
ఏపీలో వడదెబ్బకు 551మంది మృతి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకూ వడదెబ్బకు 551మంది మృతి చెందినట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందచేస్తామన్నారు. మండల అధికారులతో కమిటీ వేసి మృతుల వివరాలు నమోదుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు చినరాజప్ప తెలిపారు.
టీడీపీ గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల కమిషన్ను కాంగ్రెస్ పార్టీ కోరటం హాస్యాస్పదమని చినరాజప్ప అన్నారు. రాష్ట్రంలో డిపాజిట్లు లేకుండా పోయిన పార్టీ...కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీ గుర్తింపును ఎప్పుడో రద్దు చేయాల్సిందని చినరాజప్ప ఎదురు దాడి చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, రాజధానికి అడ్డంకులు సృష్టించాలని చూసి ఇలాగే విఫలమయ్యారన్నారు.