neethu prasad
-
వాతలు పెట్టిన ఆయాలపై వేటు
మంకమ్మతోట(కరీంనగర్): కరీంనగర్ పట్టణంలోని ఐసీడీఎస్ శిశుగృహంలో జరిగిన అమానుష ఘటనపై జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ బుధవారం కఠిన చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఆయాలను సర్వీసు నుంచి తొలగించడంతోపాటు క్రిమినల్ కేసులకు ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ శిశుగృహంలో విధుల్లో ఉన్న ఇద్దరు ఆయాలు ఎనిమిది మంది చిన్నారులకు స్పూన్‌తో కాల్చి వాతలు పెట్టారు. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం మంగళవారం వెలుగు చూసిన విషయం తెలసిందే. దీంతో కలెక్టర్ నీతూ ప్రసాద్ బుధవారం శిశుగృహాన్ని సందర్శించారు. చిన్నారులతో మాట్లాడారు. ఐసీడీఎస్ పీడీ మోహన్‌రెడ్డిపై ఆమె సీరియస్ అయ్యారు. శిశుగృహంలో కాంట్రాక్టుపై పని చేస్తున్న ఆయాలు బుచ్చమ్మ, శారద, పద్మలను సర్వీసు నుంచి తొలగించాలని ఆదేశించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించారు. -
అవయవదానంపై అవగాహన
త్వరలో గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం అవగాహన సదస్సులో కలెక్టర్ నీతూప్రసాద్ కరీంనగర్ : ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంపొందించేందుకు త్వరలో కరీంనగర్ జిల్లాలో గ్రామగ్రామాన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ తెలిపారు. బుధవారం అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జిల్లాలోని డాక్టర్లకు అవయవదానంపై ఆవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజల్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో త్వరలో ఎన్జీవోలు, వైద్య, ఆరోగ్య శాఖ, ఐఎంఏ సంస్థలతో కలిసి అవయవదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. అవయనదానంపై ప్రజలకు ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. ఈ సందేహాలను తొలగించేందుకు వంద మంది విద్యావేత్తలతో కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అపోలో హాస్పిటల్ వారు పుష్కరాల సందర్భంగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి నాలుగైదు ప్రాణాలను కాపాడారని అభినందించారు. అపోలో రీచ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ బాబురావు మాట్లాడుతూ... గురువారం జాతీయ అవయన దాన దినోత్సవం సందర్భంగా సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అవయవాలు అందక ఎన్నో మరణాలు : మనీష్ సీ.వర్మ దేశంలో ఆవయవాలు అందక ఎందరో ప్రజలు చనిపోతున్నారని అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వైద్యులు డాక్టర్ మనీష్ సీ.వర్మ అన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం వల్ల ఎనిమిది ప్రాణాలను కాపాడవచ్చునని చెప్పారు. ఇప్పటికి దేశంలో సంవత్సరానికి 2 లక్షల మందిలో 3500 మంది కిడ్నీ, వంద మంది గుండె, పది వేల మందిలో లివర్ తదితర అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మన దేశంలో 0.05 శాతం మంది మాత్రమే అవయవాలను దానం చేస్తున్నారని అన్నారు. అవయవాలను దానం చేయడానికి ఏ రూల్ అవసరం లేదని, బ్రెయిన్ డెత్ అయిన వారు ఎవ్వరైనా అవయవాలను దానం చేయవచ్చునని వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన్‌దాన్‌తో కలిసి అపోలో హాస్పిటల్స్ అవయవదానంపై కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మరో డాక్టర్ సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు భూంరెడ్డి, మంజునాథ్, అనమల్ల నరేష్, శ్యాంసుందర్, రఘురామన్, నరేంద్రపాల్గొన్నారు. -
మండిపడ్డ బాధితులు.. మంత్రి, కలెక్టర్ ఘెరావ్
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్లను ఘెరావ్ చేశారు. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. పైపులైన్లు మాత్రం మార్చకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తాజా ప్రమాదం జరిగిందని అన్నారు. ఇక్కడ కొన్ని పైపులైన్లు గ్రామాల మధ్య నుంచి, మరికొన్ని పంటపొలాల మధ్య నుంచి ఉన్నాయి. దశాబ్దాల నాటి పైపులైన్లు కావడంతో పాటు, వాటి నిర్వహణను కూడా పట్టించుకోకపోవడమే తరచు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం అవుతోందని ఆరోపించారు. దీంతో.. బాధితులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇవ్వడంతో పాటు గెయిల్ నుంచి కూడా పరిహారం ఇప్పిస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఢిల్లీనుంచి ఉన్నతాధికారులు వస్తున్నారన్నారు. క్షతగాత్రులను రాజోలు, అమలాపురం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమించిన 8 మందిని మాత్రం అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున అంతా నిద్రమత్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారికంగా 13 మంది మరణించినట్లు చెబుతున్నా, మృతులసంఖ్య ఇప్పటికే 18కి చేరినట్లు సమాచారం. మరో 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు వచ్చి, పరిసరాలు తీవ్రంగా వేడెక్కాయి. -
వర్షానికి తడిసిన ఈవీఎంలు
-
స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు... తడిసిన ఈవీఎంలు
కాకినాడ నగరంలోని జేఎన్టీయూ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందినవి తడిచిపోయాయి. ఆ విషయాన్ని గమనించిన స్ట్రాంగ్ రూం భద్రత సిబ్బంది వెంటనే ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్‌కు సమాచారం అందించారు. దాంతో ఆమె హుటాహుటిన స్ట్రాంగ్ రూంకు వచ్చి... తడిసిపోయిన ఈవీఎంలను పరిశీలిస్తున్నారు. తమ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు వర్షపు నీటిలో తడిశాయని ఆ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు తెలియడంతో వారు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. శుక్రవారం తమ భవితవ్యం తేలనున్న తరుణంలో ఈవీఎంలు తడిసిపోవడంతో వారు తీవ్ర విచారంతో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను కాకినాడ జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలన్నీ జలమయమైనాయి. అందులోభాగంగా స్ట్రాంగ్ రూంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ఈవీఎంలు తడిసిపోయాయి. -
16న సీఎం పర్యటన
కలెక్టరేట్ (కాకినాడ), న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 16న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పర్యటించనున్నారని కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. మండల, డివిజనల్ అధికారులతో కలెక్టరేట్ నుంచి ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రచ్చబండ కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రామాణీకరించిన బ్యాక్ డ్రాప్‌లను మాత్రమే ప్రదర్శించాలన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి దరఖాస్తుకూ తప్పనిసరిగా రశీదు అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవలి భారీ వర్షాల వల్ల ఐదు రోజులకు పైబడి ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 20 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. మూడు రోజులు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 10 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయాలని సూచించారు. బాధితుల వివరాలు, పంట, ఇళ్లకు జరిగిన నష్టాల జాబితాను వారం రోజుల్లో పూర్తి చేయాలని, నమోదు సక్రమంగా చేయాలని చెప్పారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమీక్షిస్తూ జిల్లాలో కొత్తగా అర్హత పొందిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో బి.యాదగిరి, సీపీఓ వి.మహీపాల్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చంద్రశేఖరరాజు, జేడీఏ ఎన్.విజయ్ కుమార్, జేడీ ఏహెచ్ లివింగ్స్టన్, మత్స్యశాఖ జేడీ గోవిందయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.