ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ముద్రగడ
కిర్లంపూడి: చలో అమరావతి పాదయాత్రపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయనను ప్రభుత్వం వారం పాటు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముద్రగడ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...‘ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడే పాదయాత్ర చేస్తా. నేను నడవలేనని హోంమంత్రి అంటున్నారు. నాకు అనుమతి ఇచ్చి చూడండి. పాదయాత్ర చేసి చూపిస్తా. ఐపీఎస్‌ల గౌరవాన్ని డీజీపీ దిగజార్చొద్దు. ఏడాది సర్వీస్ పొడిగింపు కోసం చంద్రబాబుకు వత్తాసు పలకొద్దు.
నా జాతి రోడ్డు మీదుంటే నేను వ్యక్తిగత పనులు చేసుకోవాలా?. పాదయాత్ర పూర్తయ్యేవరకూ ఎక్కడికీ వెళ్లను. మీరు అనుమతి ఇవ్వకపోతే జబ్బు వచ్చినా ఇంట్లోనే ఉంటా. చలో అమరావతి పాదయాత్ర చేసేవరకూ నేను విశ్రమించను. కాపులు మీకు విధ్వంసకారులుగా కనిపిస్తున్నారా?. మీరిచ్చిన హామీని నెరవేర్చాలని అడగటం తప్పా?. పాదయాత్ర విషయంలో చంద్రబాబుకో న్యాయం...కాపులకు మరో న్యాయమా?. మనం ఎక్కడికెళ్తున్నాం?. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రాణ త్యాగానికి అయినా సిద్ధం.’ అని అన్నారు.