‘కాపు సత్యాగ్రహ యాత్రకు అనుమతి లేదు’
కొద్దికాలం వేచి ఉండాల్సిందే: చినరాజప్ప
Published Mon, Nov 14 2016 11:04 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
కాకినాడ : కాపు సత్యగ్రహ యాత్రకు అనుమతి లేదని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తని సభ కూడా ప్రశాంతంగా నిర్వహించుకుంటామని అన్నారని, ఆ తర్వాత రైలు, పోలీస్ స్టేషన్, వాహనాలు తగులబెట్టారని చినరాజప్ప సోమవారమిక్కడ అన్నారు. కాపులను బీసీల్లోకి చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి సమయం పడుతుందని, కొద్దికాలం వేచి ఉండాల్సిందేనని చినరాజప్ప వ్యాఖ్యానించారు. స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిన వెంటనే మంజునాథ కమిషన్ నివేదిక మేరకు న్యాయం చేస్తామని చినరాజప్ప తెలిపారు.
మరోవైపు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కోనసీమలో చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ ఓ పక్క చెబుతూనే.. మరో పక్క భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా యాత్రను అడ్డుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో యాత్ర పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 21 వరకూ ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.
Advertisement