
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమనే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు.
కాగా, ముద్రగడ పద్మనాభం శుక్రవారం పిఠాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. యువత రాబోయే భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. ఓటర్లు చంద్రబాబు మేనిఫెస్టోను ఒక్కసారి గమనించాలి. చంద్రబాబుకు అధికారం అనే ఆకలిని తీర్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు. అందుకే ఇలాంటి మేనిఫెస్టోను తెచ్చారు.
కానీ, ఓటర్లు చాలా తెలివైన వారు. చంద్రబాబు మాటలను, హామీలను నమ్మే పరిస్థితి లేదు. ఇక, పవన్ హైదరాబాద్‌కే పరిమితమయ్యే వ్యక్తి. అలాంటి పవన్ సీఎం కావాలని అనుకుంటున్నాడు. పదవి కోసమే మాత్రమే పవన్ పిఠాపురం వస్తున్నాడు. ముఖానికి రంగులు వేసుకుని పవన్ వస్తున్నాడు.
ఇక, ఇదే సమయంలో తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై కూడా ముద్రగడ స్పందించారు. ఈ సందర్బంగా ముద్రగడ.. కొందరు వ్యక్తులు నా కూతురితో నన్ను తిట్టించారు. ఇది చాలా బాధాకరం. నా కూతురుకు పెళ్లి అయిపోయింది.. ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే. నేను ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో చేరాను. ఇక, పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్నా సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. నాకు పదవులేమీ వద్దు. నేను కేవలం సేవకుడిని మాత్రమే’అని కామెంట్స్ చేశారు.