చంద్రబాబు రాజకీయ జూదం.. పవన్ జోకర్ పాత్రేనా? | Ksr Comments On Chandrababu's Political Gambling | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజకీయ జూదం.. పవన్ జోకర్ పాత్రేనా?

Published Wed, Mar 6 2024 12:00 PM | Last Updated on Wed, Mar 6 2024 3:57 PM

Ksr Comments On Chandrababu's Political Gambling - Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ జూదంలో ఒక జోకర్‌గా మిగిలిపోయేలా ఉన్నారు. చంద్రబాబు తనకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడ పవన్‌ను వాడేసుకుంటున్నారు. పేకాటలో జోకర్‌ను కూడా అలాగే వాడుతుంటారు. చివరికి పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మేలు కోరి మాట్లాడుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను, అలాగే జనసేనలోకి వెళ్దామా అని ఆలోచించిన మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నా చంద్రబాబు నాయుడే తనకు ఎక్కువ అనే దశకు చేరుకున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీని తానే అవమానించుకుంటూ ఆయన కళ్లలో ఆనందాన్ని చూస్తున్నట్లుగా పవన్ వ్యవహరించారు. లేకుంటే రాజకీయాలలో బలహీనతలను ఎవరూ అంత బహిరంగంగా చెప్పుకోరు. మరో పార్టీని గొప్పగా పొగడరు. మహా అయితే ఒక మంచి మాట చెబుతారు. కానీ, పవన్ కళ్యాణ్‌ మాత్రం అందుకు విరుద్దంగా జనసేన కేడర్ లేదా నేతలతో చర్చించవలసిన విషయాలను జెండా బహిరంగ సభలో ప్రస్తావించి తన పార్టీ గాలి తానే తీసుకున్నారు.

మనకు అంత బలం ఉందా? బూత్ స్థాయి బలగం ఉందా? భోజనం పెట్టే ఖర్చులు ఇవ్వగలమా? అంటూ ఏవేవో పిచ్చి ప్రేలాపలను చేసి టీడీపీ వారి దృష్టిలో మరీ చులకన అయిపోయారు. ఈ పరిణామం సహజంగానే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగా సంతోషం కలిగించి ఉంటుంది. అందుకే తాము మొదటి నుంచి జనసేనకు పదో- పరకో సీట్లు ఇస్తే, పవనే తమ వెంటపడి వస్తాడని వారు ఓపెన్‌గానే చెబుతూ వచ్చారు. దానిని పవన్ నిజం చేశారు. రెండు పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు దానిని టీడీపీలో చేరిక సభగా మార్చి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు టీడీపీ కండువా కప్పుతుంటే పవన్ కళ్యాణ్ బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయారు. పవన్ కళ్యాణ్ తనకు సలహా ఇస్తే ఒప్పుకోనని సొంత పార్టీ శ్రేయోభిలాషులపై ఆయన ఫైర్ అవుతుండడం చిత్రంగానే ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఒకవైపు చేగొండి, మరోవైపు ముద్రగడ లేఖలు రాసి పవన్‌ణు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ముద్రగడ లేఖ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు సార్లు కలుస్తానని కబురు చేసి, పవన్ ఆ తర్వాత ముద్రగడ ఊరువైపు కూడా వెళ్లకపోవడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. మామూలుగానే ముద్రగడ చాలా సున్నితంగా ఉండే మనిషి. ఎలాంటి అవమానాన్ని సహించే వ్యక్తి కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం అంటే అది అహంకారంతో కూడిన పని అని ముద్రగడ భావించి ఉండాలి. అందుకే ఆయన ఒక లేఖ రాస్తూ తనను కలవకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో తెలుసుకోగలనని వ్యాఖ్యానించారు.

