ఆగస్ట్ 3 నుంచి మళ్లీ పాదయాత్ర: ముద్రగడ
కిర్లంపూడి: ఆగస్ట్ 3వ తేదీ నుంచి మళ్లీ పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పోలీసుల నోటీసులపై తాను కోర్టుకు వెళ్లనని, స్టేలు, బెయిల్ తెచ్చుకోవడం తనకు అలవాటు లేదని అన్నారు. కాగా చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వారం రోజుల పాటు గృహ నిర్భంధం చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ...‘ముఖ్యమంత్రి తప్పు మీద తప్పు చేస్తున్నారు కాబట్టి 30 స్టేలు తెచ్చుకున్నారు. నాది ఆయన లాంటి జీవితం కాదు. మా జాతి ప్రయోజనాల కోసం నా పోరాటం కొనసాగిస్తా. కాపు జాతికి ఇచ్చిన హామీని నెరవేర్చేవరకూ ఉద్యమం ఆగదు. చంద్రబాబు ఎవరి అనుమతి తీసుకొని పాదయాత్ర చేశారు. పోలీసులకు ఆయనిచ్చిన నమునా నాకిస్తే నేను దరఖాస్తు చేస్తా. లేకుంటే నన్ను పాదయాత్ర చేసుకోనివ్వండి’ అని అన్నారు.
మరోవైపు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ...ఆగస్ట్ 2వరకూ ముద్రగడ హౌస్ అరెస్ట్ నేపథ్యంలో అప్పటివరకూ జిల్లాలో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోని ఉన్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని ఎస్పీ మరోసారి స్పష్టం చేశారు.