chalo amaravati padayatra
-
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
ప్రత్తిపాడు: చట్టం చంద్రబాబుకు చుట్టంలా మారిందని, తమకు మాత్రం సెక్షన్ 30, 144 కేసులా? అంటూ ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తాను రోజూ పాదయాత్రకు బయలుదేరతానని చెప్పిన మేరకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రను అడ్డుకోవడంతో ఆయన నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి సభలు, సమావేశాలు పెట్టినపుడు బెంజి సర్కిల్లో రోజుల తరబడి ట్రాఫిక్ మళ్లించేస్తారని, తన పాదయాత్రకు మాత్రం అనుమతినివ్వడంలేదని విమర్శించారు. పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన ముద్రగడ కాసేపటికి అనుచరులతో కలిసి గేటు వద్దకు వచ్చి కంచాలపై దరువు వేస్తూ నిరసన తెలిపారు. మళ్లీ శనివారం పాదయాత్రకు బయలుదేరతానని ముద్రగడ చెప్పారు. -
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్!
కాకినాడ: చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడటంతో కిర్లంపూడిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా నేటితో గృహ నిర్బంధం ముగియడంతో ఆయన గురువారం ఉదయం పాదయాత్రకు బయల్దేరారు. అయితే ముద్రగడను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 2009 సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చూపించి పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు తెలపగా, చంద్రబాబు పాదయాత్రకు సంబంధించి 2014 గైడ్‌లైన్స్ చూపాలని ముద్రగడ ఈ సందర్భంగా పోలీసులకు కోరారు. చంద్రబాబు పాదయాత్రకు అనుమతిచ్చినవారు తనకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ ముద్రగడ ప్రశ్నించారు. అయినప్పటికీ యాత్రకు పోలీసులు అడ్డుకోవడంతో ముద్రగడ తిరిగి తన నివాసంలోకి వెళ్లిపోయారు. యాత్రకు అనుమతి ఇచ్చేవరకూ తన ప్రయత్నం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ‘చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడం సరికాదు. యాత్రపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపాలన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మంజునాథ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి పాదయాత్రపై రూట్‌మ్యాప్ అందచేశా. ఇది నిరవధిక పాదయాత్ర... వాయిదా వేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర చేసి తీరుతా.’ అని స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. -
ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ముద్రగడ
-
ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ముద్రగడ
కిర్లంపూడి: చలో అమరావతి పాదయాత్రపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయనను ప్రభుత్వం వారం పాటు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముద్రగడ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...‘ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడే పాదయాత్ర చేస్తా. నేను నడవలేనని హోంమంత్రి అంటున్నారు. నాకు అనుమతి ఇచ్చి చూడండి. పాదయాత్ర చేసి చూపిస్తా. ఐపీఎస్‌ల గౌరవాన్ని డీజీపీ దిగజార్చొద్దు. ఏడాది సర్వీస్ పొడిగింపు కోసం చంద్రబాబుకు వత్తాసు పలకొద్దు. నా జాతి రోడ్డు మీదుంటే నేను వ్యక్తిగత పనులు చేసుకోవాలా?. పాదయాత్ర పూర్తయ్యేవరకూ ఎక్కడికీ వెళ్లను. మీరు అనుమతి ఇవ్వకపోతే జబ్బు వచ్చినా ఇంట్లోనే ఉంటా. చలో అమరావతి పాదయాత్ర చేసేవరకూ నేను విశ్రమించను. కాపులు మీకు విధ్వంసకారులుగా కనిపిస్తున్నారా?. మీరిచ్చిన హామీని నెరవేర్చాలని అడగటం తప్పా?. పాదయాత్ర విషయంలో చంద్రబాబుకో న్యాయం...కాపులకు మరో న్యాయమా?. మనం ఎక్కడికెళ్తున్నాం?. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రాణ త్యాగానికి అయినా సిద్ధం.’ అని అన్నారు. -
ఆగస్ట్ 3 నుంచి మళ్లీ పాదయాత్ర: ముద్రగడ
కిర్లంపూడి: ఆగస్ట్ 3వ తేదీ నుంచి మళ్లీ పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పోలీసుల నోటీసులపై తాను కోర్టుకు వెళ్లనని, స్టేలు, బెయిల్ తెచ్చుకోవడం తనకు అలవాటు లేదని అన్నారు. కాగా చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వారం రోజుల పాటు గృహ నిర్భంధం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ...‘ముఖ్యమంత్రి తప్పు మీద తప్పు చేస్తున్నారు కాబట్టి 30 స్టేలు తెచ్చుకున్నారు. నాది ఆయన లాంటి జీవితం కాదు. మా జాతి ప్రయోజనాల కోసం నా పోరాటం కొనసాగిస్తా. కాపు జాతికి ఇచ్చిన హామీని నెరవేర్చేవరకూ ఉద్యమం ఆగదు. చంద్రబాబు ఎవరి అనుమతి తీసుకొని పాదయాత్ర చేశారు. పోలీసులకు ఆయనిచ్చిన నమునా నాకిస్తే నేను దరఖాస్తు చేస్తా. లేకుంటే నన్ను పాదయాత్ర చేసుకోనివ్వండి’ అని అన్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ...ఆగస్ట్ 2వరకూ ముద్రగడ హౌస్ అరెస్ట్ నేపథ్యంలో అప్పటివరకూ జిల్లాలో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోని ఉన్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని ఎస్పీ మరోసారి స్పష్టం చేశారు. -
తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు!: వైఎస్ జగన్
హైదరాబాద్ : చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ 24 గంటలపాటు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముద్రగడ అరెస్ట్‌పై ఆయన ట్విట్టర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి గారు.. ఒక్క విషయం చెప్పండి. ముద్రగడను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు. కాపులకు మీరిచ్చిన హామీని, మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అనేకదా వారు మిమ్మల్ని నిలదీస్తున్నది. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్‌లు, బైండోవర్లు చేయడం ఏంటి?. వేలమంది పోలీసులు మోహరించడమేంటి?.. తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు..’ అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు. కాగా కాపు రిజర్వేషన్లపై టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం ఇవాళ్ట నుంచి చలో అమరావతి పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయన్ని పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. pic.twitter.com/XyqdmZKjgc — YS Jagan Mohan Reddy (@ysjagan) 26 July 2017 -
అనుమతి లేకుండా పాదయాత్ర కుదరదు
అమరావతి: అనుమతి లేకుండా ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్ర చేయడం కుదరదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు ఆయన అనుమతులు తీసుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తునిలో విధ్వంసం జరిగింది కాబట్టే ముందు జాగ్రత్త చర్యగా అన్ని జిల్లాల్లో పోలీసులను మోహరించామని చినరాజప్ప తెలిపారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ముద్రగడ వ్యవహరించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తన మాట నెగ్గించుకోవడం కోసమే ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని అన్నారు. బీసీలలో కాపులను చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ త్వరలో తన నివేదికను ఇవ్వనుందని చినరాజప్ప తెలిపారు. రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని, విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు కావాలని కాపు నేతలుగా తామూ కోరుతున్నామని ఆయన అన్నారు. కాగా కాపు రిజర్వేషన్లపై ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ నేటి నుంచి చలో అమరావతి పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన యాత్రను పోలీసులు అడ్డుకుని 24 గంటల పాటు గృహనిర్బంధం చేశారు.