అనుమతి లేకుండా ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్ర చేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు.
అమరావతి: అనుమతి లేకుండా ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్ర చేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన అనుమతులు తీసుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తునిలో విధ్వంసం జరిగింది కాబట్టే ముందు జాగ్రత్త చర్యగా అన్ని జిల్లాల్లో పోలీసులను మోహరించామని చినరాజప్ప తెలిపారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ముద్రగడ వ్యవహరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తన మాట నెగ్గించుకోవడం కోసమే ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని అన్నారు.
బీసీలలో కాపులను చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ త్వరలో తన నివేదికను ఇవ్వనుందని చినరాజప్ప తెలిపారు. రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని, విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు కావాలని కాపు నేతలుగా తామూ కోరుతున్నామని ఆయన అన్నారు. కాగా కాపు రిజర్వేషన్లపై ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ నేటి నుంచి చలో అమరావతి పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన యాత్రను పోలీసులు అడ్డుకుని 24 గంటల పాటు గృహనిర్బంధం చేశారు.