షూటింగ్‌లు మానేసి ప్రజాసేవకు సిద్ధమా?  | Mudragada comments over Pawan Kalyan | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లు మానేసి ప్రజాసేవకు సిద్ధమా? 

Published Sat, Apr 6 2024 5:18 AM | Last Updated on Sat, Apr 6 2024 12:30 PM

Mudragada comments over Pawan Kalyan - Sakshi

ముఖానికి రంగు వేసుకునేవారిని ప్రజలు నమ్మరు 

పవన్‌కళ్యాణ్‌పై ముద్రగడ విమర్శలు 

జగన్‌ పాలనలోనే బీసీలకు సముచిత స్థానం: ఎమ్మెల్సీ కుడుపూడి 

కిర్లంపూడి: ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. షూటింగ్‌లు మానేసి, హైదరాబాద్‌లోని ఆస్తులు పూర్తిగా అమ్మేసి, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్‌టీ రామారావును మాత్రమే ప్రజలు విశ్వసించారన్నారు.

తన కుమారుడికి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగళం యాత్ర తప్ప మరొకరికి అధికారం ఇవ్వడానికి కాదన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజికవర్గాల నేతలు ముద్రగడను, యువనేత ముద్రగడ గిరిబాబును కిర్లంపూడిలోని వారి నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

ముద్రగడ నాయకత్వంలో పిఠాపురంలో వైఎస్సార్‌ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని ఆ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చెప్పా­రు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌ అఖండ మెజార్టీతో మరోసారి గెలిచి, ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు రామరాజ్యం స్థాపిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.  

వైఎస్సార్‌సీపీలో అన్నివర్గాలకు సముచిత స్థానం 
ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, బీసీలకు సముచిత స్థానం కల్పించి, పదవులు ఇ చ్చిన ఏకైక ప్రభుత్వం సీఎం వైఎస్‌ జగన్‌దేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్న వైఎస్సార్‌ సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. ముద్రగడ పద్మనాభం మద్దతుగా నిలవడంతో వైఎస్సార్‌ సీపీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం అప్పగిస్తే రాష్ట్ర భవిష్యత్తు నియంతల చేతిలోకి పోతుందని హెచ్చరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement