త్వరలో గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం
అవగాహన సదస్సులో కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్ : ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంపొందించేందుకు త్వరలో కరీంనగర్ జిల్లాలో గ్రామగ్రామాన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ నీతూకుమారిప్రసాద్ తెలిపారు. బుధవారం అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జిల్లాలోని డాక్టర్లకు అవయవదానంపై ఆవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజల్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో త్వరలో ఎన్జీవోలు, వైద్య, ఆరోగ్య శాఖ, ఐఎంఏ సంస్థలతో కలిసి అవయవదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. అవయనదానంపై ప్రజలకు ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు.
ఈ సందేహాలను తొలగించేందుకు వంద మంది విద్యావేత్తలతో కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అపోలో హాస్పిటల్ వారు పుష్కరాల సందర్భంగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి నాలుగైదు ప్రాణాలను కాపాడారని అభినందించారు. అపోలో రీచ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ బాబురావు మాట్లాడుతూ... గురువారం జాతీయ అవయన దాన దినోత్సవం సందర్భంగా సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అవయవాలు అందక ఎన్నో మరణాలు : మనీష్ సీ.వర్మ
దేశంలో ఆవయవాలు అందక ఎందరో ప్రజలు చనిపోతున్నారని అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వైద్యులు డాక్టర్ మనీష్ సీ.వర్మ అన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం వల్ల ఎనిమిది ప్రాణాలను కాపాడవచ్చునని చెప్పారు. ఇప్పటికి దేశంలో సంవత్సరానికి 2 లక్షల మందిలో 3500 మంది కిడ్నీ, వంద మంది గుండె, పది వేల మందిలో లివర్ తదితర అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. మన దేశంలో 0.05 శాతం మంది మాత్రమే అవయవాలను దానం చేస్తున్నారని అన్నారు. అవయవాలను దానం చేయడానికి ఏ రూల్ అవసరం లేదని, బ్రెయిన్ డెత్ అయిన వారు ఎవ్వరైనా అవయవాలను దానం చేయవచ్చునని వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన్‌దాన్‌తో కలిసి అపోలో హాస్పిటల్స్ అవయవదానంపై కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మరో డాక్టర్ సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు భూంరెడ్డి, మంజునాథ్, అనమల్ల నరేష్, శ్యాంసుందర్, రఘురామన్, నరేంద్రపాల్గొన్నారు.