
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్‌కు జనరల్ మేనేజర్‌గా పవన్ కల్యాణ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కోరారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఎవరి కోసం యువగళం పాదయాత్ర చేశారని ముద్రగడ ప్రశ్నించారు.
కాగా, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో తణుకులో కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదు. సీఎం జగన్ పాలనపై నేను ప్రశ్నించలేదంటున్న పవన్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎక్కడ దాక్కున్నావ్.
పవన్ పేకాట క్లబ్‌లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్‌లు పెడుతూ నన్ను అవమానిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉందని సీఎం జగన్ నాడే చెప్పారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారు. మళ్లీ ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. చంద్రబాబు.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ.. పవన్‌ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడు. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే ఆయన త్యాగశీలిగా మిగిలిపోతాడు. సినిమా షూటింగ్స్ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నాడు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండి.
కూటమి అధికారంలోకి వస్తే సీఎం జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారు. దానికి మీకు అధికారం కావాలా?. నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. ఎవరైనా స్వచ్చమైన లిక్కర్ ఇస్తామని అంటారా?. పేదల పెన్నిది సీఎం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.