
నిమ్మకాయల చిన్నరాజప్ప, యనమల రామకృష్ణుడు
సాక్షి, అమరావతి: రాజధానిలో తవ్వే కొద్దీ టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్ బాగోతాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం నూతన రాజధాని గురించి అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు తన టీమ్‌కు లీకులు ఇవ్వడంతో పచ్చ కోటరీ అమరావతి ప్రాంతంలో భారీగా భూకొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్‌కుమార్ జూన్ 6, 2014న తాడికొండలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 31, 2014న నేలపాడులోని సర్వే నంబర్ 59లో టీడీపీ నేత నిమ్మకాయల చిన్నరాజప్ప తన కుమారుడు రంగనాథ్ పేరుతో రెండు ఎకరాలు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఎకరం 7 లక్షలకు కొని కోటి రూపాయలకు చినరాజప్ప అమ్మినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మరో మూడు గ్రామాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా భూకొనుగోళ్లు బయటపడ్డాయి. కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 23/బీ1లో అక్టోబర్10, 2014న ఎకరం భూమి, కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 51/డీలో అక్టోబర్ 10, 2014న ఎకరం 4సెంట్లు, కొండంరాజుపాలెంలో సర్వే నెంబర్ 63/ఏలో అక్టోబర్ 10, 2014న 67సెంట్లు, కురగల్లులో సర్వే నెంబర్ 8/2 అక్టోబర్ 14, 2014న ఎకరం 29సెంట్లు కూతురు గోనుగుంట్ల లక్ష్మీసౌజన్య పేరుతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2014 నవంబర్ 27న లింగాయపాలెంలో సర్వే నెంబర్ 149లో ఎకరం 25సెంట్లు తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ పేరుతో ఆంజనేయులు కొనుగోలు చేసినట్లు తెలిసింది.