ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్!
కాకినాడ: చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడటంతో కిర్లంపూడిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా నేటితో గృహ నిర్బంధం ముగియడంతో ఆయన గురువారం ఉదయం పాదయాత్రకు బయల్దేరారు. అయితే ముద్రగడను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
2009 సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చూపించి పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు తెలపగా, చంద్రబాబు పాదయాత్రకు సంబంధించి 2014 గైడ్‌లైన్స్ చూపాలని ముద్రగడ ఈ సందర్భంగా పోలీసులకు కోరారు. చంద్రబాబు పాదయాత్రకు అనుమతిచ్చినవారు తనకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ ముద్రగడ ప్రశ్నించారు. అయినప్పటికీ యాత్రకు పోలీసులు అడ్డుకోవడంతో ముద్రగడ తిరిగి తన నివాసంలోకి వెళ్లిపోయారు. యాత్రకు అనుమతి ఇచ్చేవరకూ తన ప్రయత్నం కొనసాగుతుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ‘చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడం సరికాదు. యాత్రపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపాలన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మంజునాథ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి పాదయాత్రపై రూట్‌మ్యాప్ అందచేశా. ఇది నిరవధిక పాదయాత్ర... వాయిదా వేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర చేసి తీరుతా.’ అని స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.