స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు... తడిసిన ఈవీఎంలు
కాకినాడ నగరంలోని జేఎన్టీయూ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందినవి తడిచిపోయాయి. ఆ విషయాన్ని గమనించిన స్ట్రాంగ్ రూం భద్రత సిబ్బంది వెంటనే ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్కు సమాచారం అందించారు. దాంతో ఆమె హుటాహుటిన స్ట్రాంగ్ రూంకు వచ్చి... తడిసిపోయిన ఈవీఎంలను పరిశీలిస్తున్నారు. తమ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు వర్షపు నీటిలో తడిశాయని ఆ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు తెలియడంతో వారు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. శుక్రవారం తమ భవితవ్యం తేలనున్న తరుణంలో ఈవీఎంలు తడిసిపోవడంతో వారు తీవ్ర విచారంతో ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను కాకినాడ జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలన్నీ జలమయమైనాయి. అందులోభాగంగా స్ట్రాంగ్ రూంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ఈవీఎంలు తడిసిపోయాయి.