగా నింపుకున్న ఆయన అంతరంగం ఇది.
మీ గురించి మీరు ఒక్కమాటలో...
పరిమితత్వాన్ని, ప్రశాంతతను, సహజత్వాన్ని ఇష్టపడతాను.
మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం ?
నచ్చే లక్షణం ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ నన్ను నేను సవరించుకోవడం. నచ్చని లక్షణం కోపం. అదీ ఒక్క నిమిషమే.
మీ పాటకు గురువు ఎవరు ?
తొలి గురువు నా తండ్రి. ఆ తర్వాత ప్రకృతి.
ఎప్పుడు, ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు?
మహబూబ్‌నగర్ జిల్లా గౌరారంలో పుట్టాను. 1965, ఏప్రిల్ 4న పుట్టానని స్కూల్లో టీచర్ రాశారు. వైశాఖ పౌర్ణమి రోజు పుట్టానని అమ్మ చెప్పింది. ఎంఎ తెలుగు లిటరేచర్ చదువుకున్నా.
చదువుకునే రోజుల్లో జీవితంలో ఎలా స్థిరపడాలనుకునేవారు?
చిన్నప్పుడు టీచర్‌ని కావాలనుకునేవాడిని. నాగర్ కర్నూల్‌లో కో ఆపరేటివ్ సెక్షన్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా చేస్తున్నాను.
మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు?
మా అమ్మానాన్నలు నరసింహ, ఈరమ్మ.
జీవితంలో మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి !
మా నాన్న. ఆయన రైతు, అయినా శతకాలను కంఠతా చెప్పేవాడు.
అలా చేసి ఉండాల్సింది కాదనుకున్న సందర్భం?
ఉంది. కానీ, చెప్పకూడదు.
మీకు పిల్లలు ఎంతమంది?
నలుగురు. ముగ్గురమ్మాయిలు (ఎంఫార్మసీ, ఐఎంఎస్‌సి, బీ.టెక్). ఒక అబ్బాయి (ఇంటర్ చదువుతున్నాడు).వచ్చే జన్మంటూ ఉంటే... మళ్లీ కవిగానే.మీకు శిష్యులు... నేనెవర్నీ తయారు చేయలేదు.
మనిషి ఎలా ఉండాలంటారు?
సాహిత్యం చదవాలి. అంతరంగంలోని మనిషిని కాపాడుకోవాలి. అంతరంగ చేతనకు అనుగుణంగా మెలగాలి.
మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి ?
పిల్లల గురించిన భయమే ఎక్కువ. వాళ్లు ఇంటికి రావడం కొద్దిగా ఆలస్యమైనా భయమేస్తుంది.
అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు ?
‘రంగస్థల నటుడిగా అమరుతాను’ అనుకుంటాను. నాలో పాతకాలపు నాటకాల (16వ శతాబ్దం నాటి) ఛాయలు ఉన్నాయనిపిస్తుంది.
- వాకా మంజులారెడ్డి