హైదరాబాద్ : చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ 24 గంటలపాటు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధం చేయడాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముద్రగడ అరెస్ట్‌పై ఆయన ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు.
‘ముఖ్యమంత్రి గారు.. ఒక్క విషయం చెప్పండి. ముద్రగడను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు. కాపులకు మీరిచ్చిన హామీని, మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అనేకదా వారు మిమ్మల్ని నిలదీస్తున్నది. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్‌లు, బైండోవర్‌లు చేయడం ఏంటి?. వేలమంది పోలీసులు మోహరించడమేంటి?.. తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు..’ అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు.
కాగా కాపు రిజర్వేషన్లపై టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం ఇవాళ్ట నుంచి చలో అమరావతి పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయన్ని పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 26 July 2017