'నగరం'ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మామిడికుదురు : 'నగరం' గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె గెయిల్, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నలుగురు డైరెక్టర్లతో ఓ బృందం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బృందం 15 రోజులు నగరంలో పర్యటించి వివిధ అంశాలపై పరిశీలన జరిపి నివేదిక అందచేస్తుందని పేర్కొన్నారు. దాని ఆధారంగా గెయిల్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుందన్నారు. ఈ నెల 6న వాహనాలు, పంటలు కోల్పోయిన బాధితులకు రూ.1.02 కోట్ల పరిహారాన్ని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అందచేస్తారన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పైప్ లైన్ నమునా శాంపిల్ పంపించాలని పెట్రోలియం శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.