అంటే పవన్‌తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడే ఉండవచ్చని ముద్రగడ అభిప్రాయపడుతుండవచ్చు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించారు. పోలీసులు బూతులు తిట్టడం ఆయన ఇప్పటికీ మరవలేరు. అయినా కాపు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్‌తో అవగాహనకు రావడానికి కూడా ముద్రగడ కొంత తగ్గితే ఇలా పరాభవం ఎందురైందని ఆయన బాధపడి ఉండవచ్చు. ఆ లేఖలో పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని, ఆయన ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఏమి చేయలేని నిన్సహాయ స్థితిలో పవన్ ఉన్నారని ఆయన తేల్చేశారు. కాపు జాతి కోసం తాను బాధలు, అవమానాలు అన్నింటి కారణంగా పవన్‌తో కలిసి ప్రయాణించడానికి సిద్దపడితే.. పవన్ తన వద్దకు వస్తానని రాలేకపోయారని అన్నారు. అయినా 24 సీట్లలో జనసేన పోటీకి తన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 80 అసెంబ్లీ సీట్లు, రెండున్నరేళ్లు సీఎం పదవి షేరింగ్ తీసుకుని ఒప్పందం అడగాల్సి ఉండగా, ఆ సాహసం పవన్ చేయలేకపోయారని ముద్రగడ తేల్చేశారు. తాను డబ్బు కోరుకోలేదని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని అంటూనే, మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడంతో మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుములా మిగిలిపోయాయని, అందుకే తనను కలవడానికి రాలేదని ముద్రగడ వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ నోరువిప్పలేదు. జనసేననేతలు కూడా ఎవరూస్పందించలేదు.

ఇక చేగొండి అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత నిస్సహాయంగా చంద్రబాబు, పవన్లను ఉద్దేశించి మీ ఖర్మ అని వ్యాఖ్యానించారు. కానీ, ఆ తర్వాత టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆయనను తూలనాడుతూ ప్రచారం చేసిందట. తనను వైఎస్సార్‌సీపీ కోవర్టుగా ముద్రవేసిందట. దాంతో ఆయన మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మేలు కోరి, కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాలని ఆశిస్తుంటే తనను కోవర్టు అంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా చేసిన వివిధ కార్యకలాపాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతకాలం క్రితం కాపు ఉద్యమ నేతలు మంగళగిరిలో పవన్‌ను కలిసినప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనని అన్నారు. ఇరవై సీట్లకు ఒప్పుకుంటానని అనుకోవద్దన్నట్లుగా మాట్లాడారు. కానీ, తీరా అసలు విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు, జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు మాటలకే విలువ ఇస్తున్నారన్న సంగతి వారికి బోధపడింది.

ఇప్పటికైనా చంద్రబాబు నోట రెండున్నరేళ్లపాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పించాలని చేగొండి డిమాండ్ చేశారు. ఇది హరిరామజోగయ్య అత్యాశే అనుకోవాలి. ఎందుకంటే తన కుమారుడు లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం పదవికి అంత సమర్ధుడు కాదని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు ఖండించలేదు. పవన్ కళ్యాణ్ కూడా అసలు అవమానంగా ఫీల్ కాలేదు. అయితే జోగయ్య వంటివారి అనుమానం ఏమిటంటే ఒకవేళ కూటమికి అధికారం వస్తే లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని, అప్పుడు పవన్ అడ్డురాకూడదని కోరుకుంటారని కావచ్చు. ఈ రకంగా చంద్రబాబు ఆడుతున్న జూదంలో పవన్ కళ్యాణ్ ఒక పావుగానో, లేక ఒక జోకర్‌గానో ఉంటున్నారనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు చేతిలో పవన్‌ బందీ అయిపోయారు.

బీజేపీతో పొత్తులో ఉండి, అక్కడ కాపురాన్ని వదలివచ్చినట్లు చెప్పకుండా, అనైతిక రాజకీయ సంబంధం పెట్టుకుని టీడీపీతో కలిసి ఉంటున్నారు. పైగా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ఆ పార్టీ పరువు కూడా తీశారు. కానీ, బీజేపీ అధిష్టానం వీరికి ఏ సంగతి చెప్పకుండా అల్లాడిస్తోంది. దాంతో పవన్ ఎప్పుటికప్పుడు ఢిల్లీ వెళతారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్లి బీజేపీతో ఒప్పందం చేసుకుంటారని ప్రచారం చేయిస్తుంటారు. కానీ, అది జరగలేదు. బీజేపీతో పొత్తు కోరుతూనే ఈ రెండు పార్టీలు సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించడం బీజేపీకి నచ్చుతుందా అన్నది సందేహం. ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమిలోకి రాకపోతే పవన్‌కు ఒకరకంగా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివాటిపై క్లారిటీ తెచ్చుకోవడానికి పవన్‌ కళ్యాణ్ తంటాలుపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు జోకర్‌లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడటం ఒక కోణం అయితే, కాపులు, బీజేపీ, తన అభిమానుల మధ్య సాలెగూడులో చిక్కిన పరిస్థితి ఆయనకు ఎదురవుతోందని చెప్పాలి.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement