మండిపడ్డ బాధితులు.. మంత్రి, కలెక్టర్ ఘెరావ్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గ్యాస్ పైప్లైన్ పేలుడుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్లను ఘెరావ్ చేశారు. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. పైపులైన్లు మాత్రం మార్చకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తాజా ప్రమాదం జరిగిందని అన్నారు. ఇక్కడ కొన్ని పైపులైన్లు గ్రామాల మధ్య నుంచి, మరికొన్ని పంటపొలాల మధ్య నుంచి ఉన్నాయి. దశాబ్దాల నాటి పైపులైన్లు కావడంతో పాటు, వాటి నిర్వహణను కూడా పట్టించుకోకపోవడమే తరచు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం అవుతోందని ఆరోపించారు.
దీంతో.. బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గెయిల్ నుంచి కూడా పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఢిల్లీనుంచి ఉన్నతాధికారులు వస్తున్నారన్నారు.
క్షతగాత్రులను రాజోలు, అమలాపురం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమించిన 8 మందిని మాత్రం అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున అంతా నిద్రమత్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారికంగా 13 మంది మరణించినట్లు చెబుతున్నా, మృతులసంఖ్య ఇప్పటికే 18కి చేరినట్లు సమాచారం. మరో 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు వచ్చి, పరిసరాలు తీవ్రంగా వేడెక్కాయి.